బతుకమ్మ తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక

ABN , First Publish Date - 2022-10-02T06:29:01+05:30 IST

బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అని, ఈ పూల పండుగ తెలంగాణకే గర్వకారణమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

బతుకమ్మ తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక
బతుకమ్మ ఆడుతున్న గవర్నర్‌ తమిళిసై

- రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది

- రాజన్న ఆలయ అభివృద్ధికి సహకరిస్తా

- రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

- వేములవాడలో బతుకమ్మ ఉత్సవాల్లో గవర్నర్‌

వేములవాడ, అక్టోబరు 1: బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అని, ఈ పూల పండుగ తెలంగాణకే గర్వకారణమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. సద్దుల బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా శనివారం గవర్నర్‌ తమిళిసై రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించారు. రాజరాజేశ్వరస్వామివారి దర్శనం అనంతరం విలేకరులతో మాట్లాడారు.  రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడలో రాజరాజేశ్వరస్వామివారిని శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని, అందరికీ రాజరాజేశ్వరస్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని, ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు వేములవాడకు రావడం, వేలాది మంది మహిళలతో ఉత్సవాలలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని  అన్నారు. బతుకమ్మ పండుగ మొదటి రోజే వేలాది మంది మహిళలతో రాజ్‌భవన్‌లో బతుకమ్మ ఆడామని అంటూ రాష్ట్ర ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని అన్నారు. ఇన్ని వేల మంది పాలుపంచుకుంటున్న బతుకమ్మ పండుగలో మాస్కు లేకుండా రాగలగడం కేవలం వ్యాక్సినేషన్‌ కారణంగానే సాధ్యమైందని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, అందరూ కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని అన్నారు. 

 రాజరాజేశ్వరస్వామివారి సేవలో గవర్నర్‌ తమిళిసై 

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి సేవలో తరించారు. శనివారం రాత్రి ఆమె రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.  రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆమెకు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి,  ఎస్పీ రాహుల్‌ హెగ్డే, ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌  స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. 

 బతుకమ్మ ఉత్సవాల్లో  గవర్నర్‌

వేములవాడలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ పాల్గొన్నారు. మూలవాగులో బతుకమ్మ తెప్ప వద్ద ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడి, అనంతరం తెప్పలో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌ పర్యటన సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ కె.నాగేంద్రచారి, పట్టణ సీఐ వెంకటేశ్‌ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా, పర్యటన ఏర్పాట్లు బాగా చేశారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను గవర్నర్‌ తమిళిసై అభినందించారు. 

Read more