-
-
Home » Telangana » Karimnagar » Bonamo grandmother mother-MRGS-Telangana
-
బోనమో పెద్దమ్మ తల్లి
ABN , First Publish Date - 2022-07-04T05:20:40+05:30 IST
డప్పు చప్పుళ్లు... నెత్తిన బోనాలు... శివసత్తుతల పూనకాలు... పోతురాజుల విన్యాసాలు... నృత్యాలు... భక్తి పారవశ్యం నడుమ ఆదివారం పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నగరంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.

- మంత్రి గంగుల, మేయర్ సునీల్‌రావు పూజలు
కరీంనగర్ కల్చరల్, జూలై 3: డప్పు చప్పుళ్లు... నెత్తిన బోనాలు... శివసత్తుతల పూనకాలు... పోతురాజుల విన్యాసాలు... నృత్యాలు... భక్తి పారవశ్యం నడుమ ఆదివారం పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నగరంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి హాజరైన మహిళలు బోనాలతో అంబేద్కర్ చౌరస్తా వద్ద కలుసుకొని భగత్‌నగర్ చౌరస్తా ద్వారా పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకొని పెద్దపట్నంపై బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి పసుపు కుంకుమలు, గాజులు, ఒడి బియ్యం సమర్పించారు. కార్యక్రమంలో అధ్యక్ష ప్రధానకార్యదర్శులు పి లింగయ్య, ఆర్ లక్ష్మణ్, ఉపాధ్యక్షులు కె లక్ష్మన్, కె అంజయ్య, ఆర్ లక్ష్మణ్, పి నాగరాజు, కె నరసయ్య, ఎన్ రామస్వామి, ఎం జైపాల్ పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు తదితర నాయకులు బోనాల జాతరలో పాల్గొని పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
- జాతరకు వర్షం అడ్డంకి...
జాతరకు వర్షం కాస్త అడ్డంకిగా నిలిచింది. సాయంత్రం విడతల వారీగా కురిసిన వర్షంతో జాతరలో పాల్గొన్న వారు ఇబ్బందులు పడ్డారు. కొందరు వర్షాన్ని లెక్క చేయకుండా బోనాలను తీసుకరాగా మరి కొందరు చెట్లు, నివాసప్రాంతాలు, ఇంటి ముందు వసారాలను చేరుకొని వర్షం తగ్గాక బోనాలు సమర్పించారు. మరి కొందరు వాహనాలలో బోనాలతో తరలి రావడంతో పెద్దమ్మ తల్లి ఆలయం ముందు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి భక్తులకు సేవలందించారు. జాతర సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.