వసతి గృహాల్లో బయోమెట్రిక్‌

ABN , First Publish Date - 2022-10-11T05:30:00+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ విధానం తిరిగి మొదలైంది. కరోనా పరిస్థితుల వల్ల మూడేళ్లుగా మూత పడ్డ వసతి గృహాలు ఈ విద్యా సంవత్సరంలో తిరిగి తెరుచుకున్నాయి.

వసతి గృహాల్లో బయోమెట్రిక్‌
ఎస్సీ హాస్టల్‌లో వేలి ముద్ర వేస్తున్న విద్యార్థులు

-ఎస్సీ హాస్టళ్లలో మొదలైన ప్రక్రియ

-త్వరలో బీసీ, ఎస్టీ హాస్టళ్లలో ప్రారంభం

గణేష్‌నగర్‌, అక్టోబరు 11: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ విధానం తిరిగి మొదలైంది. కరోనా పరిస్థితుల వల్ల మూడేళ్లుగా మూత పడ్డ వసతి గృహాలు ఈ విద్యా సంవత్సరంలో తిరిగి తెరుచుకున్నాయి. విద్యార్థులు కూడా అత్యధిక సంఖ్యలో ప్రవేశాలు పొందారు. గతంలో మాదిరిగానే అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తిరిగి బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ శాఖ వసతిగృహాల్లో బయోమెట్రిక్‌ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెలాఖరు వరకు అన్ని వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ ప్రక్రియను ప్రారంభించాలని సూచించడంతో ఆ దిశగా జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే షెడ్యూల్డ్‌  కులాల సంక్షేమ హాస్టళ్లలో వేలి ముద్ర ద్వారా విద్యార్థుల హాజరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మిగతా వసతి గృహాల్లో కూడా బయోమెట్రిక్‌ యంత్రాలు వినియోగించడం అనివార్యమయ్యింది. 

నాలుగేళ్ల క్రితం ప్రారంభమైనా..

సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచుతూ, వారికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వ హాస్టళ్లలో బయోమెట్రిక్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రారంభించింది. రెండేళ్ల క్రితం కరోనాతో హాస్టళ్లు మూతపడ్డాయి. మధ్యలో కొన్నిసార్లు తెరిచినా కొవిడ్‌ భయంతో వాటిని వినియోగించలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో వసతి గృహాలు నడుస్తుండగా, పారదర్శకత పాటించాలనే ఆలోచనతో బయోమెట్రిక్‌ విధానం తిరిగి అమలు చేస్తున్నారు. 

రోజుకు రెండుసార్లు వేలిముద్ర

విద్యార్థులు రోజుకు రెండు సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఎస్సీ హాస్టళ్లు 31, ఎస్టీ హాస్టళ్లు ఐదు, బీసీ హాస్టళ్లు 19, మైనార్టీ హాస్టళ్లు తొమ్మిది ఉన్నాయి. అన్ని వర్గాల ప్రాతిపదికన  మొత్తం 64 ఫ్రీ, పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 5,500 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ క్రమంలో మొదట ఎస్సీ హాస్టళ్లలో బయోమెట్రిక్‌ ప్రక్రియను గత నెలలో ప్రారంభించారు. ఇది విజయవంతంగా కొనసాగుతుండగా, మిగతా వసతి గృహాల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాయి.

బయోమెట్రిక్‌ విధానాన్ని త్వరగా అమలు చేయాలి..

- బొల్లం లింగమూర్తి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  

 బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల హాజరు శాతం తగ్గుతోంది. సొంత భవనాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్లలో కనీస వసతులు కల్పించి  బయోమెట్రిక్‌ విధానాన్ని అమలుచేయాలి. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

బీసీ సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన విద్యను అందించాలి.

- నర్సింగోజు శ్రీనివాస్‌, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు

బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని వెంటనే అమలు చేయాలి. ఈ విధానంతో అక్రమాలకు చెక్‌ పెట్టవచ్చు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందించాలి.

Updated Date - 2022-10-11T05:30:00+05:30 IST