అటవీ అధికారి హత్యకు సీఎం కేసీఆర్‌దే బాధ్యత

ABN , First Publish Date - 2022-11-25T00:13:34+05:30 IST

అటవీ అధికారి హత్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాద్యుడని, ఈ వ్యవహారంలో కేసీఆర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

 అటవీ అధికారి హత్యకు సీఎం కేసీఆర్‌దే బాధ్యత
వేములవాడలో మాట్లాడుతున్న ఎంపీ బండి సంజయ్‌

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌

వేములవాడ, నవంబరు 24: అటవీ అధికారి హత్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాద్యుడని, ఈ వ్యవహారంలో కేసీఆర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం వేములవాడలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పోడు భూముల వ్యవహారంలో అధికారులకు, ప్రజలకు మధ్య ముఖ్యమంత్రి కేసీఆరే చిచ్చు పెట్టిస్తున్నారని, ఈ క్రమంలోనే అటవీ అధికారి శ్రీనివాసరావు హత్య జరిగిందని అన్నారు. ఈ హత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ వైఖరి కారణంగానే ఈ హత్య జరిగినందున సీఎం కేసీఆర్‌పై క్రిమినల్‌ కేసు నమోదుచేయాలన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో నమ్మబలికిన కేసీఆర్‌ ప్రజలను వంచించారని, పోడు భూముల్లో పంటలు పండేదాకా చూసి దాడులు చేయించి వాటిని చెడగొడుతున్నది కూడా కేసీఆరేనని, పోడు భూముల సమస్యను కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం కూడా కేసీఆర్‌ చేస్తారని బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. ప్రజలను అడ్డంగా దోచుకొని అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించిన వారిపైనే ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నదని, ప్రధాని మోదీ ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడని అన్నారు. ప్రజలను దోచుకొని అడ్డంగా సంపాదించిన వారిపైన ఫిర్యాదులు వచ్చినపుడు వాటికి సంబంధించిన ఆధారాలను పరిశీలించి తనిఖీలు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల మీద ఉంటుందని, అధికారులకు పార్టీలతో సంబంధం ఉండదని అన్నారు. అక్రమంగా సంపాదించిన వారిపై ఫిర్యాదులు వస్తే దాడులు జరుగుతున్నాయన్నారు. ఫిర్యాదులు వచ్చినపుడు తనిఖీలు చేయాలా? వద్దా? అని ప్రశ్నించారు. ఐటీ, ఈడీ దాడులను ఆయా పార్టీలు తమకు అనుగుణంగా మలుచుకొని మాట్లాడడం సరికాదన్నారు. తప్పుడు పనులు చేయనపుడు దర్యాప్తు సంస్థల అధికారులకు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నేతల పరిస్థితి దొంగా.. దొంగా అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందన్నారు. పేదలను అక్రమంగా దోచుకున్న వారిని చూసి చూడనట్లు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం వదిలిపెట్టబోదని హెచ్చరించారు. ఐటీ, ఈడీ దాడులపై స్పందించేందుకు సీఎం న్యాయనిపుణులతో చర్చిస్తున్న తీరు కేవలం వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకేనని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం కుటుంబ సభ్యుల పాత్రపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్నప్పటికీ స్పందించలేదన్నారు. బీజేపీ జాతీయ నాయకులకు నోటీసుల జారీపై న్యాయపరంగా కొట్లాడుతామని, న్యాయవ్యవస్థపై పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని అన్నారు. బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

Updated Date - 2022-11-25T00:13:41+05:30 IST