రవీందర్‌సింగ్‌పై వేటు వేయండి.. కేసీఆర్‌, కేటీఆర్‌కు ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-09-11T02:13:42+05:30 IST

జాతీయ రాజకీయాల్లో కరీంనగర్‌ (Karimnagar) మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధ్యతలు అప్పగించనున్నారని

రవీందర్‌సింగ్‌పై వేటు వేయండి.. కేసీఆర్‌, కేటీఆర్‌కు ఫిర్యాదు

కరీంనగర్‌: జాతీయ రాజకీయాల్లో కరీంనగర్‌ (Karimnagar) మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధ్యతలు అప్పగించనున్నారని వార్తలు వస్తున్న తరుణంలో కరీంనగర్‌లో వైరల్‌ అయిన ఆడియో క్లిప్పింగ్‌ రాజకీయ కలకలం సృష్టిస్తున్నది. ఈ ఆడియో రవీందర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని కార్పొరేషన్‌లోని టీఆర్‌ఎస్‌పార్టీకి చెందిన కార్పొరేటర్లందరూ తీర్మానం చేసి పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి కారణమైంది. కార్పొరేటర్లందరూ రవీందర్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ (CM KCR)కు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR)కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, ఆయన కుటుంబసభ్యులు పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీని, ప్రభుత్వాన్ని, మంత్రి గంగుల కమలాకర్‌ను అపఖ్యాతిపాలు చేస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నందున ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఏకగ్రీవంగా డిమాండ్‌ చేశారు. 


ఈమేరకు శనివారం డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌తోపాటు టీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రవీందర్‌సింగ్‌ అల్లుడు కార్పొరేటర్‌ కమల్‌జిత్‌కౌర్‌ భర్త సోహెన్‌సింగ్‌ ఉద్దేశపూర్వకంగా మంత్రి గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar)ను అపఖ్యాతి పాలు చేసేందుకు  స్వయంగా తానే రోడ్డు, నల్లాలను తొలగించానంటూ మంత్రిపై అనుచిత వాఖ్యలు చేస్తూ మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంటూ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ ఆయన కుటుంబసభ్యులతో కావాలని ప్రభుత్వాన్ని, మంత్రిని బదునామ్‌ చేస్తున్నట్లు ఆడియో క్లిప్పింగ్‌తో స్పష్టమైందని అన్నారు. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు రాజకీయాలుచేస్తున్న మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, ఆయన అల్లుడు సోహెన్‌సింగ్‌, ఆయన భార్య, కార్పొరేటర్‌ కమల్‌జిత్‌కౌర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని  ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రవీందర్‌సింగ్‌ను ఈ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ప్రచారంలో ఉన్న ఆడియో క్లిప్పింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరో ఒకరు వారి మాటల్లో తన పేరు ప్రస్తావించినంత మాత్రాన దానికి తానెలా బాధ్యుడనవుతానని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌కు తనకు ఎలాంటి విబేధాలు లేవని, భవిష్యత్‌లో కూడా రావని, తామిద్దరం నిన్ననే కలుసుకున్నామని రవీందర్‌సింగ్‌ తెలిపారు.

Updated Date - 2022-09-11T02:13:42+05:30 IST