పత్తి రైతు దిగాలు

ABN , First Publish Date - 2022-10-08T05:56:17+05:30 IST

పత్తి ధరలు ఈ సారి ఊరిస్తున్నా తెగుళ్లు రైతన్నను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో ధరపలికే అవకాశం ఉండడంతో వ్యాపారులు రైతులతో ముందస్తుగా ఒప్పందాలు చేసుకుంటున్నారు.

పత్తి రైతు దిగాలు

-  ఊరిస్తున్న ధర.. దిగుబడిపై ఆందోళన 

-  వర్షాలతో దెబ్బతింటున్న పంట 

- పత్తిని చుట్టేస్తున్న  తెగుళ్లు 

- 54,489 ఎకరాల్లో సాగు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పత్తి ధరలు ఈ సారి ఊరిస్తున్నా తెగుళ్లు రైతన్నను ఆందోళనకు గురి చేస్తున్నాయి.  రికార్డు స్థాయిలో ధరపలికే అవకాశం ఉండడంతో  వ్యాపారులు రైతులతో ముందస్తుగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. సీసీఐ మద్దతు ధరకు మించి  కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు. కానీ నిరం తరం కురుస్తున్న వర్షాలకు తోడుగా తెగుళ్ల బెడదతో దిగుబడిపై రైతులు దిగాలు చెందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో 90 వేల ఎకరాల వరకు సాగు చేసేవారు. కాళేశ్వరం జలలు, సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో రైతులు వరి వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి సాగు తగ్గింది. 2.35 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా వరి 1.77 లక్షల ఎకరాల్లో వేశారు. పత్తి 54,489 ఎకరాల్లోనే సాగు చేశారు. సీజన్‌ ప్రారంభంలో కురిసిన వర్షాలకు మొక్క దశలోనే కొంత పత్తి కొట్టుకుపోయింది. మిగిలిన పత్తికి ఆకుముడత, రసం పీల్చే పురుగు, గులాబీ వంటి తెగుళ్లు సోకుతుండడం  అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది.  దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడన ప్రభావంతో నిరంతరంగా వర్షాలు పడుతుండడం చీడపీడల ఉధృతికి ఊతమిస్తోంది.  కాయ పక్వానికి రాకుండానే నలుపుబారి దెబ్బతిం టోంది. ఈసారి ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వర్షాలతో కలుపు సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోంది. కలుపు నివారణ మందులు పిచికారికి నిషేధాజ్ఞలు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరకక కూడా రైతులు అవస్థలు పడుతున్నారు. 

రైతుల వద్దకు వ్యాపారులు

అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ పెరగడం, తెలంగాణ పత్తి నాణ్యతగా ఉండడంతో మరింత ధర పలుకుతోంది. దీంతో వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముందస్తుగానే రైతుల వద్దకు వచ్చి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు, పంట అంచనాలు వేసి ముందుగానే ధర  నిర్ణయిస్తున్నట్లు  తెలుస్తోంది. రైతులను తమ వైపు తిప్పుకోవడానికి వ్యాపారులు ప్రయత్నిస్తున్నట్లు పల్లెల్లో  చర్చించుకుంటున్నారు. సీసీఐ ఇచ్చే మద్దతు ధర కంటే ప్రైవేటు వ్యాపారులు  ఎక్కువగా చెల్లించడానికి ముందుకు వస్తుండడంతో రైతుల్లో అనందం వ్యక్తం అవుతున్నా దిగుబడి మాత్రం నిరాశకు గురి చేస్తోంది. 


పత్తికి ఎర్ర బొమ్మిడి సోకింది 

- బోడ లక్ష్మారెడ్డి, రైతు ముస్కానిపేట 

వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తికి ఎర్ర బొమ్మిడి తెగులు సోకింది.  పంట ఎదుగుదల లోపించి, దిగుబడి తగ్గే అవకాశం ఉంది. పత్తి కాయ పగిలి ఏరడానికి సిద్ధంగా ఉన్నా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చేలలోకి వెళ్లలేకపోతున్నాం. 


వర్షంతో రాలుతున్న పూత 

- బొడిగే లనిల్‌, కౌలురైతు, మర్రిగడ్డ 

అధిక వర్షాలతో పత్తిపంట పూత రాలిపోతోంది. పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు.  ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాను.    లక్ష రూపాయలకుపైగా పెట్టుబడి పెట్టాను. పంట నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

Read more