సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు

ABN , First Publish Date - 2022-09-25T06:15:52+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్‌లో మరోసారి రాజన్న సిరిసిల్ల జిల్లా సత్తాచాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022కు సంబంధించిన అవార్డులను కేంద్ర స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (అర్భన్‌) శనివారం వెల్లడించింది.

సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు
సిరిసిల్ల పట్టణం

సిరిసిల్ల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్‌లో మరోసారి రాజన్న సిరిసిల్ల జిల్లా సత్తాచాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022కు సంబంధించిన అవార్డులను కేంద్ర స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (అర్భన్‌) శనివారం వెల్లడించింది. తెలంగాణకు 16 అవార్డులు లభించగా జిల్లాలో ఉన్న రెండు పట్టణాలు సిరిసిల్ల, వేములవాడకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు లభించాయి. ఉత్తమ పనితీరు కనబర్చిన సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలకు అవార్డులు రావడంపై అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరు 1న ఢిల్లీలోని తల్క్‌ తోరా స్టేడియంలో అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందించనున్నారు. 

మంత్రి మార్గదర్శనంతో అవార్డులు 

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు సాధించిన స్ఫూర్తితో రానున్న రోజుల్లో అంకిత భావంతో విధులు నిర్వహించాలని, మంత్రి మార్గదర్శనంలోనే దేశానికి అదర్శంగా రెండు పట్టణాలు నిలిచాయని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్థానిక ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్‌పర్సను,్ల కమిషనర్లు, కౌన్సిలర్‌లు, ప్రజల సహకారం, అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, క్షేత్ర స్థాయిలో పారిశుధ్య సిబ్బంది కృషితోనే స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులకు ఎంపికయ్యయన్నారు. 

 అవార్డులు  బాధ్యతను పెంచాయి

సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు రావడం సంతోషంగా ఉందని, అవార్డులు తమ బాధ్యతలను మరింత పెంచాయని మున్సిపల్‌ కమిషనర్లు సమ్మయ్య, శ్యాంసుందర్‌ అన్నారు. రానున్న రోజుల్లో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. 

Read more