ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-12-10T00:42:01+05:30 IST

ఆశావర్కర్ల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని సీపీఎం మూషం రమేష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు.

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న నాయకులు, ఆశా వర్కర్లు

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 9: ఆశావర్కర్ల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని సీపీఎం మూషం రమేష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, సీపీఐ, సీఐటీయూ నాయకులు అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌వో)సుమన్‌ మోహన్‌రావుకు వినతిపత్రం ఇవ్వడానికి ఆశా వర్కర్లతో కలసి వెళ్లామని, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మీటింగ్‌లో ఉన్నారని తెలియడంతో ఆయన కోసం కార్యాలయం వద్దే గంట సేపు వేచి ఉన్నామని అన్నారు. మీటింగ్‌ ముగించుకొని వచ్చిన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించగా తీసుకోలేదని, వినతిపత్రాన్ని ఫిర్యాదుల డబ్బాలో వేసి వెళ్లాలని అవమానించారని వాపోయారు. సిబ్బందిని పిలిపించి బయటకు నెట్టివేసేందుకు ప్రయత్నించారన్నారు. తమపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామంటూ అక్కడి నుంచి వెల్లిపోయారన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి కార్యాలయానికి వెళ్లామని, కలెక్టర్‌ అందుబాటులో లేనుందున అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. సీఐటీయూ అధికారుల వ్యవహార తీరుపై డీఎంహెచ్‌వో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Updated Date - 2022-12-10T00:42:07+05:30 IST