కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్లు!

ABN , First Publish Date - 2022-10-12T09:11:30+05:30 IST

కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్ల కుటుంబం అని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్లు!

  • నీ అవినీతి చిట్టా.. విదేశాలకు వెళ్లి 
  • ఏం చేశావో అన్నీ తెలుసు
  • తాడిచర్లలో రూ.10వేల కోట్ల 
  • కుంభకోణంపై నేను మాట్లాడానా?
  • ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్నాం
  • కేటీఆర్‌.. అప్పుడు నువ్వెక్కడున్నావ్‌? 
  • ముందు నీ చెల్లిని కాపాడుకో
  • ‘కోవర్టు బ్రదర్స్‌’ కామెంట్స్‌పై 
  • క్షమాపణలు చెప్పు.. వెంకట్‌రెడ్డి ఫైర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్ల కుటుంబం అని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ‘వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ కోమటిరెడ్డి బ్రదర్స్‌ కాదు.. కోవర్టు బ్రదర్స్‌’ అంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బులెట్లు తిన్న తాము కోవర్టులమా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ‘తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నాను. అప్పుడు నువ్వెక్కడున్నావ్‌’ అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు. తనపై  చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ ఉపసంహరించుకొని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘కేటీఆర్‌.. నీ అవినీతి చిట్టా మొత్తం నాకు తెలుసు. నువ్వు విదేశాలకు వెళ్లి ఏం చేశావో కూడా తెలుసు. 


అయినా నువ్వెందుకు విదేశాలకు వెళ్లావు అని నేను అడిగానా? తడిచర్లలో రూ.10వేల కోట్ల కుంభకోణంపై నేను మాట్లాడానా? ముందు నీ చెల్లి కవితను కాపాడుకో’’ అని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో జరిగిన అభివృద్థి.. మునుగోడులో ఎందుకు జరగలేదని, సంతోష్‌ రావుకు మునుగోడు బాధ్యతలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామి అని టీఆర్‌ఎస్‌ చెప్పుకొంటున్నప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులను దించడం అవసరమా? అని ప్రశ్నించారు. విదేశీ పర్యటన తన వ్యక్తిగతం అని, సొంత పార్టీ నేతలు తిట్టిన బాధతోనే తాను మునుగోడులో ప్రచారానికి వెళ్లడం లేదని వెంకటరెడ్డి పేర్కొన్నారు. అయినా తను ప్రచారానికి వెళ్లినా.. వెళ్లకపోయినా టీఆర్‌ఎస్‌ వాళ్లకెందుకు అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి తానే కృషి చేశానని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రూ.1600 కోట్ల నిధులు కేటాయించేట్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చానని తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి ఏ ఒక్క ఎంపీ కూడా పార్టీ మారబోరని స్పష్టం చేశారు.  

Read more