-
-
Home » Telangana » Karimnagar » Confusion-NGTS-Telangana
-
కలకలం...
ABN , First Publish Date - 2022-09-19T05:42:39+05:30 IST
ఉమ్మడి జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) చాపకింద నీరులా పనిచేస్తుందనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందాలు దాడులకు చేశాయి.

- జిల్లా కేంద్రంలో ఎన్ఐఏ సోదాలు
- అదుపులో పీఎఫ్ఐ కార్యకర్త
- నిజామాబాద్ సంఘటనతో కూపీ లాగుతున్న వైనం
(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్)
ఉమ్మడి జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) చాపకింద నీరులా పనిచేస్తుందనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందాలు దాడులకు చేశాయి. తెలుగురాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎన్ఐఏ బృందాలు దాడులు జరపడంతో ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తున్న సంఘటనలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో అనుమానిత ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఎన్ఐఏ బృందాలు దాడులు నిర్వహించాయి. జగిత్యాలకు చెందిన పీఎఫ్ఐ కార్యకర్త మహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్ అక్కడి నుంచి మకాం మార్చి కరీంనగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కుటుంబసభ్యులతో ఉంటున్నట్లు సమాచారాన్ని ఎన్ఐఏ సేకరించింది. కరీంనగర్‌లోని హుస్సేనిపురాలో మహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్ ఇంటిపై ఆకస్మిక దాడులు జరిపి ఆయన వద్ద లభించిన పీఎఫ్ఐ సాహిత్యంతోపాటు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపించేందుకు వినియోగిస్తున్నట్లు భావించిన కంప్యూటర్ ల్యాబ్‌టాప్, సెల్‌ఫోన్, ఆయన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతా పుస్తకాలు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది.
- పక్కా సమచారంతో..
ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థ ఆ ప్రాంతానికి చెందిన కొందరు యువకులను ఎంపిక చేసి ఒకవర్గంపై మతవిద్వేషాలను రెచ్చగొట్టడం, మతకల్లోలాలు, గొడవలు సృష్టించడం, దాడులకు ప్రేరేపించడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పక్కా సమాచారాన్ని సేకరించిన అక్కడి పోలీసులు పీఎఫ్ఐ సంస్థకు చెందిన వారి ఇళ్ళపై దాడులు జరిపి వారిని అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం 28 మందిపై కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద లభించిన డైరీ ఆధారంగా ఆ కేసుతో సంబంధం ఉన్న పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల వివరాలను కూపీలాగుతూ ఎన్ఐఏ బృందాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వారికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నట్లు మరింత లోతుగా అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం అర్ధరాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఎన్ఐఏ బృందాలు కరీంనగర్‌లోని హుస్సేనిపురాలో కూడా దాడుల చేసి అనుమానిత ఇర్ఫాన్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఉమ్మడి జిల్లాలో ఉగ్రవాద చర్యలకు ప్రేరేపిస్తున్న పలు సంఘటనల నేపథ్యంలో ఈ జిల్లాలో ఉగ్రవాద చర్యలు జరుగుతున్నట్లు ఎన్ఐఏ భావిస్తున్నట్లు సమాచారం.
-ఉలిక్కిపడ్డ కరీంనగర్
రెండు దశాబ్దాల తర్వాత ఉమ్మడి జిల్లా ఉగ్రవాద కార్యకలాపాల పేరిట పోలీసులు జరుపుతున్న సోదాలతో మరోసారి ఉలిక్కిపడింది. ఆదివారం తెల్లవారు జామున ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహించి అనుమానిత ఒకరిని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. 2000 సంవత్సరంలో జగిత్యాల పట్టణంలో ఐఎస్ఐ ఏజెంట్ ఆజాంఘోరీ, కరీంనగర్ రేకుర్తిలో 2002లో లష్కరే ఉగ్రవాది అజీజ్ పోలీసు ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఆ తర్వాత 2014లో చొప్పదండిలో బ్యాంకు దోపిడీ సంఘటనలో ఉగ్రవాదుల పాత్ర ఉన్నట్లు ధృవీకరించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్ఐఏ బృందాలు జగిత్యాల పట్టణంలోని అనుమానిత ప్రాంతాలతోపాటు కరీంనగర్లో కూడా సోదాలు నిర్వహించాయి. జగిత్యాలకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్ అక్కడి నుంచి మకాం మార్చి కరీంనగర్‌లోని హుస్సేనిపురాలో కుటుంబసభ్యులతో ఉంటూ ప్లంబర్ పని చేస్తున్నట్లు చెబుతూ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కొద్దిరోజులుగా నివాసముంటున్న మహ్మద్ ఇర్ఫాన్ ఇంటిని ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో స్థానిక పోలీసుల సహాయంతో చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు పోలీసులు హుస్సేనిపురా ప్రాంతాన్ని అదుపులోకి తీసుకొని ఇర్ఫాన్ ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకోవడంతో ఆప్రాంత ప్రజలు అసలు ఏమి జరుగుతుందో, జరిగిందో తెలియక తీవ్రభయాందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసు అధికారులు ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించడం లేదు.
- ముగ్గురు అనుమానిత వ్యక్తులపై నిఘా
- సీపీ సత్యనారాయణ
కరీంనగర్‌కు చెందిన పీఎఫ్ఐ నాయకులపై మత విద్వేషాలను ప్రేరేపిత అనుమానాలతో నిఘా ఉంచి విచారణ జరుపుతున్నట్లు పోలీసు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. 2020లోనే ముగ్గురు అనుమానిత వ్యక్తులపై కమ్యూనల్ సస్పెక్ట్ షీట్లను తెరిచి క్రమం తప్పకుండా వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ చేస్తున్నామన్నారు. ఎన్ఐఏ సోదాల నేపథ్యంలో ముగ్గురు అనుమానిత వ్యక్తులపై మరింత లోతుగా విచారణ జరిపి ఆరా తీసున్నట్లు చెప్పారు.