బీజేపీలోకి బొమ్మ శ్రీరాం చక్రవర్తి

ABN , First Publish Date - 2022-08-26T05:02:48+05:30 IST

సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, ఏపీ హౌస్‌ ఫెడ్‌ మాజీ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి బీజేపీలో చేరారు. దీంతో హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు.

బీజేపీలోకి బొమ్మ శ్రీరాం చక్రవర్తి
బొమ్మ శ్రీరాం చక్రవర్తికి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

 హుస్నాబాద్‌ కాంగ్రెస్‌లో అయోమయం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, ఏపీ హౌస్‌ ఫెడ్‌ మాజీ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి బీజేపీలో చేరారు. దీంతో హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో  చేర్పించిన రోజు నుంచే అసంతృప్తి మొదలైంది. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బొమ్మ శ్రీరాంచక్రవర్తి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో హుస్నాబాద్‌ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. హుస్నాబాద్‌ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోనిది. జిల్లాల విభజన జరిగిన సందర్భంలో నియోజకవర్గంలోని హుస్నాబాద్‌, కోహెడ కొత్తగా ఏర్పడిన అక్కన్నపేట మండలాలు సిద్దిపేట జిల్లాలో, చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాలు కరీంనగర్‌ జిల్లాలో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండ జిల్లాలో ఉన్నాయి. టీఆర్‌ఎస్‌కు,  కాంగ్రెస్‌కు, వామపక్షాలకు ఈ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. బొమ్మ శ్రీరాం చక్రవర్తి బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి కూడా గట్టిపట్టు లభించినట్లయింది. ఇప్పుడు ఈ పరిణామం కరీంనగర్‌ జిల్లాలోనే కాకుండా సిద్దిపేట, హన్మకొండ జిల్లా రాజకీయాల్లో కూడా మార్పులకు కారణం కానున్నది. 

  ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెట్టుకుని..

బొమ్మ శ్రీరాంచక్రవర్తి తండ్రి, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు ఐదు దశాబ్దాలపాటు హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఆయన రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేసిన శ్రీరాంచక్రవర్తి హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకొని నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని చేశారు. పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ప్రవీణ్‌ రెడ్డిని తిరిగి చేర్చుకోవడం, ఆయనకు హుస్నాబాద్‌ టికెట్‌ ఇచ్చే హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతుండడంతో శ్రీరాంచక్రవర్తి అనివార్యంగా కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయంగా ఆయనకు బీజేపీ కనిపించడం ఆ పార్టీలో ఆయన సోదరి జయశ్రీ రాష్ట్రస్థాయిలో కీలకపాత్ర వహిస్తుండడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ప్రోత్సాహం కూడా ఉండడంతో ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థిగా హుస్నాబాద్‌లో పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి గతంలో కాంగ్రెస్‌ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. అనంతర పరిమాణాలతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రవీణ్‌రెడ్డి పార్టీని వీడిన నాటి నుంచి ఆ పార్టీకి అన్నీతానై కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటూ బొమ్మ శ్రీరాం చక్రవర్తి పనిచేస్తున్నారు. ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టుదలతో పార్టీ పటిష్టానికి కృషి చేశారు. ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ ప్రవీణ్‌రెడ్డిని తిరిగి కాంగ్రెస్‌ చేర్చుకున్నారు. దీంతో శ్రీరాంచక్రవర్తి పార్టీని వీడక తప్పని పరిస్థితి నెలకొంది. 

  ముక్కోణపు పోటీ

నియోజకవర్గంలో మెజార్టీ కాంగ్రెస్‌ నాయకులు శ్రీరాంచక్రవర్తి వెంటే ఉన్నారు. వారంతా బీజేపీలో చేరడంతో ఆపార్టీ ప్రస్తుతం ఉన్న మూడు పార్టీలకు తోడు నువ్వా నేనా అన్నట్లు పోటీ ఇచ్చేదిగా ఎదిగింది. మునుగోడులో టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు ప్రకటించడం, ఈ రాజకీయ పొత్తు అవగాహనలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ రెండు పార్టీల్లో ఎవరో ఒకరే పోటీ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ ఉంటుందని భావిస్తున్నారు. 

Read more