నయా ట్రెండ్‌

ABN , First Publish Date - 2022-11-28T01:46:38+05:30 IST

హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లాలంటే ఆర్టీసీ కౌంటర్‌ వద్దకు వెళ్లి సీటు రిజర్వేషన్‌ కోసం క్యూ కట్టడం... లేదంటే ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోవడం, లగ్జరీగా ఉండాలనుకునే వారు టాక్సీ మాట్లాడుకోవడం ఇదంతా ఒకప్పటి మాట. కరోనా తరువాత టాక్సీ ప్రయాణం పెరిగిపోయింది. ఇది కొత్త ట్రెండ్‌కు దారి తీసింది.

నయా ట్రెండ్‌
గోదావరిఖనిలోని ఓ ట్యాక్సీ స్టాండ్‌లో ఉన్న వాహనాలు

- కార్లు మావి.. ప్రయాణం మీది..

- కొత్త యాప్‌లతో మారిన జర్నీ తీరు

- మొగ్గు చూపుతున్న పారిశ్రామిక ప్రాంత ప్రజలు

గోదావరిఖని, నవంబర్‌ 27: హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లాలంటే ఆర్టీసీ కౌంటర్‌ వద్దకు వెళ్లి సీటు రిజర్వేషన్‌ కోసం క్యూ కట్టడం... లేదంటే ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోవడం, లగ్జరీగా ఉండాలనుకునే వారు టాక్సీ మాట్లాడుకోవడం ఇదంతా ఒకప్పటి మాట. కరోనా తరువాత టాక్సీ ప్రయాణం పెరిగిపోయింది. ఇది కొత్త ట్రెండ్‌కు దారి తీసింది.

ఫ రెండేళ్ల క్రితం కరోనా మహామ్మారి వచ్చి అన్ని వ్యవస్థలను కుదిపేసింది. ఆ సమయంలో సామూహిక ప్రయాణాలు చేసేందుకు వీలు లేకపోయింది. కార్ల కంపెనీలు తగ్గింపు ఆఫర్లు, ఫైనాన్స్‌ కంపెనీలు ఎలాంటి డౌన్‌పేమేంట్లు లేకుండా, మూడు నెలలు నో ఈఎంఐ వంటి ఆఫర్లు ఇవ్వడంతో ఒక్కసారిగా కొత్త కార్ల కొనుగోళ్ళు పెరిగిపోయాయి. ఇప్పటికి చాలా మంది ఆర్టీసీ బస్సుల్లో కాకుండా సొంత కార్లలో ప్రయాణాలు చేస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ కారు ప్రయాణాలు నయా ట్యాక్సీ ట్రెండ్‌కు దారి తీసింది. పెద్ద సంఖ్యలో కారు యాప్‌లు పుట్టికొచ్చి కొత్త ప్రయాణాన్ని పరిచయం చేశాయి. గోదావరిఖని వంటి ప్రాంతంలో వాహనదారులు సొంత పనిమీద హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళుతున్నప్పుడు ఈ యాప్‌ ద్వారా డ్రాపింగ్‌, పికప్‌ల చేసుకుంటూ ప్రయాణికులను చేరుస్తున్నారు. ఫలితంగా తమకు అయ్యే పెట్రోల్‌, డీజిల్‌, టోల్‌ ఖర్చులు వెళ్లిపోతున్నాయి. అలాగే ఈ కార్లలో ప్రయాణం చేసే వారికి సౌకర్యవంతంగా ఉంటోంది. సీజన్‌ బట్టి ఒక్క ప్రయాణీకుడి నుంచి రూ.500 నుంచి 800 వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఫ పెరిగిన చార్జీలు..

కరోనా తరువాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఆర్టీసీ చార్జీలు కూడా పెరిగిపోయాయి. దీంతో సౌకర్యవంతమైన బస్సులో హైదరాబాద్‌కు వెళ్లాలంటే సుమారు 500 వరకు ఖర్చు అవుతోంది. అయితే అవే డబ్బులతో కారు యాప్‌ ద్వారా వెళ్లడం వల్ల ఎక్కువ మందితో ప్రయాణం తగ్గడంతో పాటు సౌకర్యంగా ఉంటుందనే ఆలోచనతో ఎక్కువ మంది కారు యాప్‌ను వినియోగించుకుంటున్నారు. అలాగే సొంత వాహనంలో ఇద్దరు వెళితే ఖాళీ ఉండటంవల్ల ప్రయోజనం ఏమీ లేదని కార్ల యాజమానులు ఇందుకు మొగ్గు చూపుతున్నారు.

ఫ ప్రభుత్వ ఆదాయానికి గండి..

యాప్‌లను ఉపయోగించుకొని సొంత వాహనాల్లో ప్రయాణికులను గమ్యం చేరుస్తుండడంతో డీజిల్‌, పెట్రోల్‌, టోల్‌ ఖర్చులు కలిసిరావడం, సౌకర్యవంతమైన ప్రయాణికులకు గమ్యం చేరుస్తుండటం బాగానే ఉన్నప్పటికి ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండి పడుతున్నది. ఆర్టీసీలో ప్రయాణాలు తగ్గడంతో పాటు సొంత వాహనాల్లో ట్యాక్సీగా ఉపయోగించుకోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. ట్యాక్సీ నంబర్‌ ప్లేట్‌పైనే ప్రయాణికులను చేరవేయాల్సి ఉంటుంది. ఈ ట్యాక్సీ నంబర్‌ ప్లేట్‌ కోసం ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం యాప్‌లను ఉపయోగించుకోని ప్రయాణాలు చేయడం వల్ల ఆదాయం రావడం లేదు.

ఫ ట్యాక్సీ స్టాండ్‌లోనే వాహనాలు..

జిల్లాలో వందలాది మంది నిరుద్యోగ యువకులు రుణాలు, అప్పులు తీసుకువచ్చి వాహనాలు తీసుకొని ట్యాక్సీల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఇలాంటి యాప్‌లను ఉపయోగించుకొని ప్రయాణాలు జరుగుతుండటంతో నెలకు రెండు మూడు ప్రయాణాలు కూడా జరగడం లేదని ట్యాక్సీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ట్యాక్సీ స్టాండ్‌లలో ఎక్కడి వాహనాలు అక్కడే ఉండిపోతున్నాయని పేర్కొంటున్నారు. డబ్బులు మినహా కారు యాజమానులకు, ప్రయాణికులకు సౌకర్యంగా ఉన్నప్పటికీ ప్రైవేట్‌ ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదకరమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-11-28T01:46:46+05:30 IST