-
-
Home » Telangana » Karimnagar » Conduct recognition community elections-NGTS-Telangana
-
గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించండి
ABN , First Publish Date - 2022-06-07T06:12:59+05:30 IST
సింగరేణిలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని ఐదు జాతీయ సంఘాలు డిమాండ్ చేశాయి.

- సింగరేణి డైరెక్టర్(పా)కు జాతీయ సంఘాల విజ్ఞప్తి
గోదావరిఖని, జూన్ 6: సింగరేణిలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని ఐదు జాతీయ సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్(పా) బలరాంను జాతీయ సంఘాల నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గుర్తింపు సంఘ కాలపరిమతి 2019లో ముగిసినా ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం కార్మిక చట్టాల నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయని, మరోవైపు మితిమీరిన రాజకీయ జోక్యంతో కార్మికవర్గం తీవ్ర అన్యాయానికి గురవుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి కాలపరిమితి ముగిసినా టీబీజీకేఎస్‌ను గుర్తింపు సంఘంగా పరిగణించడం సరికాదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాలపరిమితి ముగిసినా అధికార సంఘంగా టీబీజీకేఎస్‌ని గుర్తిస్తుండడంతో నాయకుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయినట్టు నాయకులు డైరెక్టర్(పా)తో అన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకోడానికి, కార్మికుల శ్రేయస్సు కోసం సత్వరమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణ ఆలస్యం అయితే అన్ని సంఘాలను చర్చలకు పిలిచి సమప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. డైరెక్టర్(పా)ను కలిసిన వారిలో ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, ఐన్టీయూసీ, సీఐటీయూ నాయకులు సీతారామయ్య, రియాజ్‌అహ్మద్, యాదగిరి సత్తయ్య, జనక్‌ప్రసాద్, మంద నరసింహరావు ఉన్నారు.