సీఎం కేసీఆర్‌ పని అయిపోయింది....

ABN , First Publish Date - 2022-11-28T00:53:53+05:30 IST

‘రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనైపోయింది... టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ విషయం కూడా కేసీఆర్‌కు అర్థమైంది... ఏమి చేయాలో తెలియక పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నాడు’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు.

సీఎం కేసీఆర్‌ పని అయిపోయింది....

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 27: ‘రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనైపోయింది... టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ విషయం కూడా కేసీఆర్‌కు అర్థమైంది... ఏమి చేయాలో తెలియక పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నాడు’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. ఆదివారం కరీంనగర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితి, పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతం అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఇటీవల మృతి చెందిన బీజేపీ శ్రేణులకు నివాళులర్పిస్తూ సంతాప తీర్మానం చేశారు. అనంతరం ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ పచ్చి అబద్దాలు చెబతున్నాడని అన్నారు. కేసీఆర్‌ చెబుతున్న బంగారు తెలంగాణలో ఎక్కడ చూసినా ఆత్మహత్యలే కనిపిస్తున్నాయన్నారు. కేసీఆర్‌ చెప్పే బంగారు భారత్‌ ఎట్లుంటదో తెల్వాలంటే తెలంగాణలోని నిరుద్యోగిని, ఉద్యోగిని, రైతును, విద్యార్థిని, మహిళను, దళితుడిని అడిగితే వివరంగా చెబుతారని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. కేసీఆర్‌ పాలన పీడ విరగాలని జనం కోరుకుంటున్నారని, బీజేపీ చేపట్టే కార్యక్రమాలకు కార్యక్రమాలకు యువత స్వచ్ఛందంగా రావడమే కాకుండా జై బీజేపీ అంటూ కాషాయ జెండా పట్టుకొని కదం తొక్కుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీపై నిర్బంధాలు పెరుగుతాయని, ఇప్పటికే పోలీసులు కేసులు, జైలు అంటూ బెదిరిస్తున్నారని విమర్శించారు. వాటిని లెక్కచేయవద్దని, ఇలాంటి ఇబ్బందులు తాత్కాలికమేనని, పార్టీ జాతీయ నాయకత్వం మనకు పూర్తి అండగా ఉంటుందని అన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలకు అండగా ఉండి పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూల్చే వరకు విశ్రమించవద్దన్నారు. టీఆర్‌ఎస్‌ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రజలకు చేరువకావాలని సూచించారు. మాజీ శాసనసభ్యుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేపడుతున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర బాసర నుండి కరీంనగర్‌కు కొనసాగుతుందని, జిల్లా పరిధిలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, శివరామయ్య, పార్లమెంట్‌ కన్వీనర్‌ బొయినపల్లి ప్రవీణ్‌కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్ళపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, వాసుదేవరెడ్డి, లక్ష్మీనారాయణ, మాజీ మేయర్‌ డి శంకర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T00:53:56+05:30 IST