ప్రత్యేక రాష్ట్రంలో మారిన ట్రెండ్‌

ABN , First Publish Date - 2022-09-28T06:15:18+05:30 IST

‘సిరిసిల్లకు గతంలో ఒక బదానం ఉండేది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వం వేరేది ఉండేది. తెలంగాణ వచ్చిన తరువాత ట్రెండ్‌ మారింది. సిరిసిల్ల రూపు రేఖలు మారాయి’ అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన అచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జంక్షన్‌, విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ప్రత్యేక రాష్ట్రంలో మారిన ట్రెండ్‌
సిరిసిల్లలో కొండ లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని అవిష్కరించి పూలమాల వేస్తున్న మంత్రి కేటీఆర్‌

- సిరిసిల్ల రుణం తీర్చుకుంటున్నా..

- కుల, మత రాజకీయాలకు ఆగం కావద్దు

- కొండా లక్ష్మణ్‌బాపూజీని స్ఫూర్తిగా తీసుకోవాలి

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు

- సిరిసిల్లలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

‘సిరిసిల్లకు గతంలో ఒక బదానం ఉండేది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వం వేరేది ఉండేది. తెలంగాణ వచ్చిన తరువాత ట్రెండ్‌ మారింది. సిరిసిల్ల రూపు రేఖలు మారాయి’ అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన అచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జంక్షన్‌, విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం వచ్చిందని, ఇక్కడి సమస్యలు అర్థం చేసుకున్న బిడ్డగా మీ రుణం తీర్చుకుంటున్నానని అన్నారు. టెక్స్‌టైల్‌ పార్కును బాగు చేసుకుంటున్నామని, అపెరల్‌ పార్కు, వీవింగ్‌ పార్కు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఇతర పరిశ్రమలు, మెడికల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌, నర్సింగ్‌ ఇలా విద్యారంగానికి సంబంధించినవి ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. సిరిసిల్లకు వస్తుంటే జిల్లెల్ల వద్ద వ్యవసాయ కళాశాల చూస్తే అన్నం తిన్నంత తృప్తి కలుగుతోందన్నారు.  సిరిసిల్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని, వస్త్ర పరిశ్రమలోకి కొత్తతరం కూడా రావాలని అన్నారు. వరంగల్‌ నుంచి ఒకప్పుడు సూరత్‌కు వలస వెళ్లారని, వారందరూ తిరిగి రావాలని కోరకున్నప్పుడు మెగా కాకతీయ టెక్స్‌టైల్‌పార్కును 1250 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.  యూనిట్లు కూడా ప్రారంభం అవుతున్నాయన్నారు. దాదాపు 25 నుంచి 30 వేల మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. శ్రామికులుగా వెళ్లినవారు పారిశ్రామికులుగా తిరిగి వస్తున్నారన్నారు. సిరిసిల్లలోనూ కార్మికులు యజమానులుగా, ఆసాములు పారిశ్రామికులుగా మారాలన్నారు. ఇందుకోసం వీవింగ్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మొదట 1100 మందికి అవకాశం లభిస్తుందని,  అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి కమిటీ వేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్నారు. సిరిసిల్లలో నేతన్నల అత్మహత్యలు చూసి కేసీఆర్‌ చలించిపోయారని, నేతన్నల కోసం రూ.50 లక్షలతో మూల నిధిని ఏర్పాటు చేసి భరోసా ఇచ్చారన్నారు.  ప్రభుత్వ ఆర్డర్లు, బతుకమ్మ చీరలతో బతుకును అందించారన్నారు. స్వరాష్ట్రంలో నేతన్నల అభివృద్ధి కోసం రూ.70 కోట్ల బడ్జెట్‌ను 1200కు పెంచారన్నారు. నేతన్నలకు బీమా, పొదుపు పథకాలను అందించనున్నట్లు చెప్పారు.  సిరిసిల్లలో ఇళ్లు లేని వారు 3 వేల మంది ఉన్నారని, 2 వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించామని అన్నారు. మొదటి వరుసలో కొందరికి ఇచ్చి మిగతా వారికి తరువాత ఇస్తామని ఓపిక పట్టాలని అన్నారు. ఎవరూ అడగకపోయినా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు, వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు, వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌ జయశంకర్‌, హెల్త్‌ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు పేర్లను పెట్టుకున్నామన్నారు. కొత్త జిల్లాల్లో ఆసిఫాభాద్‌కు కొమురంభీం, భూపాలపల్లికి జయశంకర్‌ పేరును పెట్టుకున్నట్లు గుర్తు చేశారు.  మహానీయులపే విస్మరించమని సిరిసిల్లలో కావాల్సినన్ని విగ్రహాలు పెట్టుకునే అవకాశం ఉందని అన్నారు. కొత్త చెరువు వద్ద ట్యాంక్‌బండ్‌లా విగ్రహాలు పెట్టుకునే అవకాశం ఉందన్నారు. కొత్తగా జంక్షన్లు రాబోతున్నాయని, దీనికి రాజకీయాలు అవసరం లేదని ఎవరూ డిమాండ్‌ చేయకుండానే విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. కాకా వెంకటస్వామి విగ్రహాన్ని కూడా ట్యాంక్‌బండ్‌పై పెట్టిన నాయకుడు కేసీఆర్‌ అన్నారు. జిల్లాలో ప్రభుత్వం, మున్సిపల్‌ ఆధ్వర్యంలోనే ఒక్క పైసా వసూలు చేయకుండా మహానీయులందరి విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి, సీహెచ్‌రాజేశ్వర్‌రావు, వీరనారి చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, సేవాలాల్‌ మహరాజ్‌ ఇలా మహానీయులందరి విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. స్వాంత్రత్యోద్యమంలోనూ, తెలంగాణ ఉద్యమంలో నూ పోరాటం చేసిన మహానీయుడు అచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ  అన్నారు. ఉద్యమంలో పాల్గొనడంతోపాటు పోరాట యోధులకు సహకారం అందించారన్నారు. వీరనారి ఐలమ్మ భర్తను ఆరెస్ట్‌ చేస్తే కొండా లక్ష్మణ్‌ బాపూజీ కోర్టులో కొట్లాడి విడిపించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం జలదృశ్యంలో కొండా లక్ష్మణ్‌బాపూజీ ఇంటిలోని సామగ్రిని బయటపడేసిందని, అక్కడే ప్రభుత్వం 20 అడుగుల బాపూజీ విగ్రహం ఏర్పాటు చేసిందని అన్నారు.  పభుత్వ పథకాలు ఒక కులానివి, ఒక మతానివో కాదన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ,  పింఛన్లు ఇలా పథకాలు అందరికీ వర్తిస్తున్నాయన్నారు. తంగళ్లపల్లి మానేరు బ్రిడ్జి కిందకు నీళ్లువచ్చినా, భూగర్భ జలాలు పెరిగినా అందరికీ ఉపయోగమేనన్నారు. కరీంనగర్‌ ఎంపీకి  నేతన్నల మీద ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని ఉపసంహరింప జేయాలన్నారు. చేనేత మీద 5 శాతం జీఎస్టీ విధించిన మొదటి ప్రధాని మోదీయేనన్నారు. ఇది సిగ్గు చేటని, చేనేతకు మరణశాసనమేనని ఆరోపించారు.  చరఖా తిప్పి, నూలు వడికి విదేశీ వస్తువులు బహిష్కరించాలని గుజరాత్‌ నుంచి మహాత్మాగాంధీ స్వదేశీ ఉద్యమానికి నాంది పలికారని, అక్కడి నుంచి వచ్చిన ప్రధాని మోదీ చేనేతపై 5 శాతం జీఎస్టీ విధించారని అన్నారు. సిరిసిల్లకు ఒక మోగా పవర్‌లూం క్లస్టర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైండ్లూమ్‌ టెక్నాలజీ ఇవ్వాలని ఎనిమిదేళ్లు అడుగుతున్నామన్నారు. మోదీ ప్రధాని అయిన తరువాత తెలంగాణకు ఒక్క పని కూడా చేయలేదన్నారు. రాజకీయాలు ఎన్నికలప్పుడు చేయాలని, ఎమ్మెల్యే, ఎంపీ, ఏ పదవి కావాలో  కొట్లాడుకోవచ్చని అన్నారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజలే బాస్‌. ప్రజలు ఏదీ డిసైడ్‌ చేస్తే అదే అవుతుంది. దానిని మార్చే అధికారం ఎవరికీ లేదు’ అని అన్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉందని, ఇప్పుడే యుద్ధాలు చేయాల్సిన పని లేదని అన్నారు. నేను ఒక మంచిపని చేస్తే, ఒక ప్రాజెక్ట్‌ తెస్తే, మిగతావారు రెండు మంచి పనులు, రెండు ప్రాజెక్ట్‌లు తెచ్చి ప్రజల మనస్సు గెలుచుకోవాలన్నారు. అంతేగానీ కులం పేరుతో పంచాయితీ, మతంతో రాజకీయాల వంటి చిల్లర పనులు వద్దన్నారు. ఒక కులపోళ్లు ఓటు వేస్తేనే నాయకుడు కాదని,  ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి కారని అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా పేదవాడిని చూసే ప్రభుత్వం ఉండాలని, పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూసే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపంలో ఉన్నారని అన్నారు. రైతు బంధు, రైతుబీమా, ప్రభుత్వ పథకాలు తెస్తే ఒకే కులానికి లాభం చేకూరడం లేదు కదా? అని ప్రశ్నించారు. హిందూ, ముస్లింలు అనగానే ఆగం కావద్దని, దేవుడి పేరు చెప్పే రాజకీయాలకు కింద, మీద కావద్దని అన్నారు. తెలంగాణ వచ్చిన నాడే కేంద్రంలో వాళ్ల ప్రభుత్వం కూడా వచ్చిందన్నారు. తెలంగాణలో ఏమి జరిగిందో గల్లీ గల్లీలో చూపిస్తామని, సిరిసిల్లలోగానీ, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోగానీ ఏం చేశారో ఎంపీ చూపించాలని సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 33 జిల్లాలకు మెడికల్‌ కాలేజీలు ఇచ్చారని, మోదీ ఒక నవోదయ, ఒక మెడికల్‌ కాలేజీ అన్నా ఇచ్చారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సహాయం చేయాలని, జాతీయ హోదా ఇవ్వాలని కోరామన్నారు. అంతేకాకుండా పాలమూరు ఎత్తిపోతల పథకానికైనా సాయం చేయాలని అడిగితే చేయకపోగా పిచ్చి పిచ్చి మాటలతో డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్లే ఉంటుందన్నారు. ఏది మాట్లాడినా దేవుడు దేవుడు అనే వీళ్లు వేములవాడ గుడికి సాయం చేశారా అంటే అల్లీకి అల్లీ సున్నాకు సున్నా అంటూ ఎద్దేవా చేశారు. దేవుడు పేరుతో రాజకీయం చేసి నాలుగు ఓట్లు దొబ్బుకోవాలి ప్రజలను అగం చేయాలి, పోరగాండ్లను రెచ్చగొట్టి కులం మతం పేరుతో పబ్బం గడపాలని చూస్తున్నారన్నారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణలో ఏం చేసింది. అదే ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశానికి ఏం చేసిందో తెలంగాణలో చర్చ పెట్టాలన్నారు. ఎవరి తప్పు ఉంటే వారిని నిగ్గదీయాలన్నారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఇల్లే కేంద్రంగా ఉద్యమం  

- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్వాతంత్య్ర పోరాటంలో  క్రియాశీలకంగా పని చేశారని, ఆ తరువాత తెలంగాణ మలి దశ  ఉద్యమాన్ని బాపూజీ ఇల్లే కేంద్రంగా ప్రారంభించామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ అన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1952లో ఎమ్మెల్యేగా గెలుపొందారని ఆ తరువాత వరుసగా గెలిచి 1969లో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా పాలకుల దుర్మార్గాలను చూసి మంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. కేసీఆర్‌, తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నారని తెలియడంతోనే బాపూజీ ఇంటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే విధంగా కదిలారని అన్నారు.   నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు మాట్లాడుతూ పద్మశాలి సమాజ అభివృద్ధికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఎంతో కృషి చేశారన్నారు.  పవర్‌లూం, టెక్స్‌టైల్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో ఒకే రోజు పద్మశాలీలకు రెండు పండుగలు వచ్చాయన్నారు. హైదరాబాద్‌ జలదృశ్యంలో, సిరిసిల్లలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాలను ఆవిష్కరించడం పద్మశాలి సమాజానికి  గొప్ప గౌరవమన్నారు.  జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషదాయకమన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు, నేతన్నల అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ అండగా నిలుస్తున్నారన్నారు.  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు కాముని వనిత, యువజన సంఘం అధ్యక్షుడు పూర్ణచందర్‌,  అర్బన్‌బ్యాంక్‌ చైర్మన్‌ గాజుల నారాయణ, టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ నాయకుడు బొల్లి రామ్మోహన్‌, పద్మశాలి కల్యాణ భవన్‌ అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాస్‌, పాలిస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మండల సత్యం, ఉపాధ్యక్షుడు వెల్దండి దేవదాస్‌, టెక్స్‌టైల్‌ పార్కు అసోసియేషన్‌ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ అనిల్‌, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు రాపెల్లి లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సామల పావని, గుజ్జె తార, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, వివిధ సంఘాల నాయకుల పాల్గొన్నారు. 


Read more