సంజయ్‌ అమాత్యుడయ్యేనా?

ABN , First Publish Date - 2022-09-08T07:07:52+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంజయ్‌ అమాత్యుడయ్యేనా?

- తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి

- అధిష్ఠానం దృష్టిలో బీసీ నేతలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో మరొకరికి చోటు కల్పించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈసారి బీసీ వర్గానికి అవకాశం ఇచ్చే ఆలోచనలో హైకమాండ్‌ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రలు, మరోవైపు కేంద్ర మంత్రుల పర్యటనలతో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. ఇదే సందర్భంగా బీజేపీ నాయకత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉండగా ఇప్పటికే ఎంపీ కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. మిగతా ముగ్గురిలో ఇద్దరు బీసీలు కాగా ఒకరు ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారు. బీసీ ఎంపీకే మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర నాయకత్వం భావిస్తుండడంతో బీసీ కేటగిరికి చెందిన ఎంపీలు బండి సంజయ్‌ కుమార్‌, ధర్మపురి అరవింద్‌పై అందరి దృష్టి పడింది. వీరిద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. బండి సంజయ్‌కుమార్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో బీజేపీకి ఊపు తీసుకువచ్చారని, ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే మరింత బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 


 సముచిత ప్రాధాన్యం పక్కా..


పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా తీవ్ర పనుల ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సంజయ్‌ని పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగించి మరొకరికి మంత్రి పదవి ఇస్తారు అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు సంజయ్‌ రాష్ట్ర అధ్యక్ష పదవీకాలం మరికొన్ని నెలల్లో ముగియనున్నందున ఆయనను కేంద్ర మంత్రిగా నియమించి సీనియర్‌కు పార్టీ అధ్యక్ష పదవిని ఇచ్చే అవకాశం లేకపోలేదనే వాదన కూడా సాగుతోంది. సంజయ్‌కి సముచిత స్థానం ఇచ్చే విధంగానే జాతీయ నాయకత్వ ఆలోచన ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సంజయ్‌కి మంత్రి పదవి దక్కని పక్షంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  పార్టీ రాష్ట్ర మాజీ  అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ను ఇటీవల ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆయనకు ఇటీవలే కేంద్ర మంత్రికి సమాన హోదాగా భావించే పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించారు. దీంతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవచ్చని అంటున్నారు. నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్‌ కూడా పార్టీ వర్గాల్లో డైనమిక్‌గా పేరు తెచ్చుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో సంజయ్‌ నాయకత్వాన్ని కొనసాగిస్తూ అర్వింద్‌కు మంత్రి పదవిని ఇస్తే మరింత ఊపు తీసుకురావచ్చనే ఆలోచన కూడా లేకపోలేదని చెబుతున్నారు. ఈ నెల 17న జరగనున్న తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరుకానున్న నేపథ్యంలో ఈ విషయంలో చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

Updated Date - 2022-09-08T07:07:52+05:30 IST