గ్రానైట్‌ సంస్థల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ABN , First Publish Date - 2022-11-12T00:21:47+05:30 IST

గ్రానైట్‌ సంస్థల చుట్టూ ఉచ్చుబిగుస్తున్నదా అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇన్‌కంటాక్స్‌ అధికారుల బృందాలు రెండురోజులపాటు చేసిన సోదాల్లో గ్రానైట్‌ ఎగుమతుల సందర్భంగా ఆయా సంస్థలు ఫెమా (ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌)ను ఉల్లంఘించినట్లు గుర్తించారు.

గ్రానైట్‌ సంస్థల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

గ్రానైట్‌ సంస్థల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

- ఫెమాను ఉల్లంఘించినట్లు గుర్తించిన ఈడీ

- హవాలా మార్గంలోనూ డబ్బు మార్పిడి

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

గ్రానైట్‌ సంస్థల చుట్టూ ఉచ్చుబిగుస్తున్నదా అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇన్‌కంటాక్స్‌ అధికారుల బృందాలు రెండురోజులపాటు చేసిన సోదాల్లో గ్రానైట్‌ ఎగుమతుల సందర్భంగా ఆయా సంస్థలు ఫెమా (ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌)ను ఉల్లంఘించినట్లు గుర్తించారు. హవాలా మార్గంలో చైనా నుంచి డబ్బు పొందారని, ఉద్యోగుల పేరిట బినామీ అకౌంట్లు తీసి అక్రమంగా రవాణా చేసిన గ్రానైట్‌ రాయి సొమ్మును ఆ అకౌంట్ల ద్వారా పొందారని గుర్తించినట్లు ఈడీ పేర్కొన్నది. పనామా లీక్స్‌లో వెలుగులోకి వచ్చిన లీవెన్‌హూవోకు చెందిన సంస్థల నుంచి హ్యాండ్‌లోన్‌ రూపంలో స్థానిక గ్రానైట్‌ సంస్థలు డబ్బులు స్వీకరించాయని కూడా సోదాల్లో వెల్లడైనట్లు ఈడీ ప్రకటించడం జిల్లాలో కలకలం సృష్టిస్తున్నది. ఈనెల 9, 10వ తేదీల్లో ఈడీ బృందాలు శ్వేతా గ్రానైట్స్‌, శ్వేతా ఏజెన్సీస్‌, శ్రీవేంకటేశ్వర గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పీఎస్‌ఆర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అరవింద్‌ గ్రానైట్స్‌, గిరిరాజ్‌ షిప్పింగ్‌ ఏజెన్సీస్‌ వారి హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఉన్న కార్యాలయాలు, నివాస ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఈ సంస్థలు చైనా, హాంకాంగ్‌, ఎస్‌ఏఆర్‌ చైనా ఇతర దేశాలకు గ్రానైట్‌ బ్లాకులను ఎగుమతులు చేస్తున్నాయని, రాయల్టీ చెల్లించిన పరిమాణం కంటే ఎగుమతి చేసి పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు, ఎగుమతి చేసినపుడు ఆ పరిమాణాన్ని తక్కువగా పేర్కొన్నట్లు గుర్తించారు. పలు సందర్భాల్లో ఎగుమతి చేసిన గ్రానైట్‌కు సంబంధించిన సొమ్మును ప్రకటించిన బ్యాంకు ఖాతాల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా స్వీకరించినట్లు ఈడీ గుర్తించింది.

సోదాల్లో రూ. 1.08 కోట్లు స్వాధీనం

సోదాల్లో లెక్కల్లో చూపని కోటి ఎనిమిది లక్షల రూపాయలను హవాలా మార్గంలో పొందినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 10 సంవత్సరాల కాలంలో గ్రానైట్‌ రవాణా డేటాను కూడా స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా అక్రమ గ్రానైట్‌, మైనింగ్‌, ఫెమా ఉల్లంఘనపై ఈడీ దర్యాప్తు ప్రారంభించిందని, కరీంనగర్‌ క్వారీల నుంచి సముద్ర మార్గం ద్వారా రవాణా చేసిన గ్రానైట్‌ బ్లాకులపై పెద్ద ఎత్తున సీనరేజీ ఫీజు ఎగవేశారని గుర్తించారు. ఎగవేసిన సొమ్మును చెల్లించాలని నోటీసులు పంపించినా ఎగుమతిదారులు చెల్లించలేదని ఈడీ పేర్కొంటూ తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు ప్రకటించడంతో గ్రానైట్‌ పరిశ్రమ కుదుపునకు లోనైంది.

2012లో గ్రానైట్‌ రవాణాలో అక్రమాలు

2012 సంవత్సరంలో కరీంనగర్‌కు చెందిన పలు గ్రానైట్‌ కంపెనీలు విదేశాలకు గ్రానైట్‌ రవాణాలో అక్రమాలకు పాల్పడి ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లజేశారని ఆరోపణలు వచ్చాయి. 2013లో విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంట్‌శాఖ ఈ వ్యవహారంలో విచారణ జరిపించి ఆయా కంపెనీలు తప్పుడు కొలతలతో 124 కోట్ల 94 లక్షల రూపాయల విలువచేసే గ్రానైట్‌ను అక్రమంగా రవాణా చేశాయని తేల్చి ఇందుకుగాను ఐదు రెట్ల ఫెనాల్టీని విధించింది. 749 కోట్ల 64 లక్షల రూపాయలను చెల్లించాలని నోటీసులను జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని మొత్తం బీజేపీ నాయకులు బేతి మహేందర్‌రెడ్డి, అన్నమనేని గంగాధర్‌ ఈడీతోపాటు ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు చేశారు. కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ కూడా 2019 జూలై 31న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు ఫిర్యాదు చేస్తూ గ్రానైట్‌ కంపెనీల సీనరేజీ రుసుము, జరిమానా సొమ్ము చెల్లించని విషయాన్ని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో మరోసారి సమగ్రమైన విచారణ జరిపించి ఆర్థిక నేరాలకు పాల్పడిన క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాలని, జరిమానాతోపాటు సీనరేజి చార్జీలను వసూలు చేయాలని కోరారు. బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఖాదీబోర్డు సౌత్‌జోన్‌ సభ్యుడు పేరాల శేఖర్‌రావు కూడా కొద్దినెలల క్రితం ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలోనే ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాయని భావిస్తున్నారు. రెండు దశాబ్దాలపాటు ఒక వెలుగు వెలిగిన గ్రానైట్‌ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 30వేల కుటుంబాలకు ఉపాధి కల్పించింది. కరోనా సమయంలో రెండేళ్లపాటు పరిశ్రమ పూర్తిగా మూతపడిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ గ్రానైట్‌ వ్యాపారం పుంజుకుంటున్న దశలో ఈడీ దాడులు జరుగడం గ్రానైట్‌ వ్యాపారంలో ఉన్న ప్రధాన సంస్థలన్నీ ఈడీ కేసుల్లో ఇరుక్కోవడంతో పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2022-11-12T00:21:47+05:30 IST

Read more