మరో మూడు నియోజకవర్గాలకు దళితబంధు

ABN , First Publish Date - 2022-01-23T06:06:10+05:30 IST

దళితబంధు పథకానికి జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గం పైలెట్‌ ప్రాజెక్టుగా నిలవగా, ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు ఆ పథకం విస్తరించనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసి ఒక్కో నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.

మరో మూడు నియోజకవర్గాలకు దళితబంధు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

 - 300 మందికి అందనున్న పది లక్షల సహాయం

- ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల ఎంపిక 

- మార్చి 7న యూనిట్ల గ్రౌండింగ్‌

- హుజూరాబాద్‌లో ఇప్పటికే 17,554 మంది ఎంపిక

- అందరి ఖాతాల్లో 9.90 లక్షల జమ 

- 105 యూనిట్ల గ్రౌండింగ్‌ పూర్తి


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)


దళితబంధు పథకానికి జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గం పైలెట్‌ ప్రాజెక్టుగా నిలవగా, ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు ఆ పథకం విస్తరించనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసి ఒక్కో నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించి ఉపాధి పొందేలా తోడ్పాటు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంపూర్ణ స్థాయిలో ఈ పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేస్తుండడంతో ఆ నియోజకవర్గంలో ఇప్పటికే 17,554 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఒక్కో నియోజకవర్గానికి వంద మంది చొప్పున జిల్లాలోని మానకొండూర్‌, చొప్పదండి, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో మూడు వందల మంది దళితులకు పదేసి లక్షల రూపాయల చొప్పున 30 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందనున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలమేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం దళితబంధు పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి మంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించగా హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్‌ బొజ్జ, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మొదటి దశలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు సమావేశమై ఫిబ్రవరి 5వ తేదీలోగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని మంత్రి ఈశ్వర్‌ సూచించారు. అలాగే మార్చి 7వ తేదీలోగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం శనివారం వంద కోట్ల రూపాయలు విడుదల చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో 1200 కోట్ల రూపాయలు విడుదల చేసి కలెక్టర్ల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని దళిత కుటుంబాలకు దళితబంధు పథకం అమలవు తుందని ఆయన తెలిపారు. 2021 ఆగస్టు 16న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రారంభించారు. ఆ నియోజకవర్గాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సంపూర్ణస్థాయిలో అర్హులైన దళితులందరికీ పదేసి లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించి వారు ఆర్థికంగా స్థితిమంతులయ్యేందుకు వారు కోరుకున్న యూనిట్లు నెలకొల్పుకునేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. 

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో హుజూరాబాద్‌ మండలంలో 5,323, వీణవంక మండలంలో 3,678, జమ్మికుంట మండలంలో 4,996, ఇల్లందకుంట మండలంలో 2,586, కమలాపూర్‌ మండలంలో 4,346 దళిత కుటుంబాలు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తంగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలు ఉండగా 17,554 కుటుంబాల వారు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించడానికి అర్హులుగా గుర్తించారు. మరో 50 కుటుంబాలు అధికారుల పరిశీలనలో పెండింగ్‌లో ఉన్నాయి. అర్హులైన లబ్ధిదారులుగా గుర్తించిన 17,554 కుటుంబాలకు చెందిన వారి బ్యాంకు ఖాతాల్లో 9 లక్షల 90 వేల రూపాయల చొప్పున ఇప్పటికే జమ చేశారు. మరో 10 వేల రూపాయలు దళితబంధు లబ్ధిదారుల రక్షణ నిధి ఖాతాలో జమచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులమీదుగా చెక్కులు అందుకున్న 15 మంది కోరుకున్న యూనిట్లను ఇప్పటికే వారికి సమకూర్చారు. అలాగే మరో 90 మందికి కూడా యూనిట్లను అందించారు. వంద మందికి త్వరలో యూనిట్లు అందించి వాటిని ప్రారంభించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. 801 యూనిట్ల స్థాపనకు అవసరమైన డబ్బును పని ప్రగతిని బట్టి పాక్షికంగా చెల్లించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సంపూర్ణ స్థాయిలో పథకాన్ని అమలు చేసి ఇక్కడ ఎదురైన సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలు, వాటి అనుభవాలతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యేలోగా హుజూరాబాద్‌లో లబ్ధిదారులు యూనిట్లు స్థాపించుకునేలా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సురేశ్‌, తదితర జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన సూచనలు చేస్తున్నారు. జిల్లాలో మానకొండూర్‌, కరీంనగర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లో 300 మందికి దళితబంధు ఆర్థిక సహాయం అందనున్నందున జిల్లావ్యాప్తంగా సుమారు 17,700 మందికి 1770 కోట్ల లబ్ధి చేకూరనున్నది.

Read more