వీధి వ్యాపారులకు అండగా..

ABN , First Publish Date - 2022-10-01T05:11:05+05:30 IST

ఆర్థికంగా అస్తవ్యస్తమైన వీధి వ్యాపారులకు ఆసరాగా కేంద్ర ప్రభుత్వ పథకం ఉంటోంది. కొవిడ్‌తో మూడేళ్లుగా అన్నివర్గాల ప్రజల జీవనం, ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రధానంగా వీధి వ్యాపారం నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపింది.

వీధి వ్యాపారులకు అండగా..

- ఆసరాగా నిలుస్తున్న ‘ఆత్మ నిర్భర్‌’ 

- జోరుగా తొలి, రెండో విడత రుణాలు

- వేల సంఖ్యలో లబ్ధిదారులు.. రూ. కోట్లలో రుణాలు

జగిత్యాల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా అస్తవ్యస్తమైన వీధి వ్యాపారులకు ఆసరాగా కేంద్ర ప్రభుత్వ పథకం ఉంటోంది. కొవిడ్‌తో  మూడేళ్లుగా అన్నివర్గాల ప్రజల జీవనం, ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రధానంగా వీధి వ్యాపారం నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపింది. నెలల తరబడి దుకాణాలు మూతపడడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. కరోనా కారణంగా వ్యాపారాలు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ పథకం అమలు చేస్తోంది.

- జిల్లాలో 15,307 మంది గుర్తింపు..

జిల్లాలోని 15,307 మంది వీధి వ్యాపారులను అధికారులు గుర్తించారు. ఇందులో జగిత్యాల మున్సిపాలిటీలో 6,005, కోరుట్లలో 4,081, మెట్‌పల్లిలో 3,548, రాయికల్‌లో 815, ధర్మపురిలో 858 మంది వీధి వ్యాపారులను మెప్మా అధికారులు గుర్తించారు. జిల్లాలో అధికారులు గుర్తించిన వీధి వ్యాపారులందరికీ మెప్మా ఆధ్వర్యంలో గుర్తింపుకార్డులను సైతం అందజేశారు.

- సకాలంలో చెల్లిస్తే..

జిల్లాలో మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. దళారులను, మధ్యవర్తులను ఆశ్రయించకుండా అర్హులైన వ్యాపారులు తీసుకున్న రుణం మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆత్మ నిర్భర్‌ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో మొత్తం 11,320 మంది వ్యాపారులకు వివిధ బ్యాంకుల ద్వారా రూ. 11.32 కోట్ల రుణం పంపిణీ చేశారు.  తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు ఏడు శాతం వడ్డీతో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. సక్రమంగా నిర్ణీత గడువులోగా చెల్లించి వ్యాపారులకు రెండో విడతలో రెట్టింపు రుణం రూ. 20 వేలు అందించారు. జిల్లాలో ఇప్పటివరకు 3,978 మందికి రెండో విడత రుణాలను అధికారులు అందించారు. ఇందులో రాయికల్‌లో 301 మందికి, ధర్మపురిలో 372 మందికి, కోరుట్లలో 1,182 మందికి, మెట్‌పల్లిలో 826 మందికి, జగిత్యాలలో 1,297 మందికి రెండో విడత రుణాలను అందించారు. 

- మూడో విడత రుణాల పంపిణీ షురూ..

జిల్లాలో మొదటి, రెండో విడతలో రుణాలను తీసుకొని సక్రమంగా చెల్లించిన వీధి వ్యాపారులకు మూడో విడత రుణాలను అందించడానికి మెప్మా అధికారులు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలో రెండో విడత రుణాలను సంపూర్ణంగా చెల్లించిన వీధి వ్యాపారులను అధికారులు గుర్తించారు. రెండో విడత రుణాలను తీసుకున్న తదుపరి రెండు సంవత్సరాల్లోపు సంబంధిత బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. మూడో విడత కార్యక్రమంలో ఒక్కో వీధి వ్యాపారికి రూ. 50 వేల రుణ సహాయాన్ని అందించడానికి కసరత్తులు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 600 మంది రెండో విడత రుణాలను సకాలంలో చెల్లించినట్లుగా అధికారులు జాబితా రూపొందించారు. ఇందులో సుమారు 300 మందికి మూడో విడత రుణాలను అందించడానికి అవసరమైన డాక్యూమెంటేషన్‌ను పూర్తి చేశారు. ఇందులో జగిత్యాలలో అయిదుగురికి,  రాయికల్‌లో ఒకరికి మూడో విడత రుణాలను బ్యాంకర్లు అందించారు. రుణాలు చెల్లించని వారికి మున్సిపాలిటీల వారీరిగా మెప్మా అధికారులు, రిసోర్స్‌పర్సన్‌లు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ అవగాహన కల్పిస్తున్నారు. 


Updated Date - 2022-10-01T05:11:05+05:30 IST