శ్రుతిమించితే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2022-12-30T23:24:09+05:30 IST

నూతన సంవత్పర వేడుకల సందర్భంగా యువత శ్రుతిమించిన చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ హెచ్చరించారు.

 శ్రుతిమించితే చర్యలు తప్పవు
పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ


31 రాత్రి నుంచి నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సీసీ కెమెరా, డ్రోన్‌ కెమెరాలతో నిఘా, షీటీంలతో గస్తీ

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 30: నూతన సంవత్పర వేడుకల సందర్భంగా యువత శ్రుతిమించిన చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ హెచ్చరించారు. శువ్రారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమిషనరేట్‌ వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్నివర్గాల ప్రజలు నూతన సంవత్సర వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు బ్రీత్‌ ఎనలైజర్‌ పరికరాలతో విస్తృతంగా డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తామని అన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి, డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు కొనసాగిస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాల సైలెన్సర్లను తొలగించి శబ ్ధకాలుష్యం కలిగించే చర్యలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.

మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు

మైనర్‌లకు వాహనాలు ఇచ్చే యజమానులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రోడ్డు నియమ నిబంధనల ప్రకారం మైనర్లకు వాహనాలు ఇచ్చే వాహనదారులపై కేసులు నమోదు చేయటంతోపాటు సదరు మైనర్ల తల్లిదండ్రులను పోలీసు ఠాణాలకు పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ఇప్పటికే ఏర్పాటైన సీసీ కెమెరాలతోపాటు 50 వీడియో చిత్రీకరణ బృందాలను, డ్రోన్‌ కెమెరాలను రంగంలోకి దించుతున్నామని సీపీ తెలిపారు. రోడ్లపై కత్తులు, తల్వార్లతో కేక్‌లు కట్‌ చేయటం, డీజే సౌండ్స్‌తో నృత్యాలు చేయడం, రంగుల చల్లుతూ రోడ్లపై వెళ్లేవారిని ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. శ్రుతిమించిన చర్యలతో కేసులు నమోదై పోలీసు రికార్డులకు ఎక్కితే యువత ఉన్నత చదువులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించవన్నారు. అనవసరంగా విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు.

ప్రాణాంతకమైన కోవిడ్‌ వ్యాప్తి పొంచి ఉన్నందున ప్రజలందరూ స్వీయనియంత్రణ పాటించడంతోపాటు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని సీపీ కోరారు. జనసమూహంతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా ప్రాణాంతకమైన కొవిడ్‌ వైరస్‌ బారినపడే ప్రమాదముందని హెచ్చరించారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే చర్యలను పాటించడం తమ బాధ్యతగా అన్నివర్గాల ప్రజలు గుర్తించాలన్నారు.

మహిళలు, యువతులపై అసభ్యకరంగా ప్రవర్తంచేవారిపై చర్యలు తీసుకుంటామని, పోకిరీలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కంటికి కనిపించని రీతిలో ఉండే అత్యాధునిక సాంకేతిక పరికరాలతో నిఘా కొనసాగిస్తామన్నారు. ఈ పరికరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను సాక్ష్యాధారాలుగా న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టి పోకిరీలకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. షీటీం పోలీసులు మఫ్టీలో సంచరించనున్నట్లు తెలిపారు.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శనివారం రాత్రి 8 గంటల నుంచి నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు కరీంనగర్‌ పట్టణంలో ట్రాఫిక్‌ అంక్షలు, దారి మళ్లింపు చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు. భారీ వాహనాలను నగరంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-30T23:24:11+05:30 IST