విద్యార్ధిని మృతిపై కొనసాగిన ఆందోళన

ABN , First Publish Date - 2022-07-05T07:08:46+05:30 IST

జమ్మికుంటలో అఖిల అనే విద్యార్ధిని మృతిపై ఆందోళనలు రెండో రోజు కొనసాగాయి.

విద్యార్ధిని మృతిపై కొనసాగిన ఆందోళన
పాఠశాల ఎదుట ధర్నా చేస్తున్న తల్లిదండ్రులు, బందువు

- తమ కుమార్తె మృతదేహం అప్పగించాలంటూ తల్లిదండ్రలు డిమాండ్‌ 

- ఆర్వోబీ ఎదుట విద్యార్ధి సంఘాలు, బందువుల ధర్నా

జమ్మికుంట, జూలై 4: జమ్మికుంటలో అఖిల అనే విద్యార్ధిని మృతిపై ఆందోళనలు రెండో రోజు కొనసాగాయి. న్యూ మిలీనియం పాఠశాల ఎదుట విద్యార్థిని తల్లిదండ్రులు, బందువులు, విద్యార్ధి సంఘాల నాయకులు ఆదివారం ఉదయం నుంచి చేపడుతున్న నిరసన కార్యక్రమం సోమవారం సాయంత్రం వరకు సాగింది. పాఠశాల వద్ద పోలీస్‌లు భారీగా మోహరించారు. ఉదయం 10 గంటల సమయంలో విద్యార్ధి సంఘాల నాయకులు, గ్రామస్థులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. అఖిల మృతదేహాన్ని చూపించాలని, అప్పటి వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పాఠశాల నుంచి ర్యాలీగా గాంధీ చౌరస్తా మీదుగా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. ఆర్వోబీ ఎంట్రెన్స్‌లో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్‌ వచ్చే వరకు కదిలే ప్రసక్తి లేదన్నారు. అప్పటికే బ్రిడ్జి మీద కనుచూపు మేరా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీస్‌లు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. హుజూరాబాద్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐ కె రామ్‌చందర్‌రావు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో పోలీస్‌లు విద్యార్థిని తల్లిదండ్రులకు హమీ ఇవ్వడంతో శాంతించారు. అక్కడి నుంచి హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురి వద్దకు తల్లిదండ్రులను తీసుకువెళ్లి మృతదేహాన్ని చూపించారు. అఖిల తండ్రి మల్లారెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.      

విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

- కలెక్టరేట్‌ ఎదుట ఏబీవీపీ ధర్నా

సుభాష్‌నగర్‌: జమ్మికుంటలోని ప్రైవేటు పాఠశాలలో మృతి చెందిన విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ మల్యాల రాకేశ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం విద్యార్థిని మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని మృతిపై విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదన్నారు. యాజమాన్యం కనీస పట్టింపు లేకుండా, ఆ అమ్మాయి ఫిట్స్‌తో చనిపోయిందని అంటోందని విమర్శించారు. విద్యార్థిని మృతిపై వెంటనే విచారణ జరిపించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, లేని యెడల పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో రాష్ట్ర కార్యవర్గ సమితి సభ్యుడు నైతం మహేశ్‌, నగర కార్యదర్శి, జిల్లా విభాగ్‌ మహిళా కన్వీనర్లు సౌమ్య, ప్రవళ్లిక, నగర జోనల్‌ ఇన్‌చార్జీలు విష్ణు, దాడి అజిత్‌, నగర సంయుక్త కార్యదర్శి నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దివ్య, నితీష్‌ శ్రీ వర్దన్‌, అరుణ్‌, నాగరాజు, పునీత్‌ పాల్గొన్నారు.

Read more