కాళేశ్వరం తెల్ల ఏనుగు

ABN , First Publish Date - 2022-05-30T08:55:53+05:30 IST

ఆకునూరి మురళి.. అతి పిన్న వయసులోనే గ్రూప్‌-1 కొలువు సాధించి.. ఆర్‌అండ్‌బీలో ఇంజినీర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించారు.

కాళేశ్వరం తెల్ల ఏనుగు

  • ప్రపంచంలోనే అంత మూర్ఖపు ప్రాజెక్టు లేదు
  • ఎకరాకు నీరు పారించాలంటే 50 వేలు అవుతోంది
  • ఇంకో ఐదేళ్లలో ప్రాజెక్టు మూసేయాల్సి వస్తుంది
  • దళిత బంధు ఒక మోసపూరిత పథకం
  • రాష్ట్రమంతా అందాలంటే 156 ఏళ్లు పడుతుంది
  • కేసీఆర్‌ ఐఏఎస్‌ వ్యవస్థను చాలా నీరుగార్చారు
  • సర్కారు బడులను కావాలనే పట్టించుకోవట్లేదు


ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి

ఆకునూరి మురళి.. అతి పిన్న వయసులోనే గ్రూప్‌-1 కొలువు సాధించి.. ఆర్‌అండ్‌బీలో ఇంజినీర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కలెక్టర్‌గా పనిచేసి ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో నిష్ణాతులు. కలెక్టర్‌గా సమర్థంగా పనిచేస్తున్నా.. తెలంగాణ సర్కారు ప్రాధాన్యం లేని పోస్టు ఇచ్చి, పక్కన బెట్టడంతో.. సొంతంగానే సమాజానికి ఏదైనా చేద్దామని వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. అయితే, మురళి పనితీరు తెలిసిన ఏపీ ప్రభుత్వం.. ఆయనకు విద్యా శాఖ సలహాదారుగా అవకాశమిచ్చింది. ఏపీలో సంతృప్తిగా పని చేస్తున్నానని చెబుతున్న ఆయన.. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో తన మనసులోని భావాలను పంచుకున్నారు.


ఉన్నట్టుండి వీఆర్‌ఎస్‌ ఎందుకు తీసుకున్నారు?

నేను ఏ శాఖలోకి వెళ్లినా నన్ను బాగా ఉపయోగించుకోవాలని హెచ్‌వోడీలు, ప్రభుత్వం అనుకునేవాళ్లు. తెలంగాణ వచ్చాక కూడా మొదట్లో బాగానే ఉన్నా. సీఎంతో క్లోజ్‌గా ఉండేవాడిని. నేను మొదట పాఠశాల విద్య కమిషనర్‌ పోస్టు అడిగితే ఇవ్వలేదు. తర్వాత.. ఎస్సీ కార్పొరేషన్‌లో పోస్టింగ్‌ అడిగా. అప్పటి సీఎస్‌ రాజీవ్‌ శర్మకు చెప్పగానే.. ఆయన సీఎం దగ్గరికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఇవ్వలేదు. ఇదే నా ఆవేదన. నిజానికి తెలంగాణ రాకముందు అందరూ నాకు మంచి పోస్టులు ఇచ్చారు. కారణమేంటో తెలియదుగానీ ఉన్నట్టుండి కేసీఆర్‌ నాకు ప్రాధాన్యం తగ్గించారు. మొత్తంగా పక్కనబెట్టేశారు. 


అసలు మీ ఇద్దరికీ ఎక్కడ చెడింది..?

నా గురువు కొప్పుల రాజు. మేమిద్దరం కలిసి 13-14 ఏళ్లు పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో పని చేశాం. నేను ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయనను కలుస్తుంటాను. ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఇది ఒక కారణమని కొంత మంది మంత్రులు చెప్పారు. ఏడాదిన్నర ఎదురుచూశా. ఏమీ జరగలేదు. ఇక్కడుండి సమయం వృథా అని.. బయటకొచ్చేశా. నేను రాజీనామా చేసిన వారంలోనే ఏపీ ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. విద్యా శాఖ సలహాదారుగా సంతృప్తిగా పనిచేస్తున్నా.


అక్కడ ఏం చేస్తున్నారు..?

గ్రామీణ భారతంలో ప్రజలను ప్రత్యక్షంగా భాగస్వాములను చేసి, గొప్పగా అభివృద్ధి చేయడం(కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌)లో నేను ప్రపంచంలోనే నిష్ణాతుడిని. ఏపీలో ‘నాడు-నేడు’ అని పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ఒక మంచి కార్యక్రమం. అది చేసుకుంటూ.. నాణ్యమైన విద్య, విద్యాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై పనిచేస్తున్నా. 


ఎస్‌.ఆర్‌ శంకరన్‌లా పేరు తెచ్చుకోలేకపోయారేం?

అప్పట్లో ప్రజాస్వామ్యం ఉండేది. ఇప్పుడు ఏకస్వామ్యం ఎక్కువైంది. 


పాలకులు చేయనిచ్చేదేంటి..మీరు చేయొచ్చుగా?

నేను కలెక్టర్‌గా పని చేసేటప్పుడు విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు కృషి చేశా. వెంటనే నాకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. పెద్ద సారు కోపమవుతున్నారని. ఇలా నేను ఐఏఎ్‌సనైనా.. అనుకున్నవన్నీ చేయలేను. కేసీఆర్‌ హయాంలో నాన్‌ ఐఏఎస్‌లకు, రిటైరైన వారికి ఐఏఎస్‌ పోస్టులు ఇస్తున్నారు. వారిలో అవినీతిపరులున్నారు. కుల సమీకరణాలు ఉన్నాయి. ఇలా ఐఏఎస్‌ వ్యవస్థను నీరుగార్చారు.


ఇప్పుడు ఆంధ్రాలోనూ అదే జరుగుతోంది కదా..? 

రాజకీయనేతలు ఒకరిని చూసి ఒకరునేర్చుకుంటారు. 

ఆంధ్రాలో ఐఏఎస్‌ అధికారులు రోజు విడిచి రోజు కోర్టుకెళతారు.. కోర్టు ధిక్కరణ కేసుల్లో..

అక్కడ ఇంత దారుణంగా లేదు. నేను ఐఏఎస్‌ అధికారులతో కలిసి అక్కడ సీఎంతో ప్రతి వారం సమావేశమవుతా. అక్కడ పరిస్థితి వేరు. అక్కడ అధికారులను ఆయన బాగా ఉపయోగించుకుంటున్నారు.  


మరి వాళ్లు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారేం? 

ఓపెన్‌గా మాట్లాడాలంటే జ్యుడిషియల్‌ వ్యవస్థలోనూ రాజకీయాలొచ్చాయి. మొన్న 8 మంది ఐఏఎ్‌సలను జైలుకు పంపారు కదా..అందులోవారి ప్రమేయమే లేదు.


20ఏళ్ల క్రితంఐఏఎ్‌సలు డబ్బుతీసుకోవడం విన్నారా?

లేదు. అప్పుడు 5 శాతం అలా ఉండేవారని విన్నాం. ఇప్పుడు రివర్స్‌ అయింది. సీఎం, కేబినెట్‌ స్మార్ట్‌గా ఉంటే దీనిని అరికట్టొచ్చు. ఇప్పుడు ప్రభుత్వమే అవినీతిని ప్రోత్సహిస్తోంది. అవినీతి ఐఏఎస్‌లకే మంచి పోస్టులు ఇస్తున్నారు. కలెక్టర్లే కాదు.. కింది స్థాయిలోనూ చాలా మంది అవినీతి అధికారులున్నారు. 


చాలా మంది నిజాయితీగా లేకపోవడానికి కారణం?

వాళ్లు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. నేను ఒక ఏడాది ఆర్‌అండ్‌బీలో డిప్యుటీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేశాను. రోడ్‌ సేఫ్టీ మీద ఇంజినీర్లకు అవగాహన కల్పించేందుకు ఆ శాఖ మంత్రిని ఒప్పించి వెయ్యి మంది ఇంజినీర్లతో సమావేశం ఏర్పాటు చేశాను. ‘నేను చాలా మంది ఇంజినీర్లను చూశాను. ప్రతి ఒక్కరూ డబ్బులొచ్చే పోస్టు కావాలని పైరవీలు చేస్తుంటారు. ఎంతసేపూ ఇదే గోల. కానీ మురళి గారు వస్తే నాకు ఆయన కాళ్లు మొక్కాలని అనిపిస్తుంది’ అని మంత్రి గారు అన్నారు.. నేను స్టేజి మీద ఉండగానే. అది నాకు అవార్డు. ఆ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌  రావు.


గతంలో మీ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయిగా? 

ఆ రోజు వరల్డ్‌ టీబీ డే. నేను కలెక్టర్‌గా అప్పటికే గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతున్నాను. నాకు అక్కడి పరిస్థితి అర్థమైంది. మన ప్రాంతంలో టీబీ తగ్గుతోందా? పెరుగుతోందా? అని నేను డీఎంహెచ్‌వోను అడిగాను. ఆయన పెరుగుతోందని చెప్పారు. ఎందుకని ప్రశ్నించగా.. మన వాళ్లు ప్రొటీన్‌ ఆహారం తినడం లేదన్నారు. అప్పటికే నేను గ్రామాల్లో చూశాను. చాలా మంది గిరిజనులు శాకాహారం వైపు మళ్లుతున్నారు. ఫలితంగా రెండు సమస్యలు వస్తున్నాయి. ఒకటి ప్రొటీన్‌ ఆహారం అందడం లేదు. రెండు.. అడవి పందులను తినకపోవడంతో వాటి సంఖ్య పెరిగిపోయి.. పంటలను నాశనం చేస్తున్నాయి. ఆ సందర్భంలో నేను పందులను తినాలని చెప్పా. అటు పంటలకూ నష్టం జరగదని చెప్పా. అది వివాదాస్పదమైంది. తర్వాత ఇదే ప్రభుత్వం అడవి పందులను చంపొచ్చని ఆదేశాలు ఇచ్చింది.


సర్కారీ స్కూళ్లను పట్టించుకోవట్లేదంటారా?

వంద శాతం. తెలంగాణలో రూ.12వేల కోట్లు టీచర్ల జీతాలు ఇస్తున్నారు. పాఠశాల స్థాయిలో ఒక విద్యార్థి మీద ఏడాదికి రూ.40-45వేలు ఖర్చు పెడుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో రూ.7వేలు ఖర్చు పెడుతున్నారు. కానీ, వాళ్లు 90 శాతం ఏ గ్రేడ్‌ తీసుకొస్తే.. సర్కారు పాఠశాలల్లో 63శాతం సీ గ్రేడ్‌ ఉంటున్నారు. పాఠశాల విద్య మీద గానీ, యూనివర్సిటీ విద్య మీద గానీ, నాణ్యమైన విద్య విషయంలోగానీ సీఎం కేసీఆర్‌ ఐదు నిమిషాలైనా సమీక్ష నిర్వహించారా? 


దళిత బంధుపై మీ అభిప్రాయం..?

అది ఒక మోసపూరిత పథకం. సమాజంలో అన్ని వర్గాల్లో పేదలు ఉన్నారు. పేదలు అభివృద్ధి చెందేలా పథకాల రూపకల్పన ఉండాలి గానీ, ఎస్సీలు దూరమవుతున్నారని.. వాళ్లకు పెద్ద పథకం పెట్టి, ఓట్లు వేయించుకుంటామనే దుర్మార్గపు ఆలోచన ఇది. రాష్ట్రంలో 18 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేస్తోంది. ఇలాగైతే.. దళితబంధు అందరికీ అందాలంటే 156 ఏళ్లు పడుతుంది. 


కాళేశ్వరం ప్రాజెక్టును మీరు వ్యతిరేకిస్తారా..? 

అది దొంగ స్కీం. నేను భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పనిచేశా. దాని డీపీఆర్‌ డిజైన్‌ చేసినప్పుడు సీఎం గారు 36 లక్షల ఎకరాల ఆయకట్టు అని చెప్పారు. ప్రారంభించినప్పుడు 42 లక్షల ఎకరాలు అన్నారు. ఆ ప్రాజెక్టు నీరు ఎన్ని ఎకరాల్లో పారుతుందని నేను రేపు ఆర్టీఐ పెడతాను. 15 లక్షల ఎకరాలు పారుతుందని నిరూపిస్తే.. దేనికైనా సిద్ధం. ప్రపంచంలోనే ఇంత మూర్ఖపు ప్రాజెక్టు లేదు.. ఎకరా వరికి నీరు పారించాలంటే దీనికయ్యే కరెంటు ఖర్చు రూ.50 వేలు. ఇది నేను చెప్పడం కాదు.. నీటి పారుదల శాఖ సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఒక పత్రికకు రాసిన వ్యాసంలో చెప్పారు. 


మరి తెలంగాణకు నీరు ఎలా తీసుకురావాలి? 

నీటి పారుదల రంగంలో హన్మంతరావు వంటి నిష్ణాతులు ఉన్నారు. అలాంటి వాళ్లతో చర్చించి ఒక మంచి విధానం రూపొందించాలి. కేసీఆర్‌తో సమస్య ఏంటంటే.. ఎవరో చెప్తారు.. ఆయన మైండ్‌లోకి ఎక్కితే.. ఆయనే ఇంజినీర్‌ అయిపోతారు. ఆయనే విధాన రూపకర్త అయిపోతారు. అలా అయితే ఇలాంటి తప్పులే జరుగుతాయి. అందులో ఒక దుర్మార్గపు ఆలోచన ఏంటంటే.. ఎంత పెద్ద ప్రాజెక్టు తీసుకుంటే.. అందులో వచ్చే కమీషన్‌ డబ్బులు అంత ఎక్కువ ఉంటాయ్‌. ఒకే దెబ్బతో ఇంకో మూడు, నాలుగు ఎన్నికలకు సరిపడా పెట్టుబడి డబ్బులు సంపాదించుకోవచ్చు. కాళేశ్వరం తెల్ల ఏనుగు. ఇంకో ఐదేళ్లలో మూసేయాల్సి వస్తుంది. 


కేసీఆర్‌ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు 

టార్చ్‌ బేరర్‌గా మారాలనుకుంటున్నారా?

నేను ఆల్రెడీ మారాననే అనుకుంటున్నాను. పేదలకు కావాల్సింది విద్య, వైద్యం. వీటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టట్లేదు. తెలంగాణ రాక ముందు విద్యకు 11శాతం బడ్జెట్‌ ఉండేది. అది ఇప్పుడు 6.2 శాతానికి వచ్చింది. కేంద్రంలో కూడా గతంలో 6 శాతం ఉంటే.. దానిని 2.6శాతం చేశారు. ధనిక దేశమైన అమెరికాలో 93శాతం ప్రభుత్వ, 7శాతం ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. మరి మన పేద దేశంలో ఎలా ఉండాలి. సరిగ్గా ప్రణాళిక ఉంటే.. ఐదేళ్లలో రాష్ట్రంలో అద్భుతమైన స్కూళ్లు కట్టొచ్చు. ప్రతి నియోజకవర్గంలో అపోలో, యశోద, కేర్‌ వంటి ఆస్పత్రులు నిర్మించొచ్చు.

Updated Date - 2022-05-30T08:55:53+05:30 IST