జాడలేని దళిత వాడల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-09-27T06:04:30+05:30 IST

దళితవాడలను అభివృద్ధి చేయడానికి అంచనాలు రూపొందించి ఏడాది అవుతున్నా నిధులు విడుదల కావడం లేదు.

జాడలేని దళిత వాడల అభివృద్ధి
కథలాపూర్‌ మండలం చింతకుంట దళితవాడల్లో సర్వే చేస్తున్న అధికారులు

- అంచనాలు రూపొందించినా మోక్షం లేదు

- నిధుల కోసం ఎదురుచూపులు

- జిల్లాలో రూ. 176.54 కోట్ల ప్రతిపాదనలు

జగిత్యాల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): దళితవాడలను అభివృద్ధి చేయడానికి అంచనాలు రూపొందించి ఏడాది అవుతున్నా నిధులు విడుదల కావడం లేదు. పంచాయతీరాజ్‌ అధికారులు నెల రోజుల పాటు గ్రామ గ్రామాన దళితవాడలను సందర్శించి చేయాల్సిన పనులను గుర్తించారు. మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలను రూపొందించి సర్కారుకు అందజేశారు. జిల్లాలో రూ. 176.54 కోట్లతో పంచాయతీ రాజ్‌ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. సర్కారు మంజూరు చేసే నిధులపై దళిత, గిరిజనులు ఎంతో ఆశతో ఉన్నారు. 

అన్ని గ్రామాల్లో అధికారుల పరిశీన

జిల్లాలో 4,266 ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలను అధికారులు పరిశీలన చేశారు.  ఇందులో 3,554 ఎస్సీ లొకేషన్‌లు, 712 ఎస్టీ లొకేషన్లున్నాయి. జిల్లాలో అత్యధికంగా మల్లాపూర్‌ మండలంలో 384 ఎస్సీ, ఎస్టీ లొకేషన్లుండగా అత్యల్పంగా బుగ్గారం మండలంలో 24 ఎస్సీ, ఎస్టీ లొకేషన్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా పంచాయతీ రాజ్‌శాఖకు ఆయా ప్రాంతాల్లో మౌలిక సమస్యల పరిష్కారం కోసం ఏం చర్యలు చేపట్టాలనే వివరాలను ఏడాది క్రితం సేకరించారు. పీఆర్‌ అధికారులు సమస్యల జాబితా తయారు చేశారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన మురుగు కాల్వలు, సీసీ రోడ్లు, విద్యుత్‌ బల్బులు, స్తంభాల ఏర్పాటుపై అంచనాలు రూపొందించారు. 

అందని నిధులు

జిల్లాలోని అన్ని గ్రామాల్లో దళిత, గిరిజన కాలనీల్లో  వివిధ అభివృద్ధి పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా రూ. 176.54 కోట్లతో అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించారు. జిల్లాలో రూ. 110.17 కోట్ల నిధులతో 2,86,201 మీటర్ల పొడవు గల 3,913 సీసీ రహదారుల నిర్మాణాలు, రూ. 64.04 కోట్ల నిధులతో 3,15,555 మీటర్ల పొడవు గల 3,358 మురికి కాలువల నిర్మాణాలు, రూ. 2.33 కోట్ల నిధులతో 2,464 విద్యుత్‌ స్తంబాలు, బల్పుల ఏర్పాటు పనులు నిర్వహించాలన్న అంచనాలతో ప్రతిపాదించారు. పంచాయతీ రాజ్‌ అధికారులు గ్రామాలను సందర్శించి సర్వేలు నిర్వహించినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో సంబందిత కాలనీవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు ఎప్పుడు మంజూరు చేస్తుందా.. కాలనీలు ఎప్పుడు అభివృద్ధి జరుగుతాయా అని ఎదురుచూపులతో గడుపుతున్నారు.

నిధులు మంజూరు కావాల్సి ఉంది

- రహమన్‌, పీఆర్‌ ఈఈ, జగిత్యాల

ప్రభుత్వం దళిత, గిరిజన వాడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నది. ఆయా ప్రాంతాల్లో నూతనంగా సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశాం. రూ. 176.54 కోట్లతో అంచనాలు తయారు చేసిన నివేదికలు ప్రభుత్వానికి పంపించాం. నిధులు మంజూరు కావాల్సి ఉంది.  నిధులు మంజూరు అయ్యే అవకాశాలున్నాయి.

Read more