తెలంగాణ అస్తిత్వానికి కాళోజీ ప్రతీక

ABN , First Publish Date - 2022-09-10T08:18:48+05:30 IST

తెలంగాణ అస్తిత్వానికి కాళోజీ నారాయణరావు ప్రతీక అని, తెలంగాణ భాషకు ఆయన నిలువెత్తు నిదర్శనమని వక్తలు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ అస్తిత్వానికి కాళోజీ ప్రతీక

శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ  పురస్కారం ప్రదానం

రవీంద్ర భారతి, తెలంగాణ భవన్‌లో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు


రవీంద్రభారతి, న్యూఢిల్లీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అస్తిత్వానికి కాళోజీ నారాయణరావు ప్రతీక అని, తెలంగాణ భాషకు ఆయన నిలువెత్తు నిదర్శనమని వక్తలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 108వ జయంతి కార్యక్రమం రవీంద్ర భారతిలో శుక్రవారం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ నారాయణ రావు పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ తెలంగాణ భాషపై పట్టు ఉన్న గొప్ప కవి కాళోజీ అని, ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ పోరాటం చేశారని అన్నారు. కాళోజీకి ఎప్పటికీ మరణం లేదని కవిత్వం ఉన్నంతకాలం ఆయన ప్రజలకు గుర్తుండిపోతారని తెలిపారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆనందకరమని అన్నారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ యాస కాదు భాష అని నిరూపించిన గొప్ప కవి కాళోజీ నారాయణరావు అని అన్నారు. వాస్తవిక విషయాలను తన కవిత్వంలో చెప్పిన కాళోజీ ప్రజాకవి అని కొనియాడారు. కాళోజీ కవిత్వం మలిదశ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందన్నారు.


ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ కాళోజీ వంటి మహనీయులను స్మరించుకొని ఆయన స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది కాళోజీ పురస్కార గ్రహీత రామోజు హరగోపాల్‌ మాట్లాడుతూ కాళోజీ వంటి మహనీయుని పేరిట నెలకొల్పిన పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాళోజీ స్ఫూర్తితోనే తాను కవిత్వం రాశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ.రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరిశంకర్‌, సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ దీపికారెడ్డి, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌ శ్రీదేవి, ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ, ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ఇక, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోనూ కాళోజీ జయంతి ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సాహ్ని, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ఉప్పల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-10T08:18:48+05:30 IST