-
-
Home » Telangana » Karimnagar » Central and state governments cheating farmers-NGTS-Telangana
-
రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ABN , First Publish Date - 2022-06-07T06:00:15+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ రెడ్డిపురం కాలనీలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు.

- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
వేములవాడ టౌన్, జూన్ 6 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ రెడ్డిపురం కాలనీలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ కావాలనే ధాన్యం కొనుగోలు విషయంలో గొడవలకు దిగి అమాయకులైన రైతులను మోసం చేశారని ఆరోపించారు. రైతులకు, ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విసుగెత్తిపోయేలా చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీలకు రాబోవుకాలంలో పుట్టగతులు కూడా ఉండవని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు విద్యుత్ చార్జీలు గానీ, పెట్రోల్, డిజిల్, గ్యాస్‌తోపాటు నిత్యావసర ధరలు సామాన్యులకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, 108, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేరువైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత రెండు మార్లు జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలమయ్యాయన్నారు. వరంగల్‌లో నిర్వహించిన రైతు డిక్లెరేషన్ సభలో రాహుల్‌గాంధీ ప్రవేశపెట్టిన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని, అధికారంలోకి రాగానే నెరవేర్చుతామని హామీచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మొండిచేయ్యి చూపించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఇందిరమ్మ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఎకరాకు రూ.15 వేలు, ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమిలేని రైతు ఏడాదికి రూ. 12 వేలు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ఆది శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, ఓబీసి జిల్లా అధ్యక్షుడు ముడికే చంద్రశేఖర్ యాదవ్, చిలుక రమేష్, నాగుల విష్ణుప్రసాద్, పాత సత్యలక్ష్మీ, బొజ్జ భారతి, చిలువేరి శ్రీనివాస్, లహరి, కనికరపు రాకేష్, తూం మధు, గణేష్ తదితరులు ఉన్నారు.