చోరీలకు పాల్పడుతున్న జంట అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-09-27T05:57:13+05:30 IST

పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న జంటను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద బంగారు, వెండి అభరణాలతోపాటు ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

చోరీలకు పాల్పడుతున్న జంట అరెస్ట్‌
రికవరీ సొత్తును చూపిస్తున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

సిరిసిల్ల క్రైం, సెప్టెంబరు 26: పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న జంటను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద బంగారు, వెండి అభరణాలతోపాటు ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా  మానకొండూరు మండలం ఊటూరుకు చెందిన వడ్డెపల్లి సత్యం జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం గంభీరావుపేట మండల కేంద్రానికి వలస వచ్చాడు. కూలీ పనుల కోసం సిరిసిల్లకు వస్తుంటాడు. ఇదే క్రమంలో సిరిసిల్ల లేబర్‌ అడ్డా వద్ద జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మీతో పరిచయమైంది. ఆరేళ్లుగా వీరు సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో నివాసం ఉంటున్నారు.  మద్యానికి బానిసై, జల్సాలకు అలవాటుపడి   దొంగతనాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఆ ఆభరణాలను విక్రయించడానికి సోమవారం సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్‌కు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద 6 తులాల 840 గ్రాముల బంగారు, 27 తులాల 200 మిల్లీ గ్రాముల వెండి ఆభరణాలు, ఒక  ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.   సొత్తు దాదాపు రూ.4.50 లక్షల విలువ ఉంటుందని ఎస్పీ తెలిపారు.   సిరిసిల్ల పట్టణంలోని 8 చోరీ కేసుల్లో వారు నిందితులని పేర్కొన్నారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా   సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో నివసించే వారు ఊళ్లకు వెళ్తే  స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. డబ్బు, బంగారు ఆభరణాలు ఇళ్లలో ఉంచవద్దన్నారు.   సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ విశ్వప్రసాద్‌, టౌన్‌ సీఐ అనిల్‌కుమార్‌, ఎస్సై శ్రీకాంత్‌, హెడ్‌ కానిస్టేబుల్‌లు పుల్కం శ్రీనివాస్‌, రాంగోపాల్‌, పద్మ కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌ ఉన్నారు. 

Read more