ముమ్మరంగా జీవన ప్రమాణాల సర్వే

ABN , First Publish Date - 2022-09-29T05:30:00+05:30 IST

ప్రజల జీవన విధానంపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 79వ సామాజిక, ఆర్థిక సర్వే జిల్లాలో కొనసాగుతోంది.

ముమ్మరంగా జీవన ప్రమాణాల సర్వే
జగిత్యాలలో సర్వే నిర్వహిస్తున్న అధికారులు

- జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల ఎంపిక

- పల్లెలు, పట్టణాల్లో 256 కుటుంబాలు

- 14 అంశాలపై వివరాల సేకరణ

జగిత్యాల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజల జీవన విధానంపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 79వ సామాజిక, ఆర్థిక సర్వే జిల్లాలో కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం జాతీయ గణాంక, పథకాల అమలు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జీవన విధానంపై సర్వే నిర్వహిస్తుంటారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలను ఎంపిక చేసి ప్రజల స్థితిగతుల ను, ఆదాయ, వ్యయాలు, విద్య, వైద్యం తదితర అంశాలకు సంబందించిన వివరాలను జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సేకరిస్తున్నారు. జూలైలో ప్రారంభమైన ఈ ప్రక్రియ  సెప్టెంబరు 30వ తేదీ వరకు పూర్తి చేసేలా నిర్ధేశించారు. ప్రస్తుత పర్యాయం నూతనంగా ఆయుష్‌ వైద్యం అంశం సర్వేలో పొందుపరిచారు.


సర్వేలో సేకరిస్తున్న అంశాలు 


జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఇళ్ల వద్దకు వెళ్లి కుటుంబాల నుంచి 14 అంశాలపై వివరాలను సేకరిస్తున్నారు.  కుటుంబ సభ్యుల సంఖ్య, చేసే పని, విద్యార్హతలు, ఆదాయ, వ్యయాలు, ఆరోగ్యం, విద్యపై వెచ్చించిన ఖర్చు, సురక్షిత నీటి వసతులు, పారిశుధ్యం, బ్యాంకు ఖాతాలు, గృహవసతి, మొబైల్‌ ఫోన్‌ సౌకర్య,ం ఇంటర్‌ నెట్‌ వసతులు, లింగ నిష్పత్తి వివరాలను సేకరిస్తున్నారు. వీటితో పాటు ఉపాధిలో యువత నిష్పత్తి, అయిదేళ్లలోపు పిల్లల జననాల నమోదు, ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉన్నవారు, యేడాదిలో ఆసు పత్రిలో చికిత్స నిమిత్తం చేరిన జనాభా, అందుకైన వైద్య ఖర్చులు, ఇతర సమగ్ర వివానలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.

ఆయుష్‌ వైద్యం వివరాల సేకరణ

కరోనాతో గత రెండేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అల్లోపతి వైద్యమే కాకుండా కొంత మంది ఆయుర్వేదం వైపు మొగ్గు చూపారు. ఆయుర్వేదం, యునాని, సిద్ద, హోమియో, యోగా, నేచురోపతి తదితర వైద్య సేవలపై ఆసక్తి కనబరిచారు. ఆయుర్వేద వైద్యంపై ఎంతవరకు ప్రజల్లో అవగాహణ కలిగింది. ఎంత మంది ఆయుర్వేద మందులు వినియోగించారు. మందులకు చేసిన ఖర్చులు ఎంత. ఆయు ర్వేద వైద్యం కోసం ఆసుపత్రుల్లో చేరిన వారు ఎందరు,  మందులు, చికి త్సకు అయిన ఖర్చులు అన్నింటినీ సేకరిస్తున్నారు.

జిల్లాలో సర్వే ఇలా..

జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాలు, పల్లెల్లో ర్యాండమ్‌ సర్వే నిర్వహిస్తున్నారు. పల్లెలతో పాటు పట్టణాల పరిధిలో ఎంపిక చేసిన బ్లాక్‌ల్లో కుటుంబాలపై సర్వే చేయనున్నారు. ప్రస్తుతం సర్వేలో సేకరిస్తున్న వివరాలను మాన్యువల్‌గా రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. వాటిని త్వరలోనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయనున్నారు. ముందు గా ఎంపిక చేసిన గ్రామంలో ఉత్తరం, పడమర కలిసే మూల ప్రాంతాన్ని గుర్తిస్తారు. సంబందిత మూలప్రాంతం నుంచి గడియారం ముల్లు తిరిగే ప్రక్రియకు వ్యతిరేకంగా ఇళ్లను సర్వే చేస్తారు. 1,200 జనాభా వచ్చే వరకు వరసగా ఇళ్లలో సర్వే నిర్వహిస్తారు. గ్రామాల వారీగా ఉన్న గృహా లను సంఖ్య సర్వే చేస్తారు. ఇందులో 1200 జనాభాకు ఒక బ్లాక్‌ను ఎంపి క చేస్తారు. ఎంపిక చేసిన బ్లాక్‌లో ర్యాండమ్‌గా 32 గృహాలు ఎంపిక చేస్తారు. సంబంధిత ఎంపిక చేసిన గృహాలలో ఉన్న జనాభా వివరాలను సేకరిస్తారు. ఒక గ్రామంలో 32 గృహాలలో మాత్రమే ర్యాండమ్‌ సర్వే నిర్వహిస్తారు.

సర్వే జరుగుతున్న ప్రాంతాలివే

జిల్లాలోని గొల్లపల్లి మండలం రాపల్లి, రాయికల్‌ మండలం బోర్నపల్లి, ద్యావనపల్లి, ఇటిక్యాల్‌, కథలాపూర్‌ మండలం భూషన్‌రావుపేట, మేడిపల్లి మండలం పోరుమల్ల, వెల్గటూరు మండలం గొడిశాల, ధర్మపురి మండలం రాజారాం ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఇళ్లలో జీవన ప్రమాణాల సర్వే నిర్వహిస్తున్నారు. సంబందిత మండలాలకు చెందిన ఎంపీఎస్‌ఓలు, ఎన్యూమరేటర్లు, జిల్లా ప్రణాళిక విభాగానికి చెందిన అధికారులు, ఉద్యో గులు, సిబ్బంది సర్వేలో భాగస్వామ్యం అవుతున్నారు.


పకడ్బందీగా జాతీయ ఆర్థిక సర్వే

- పూర్ణచంద్ర, జిల్లా ప్రణాళిక అధికారి, జగిత్యాల

జిల్లాలో పకడ్బందీగా 79వ జాతీయ ఆర్థిక సర్వే నిర్వహిస్తున్నాం. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాయి. ఎంపిక చేసిన గ్రామాలలో సర్వే కొరకు వచ్చే అధికారులు, ఎన్యూమ రేటర్లకు ప్రజలు సహకరించి వివరాలను అందించాలి. సర్వేలో సేకరిం చిన వివరాలను క్రోడీకరించి జాతీయ స్థాయిలో ప్రణాళిక  రూపొందిస్తారు.

Updated Date - 2022-09-29T05:30:00+05:30 IST