నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహం

ABN , First Publish Date - 2022-07-07T08:25:20+05:30 IST

వరంగల్‌ నగరంలో ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహం

  • కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భంజ్‌ దేవ్‌ రాక.. 
  • 700 ఏళ్ల తర్వాత పురిటిగడ్డకు ఓ కాకతీయ వారసుడు
  • ఏడు రోజుల  సాంస్కృతిక ప్రదర్శనలు
  • 13న రామప్ప గుడిలో ముగింపు కార్యక్రమానికి కేటీఆర్‌ వస్తారు
  • చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ 


హనుమకొండ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ నగరంలో ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారంపాటు పెద్ద ఎత్తున జరిగే ఈ ఉత్సవాలకు బస్తర్‌ మహారాజ్‌ 22వ కాకతీయ వారసుడు కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఏడు వందల యేళ్ల తర్వాత ఓ కాకతీయ వారసుడు తొలిసారిగా తమ పూర్వీకుల గడ్డపై అడుగుపెడుతుండటంతో ఘనస్వాగతం పలకడానికి సకల సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఉదయం ఓరుగల్లు కోటలోని ఖుష్‌మహల్‌ వద్ద ఈ సప్తాహ వేడుకలను కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ లాంఛనంగా ప్రారంభిస్తారు. భంజ్‌దేవ్‌ గురువారం ఉదయం 8 గంటలకు వరంగల్‌కు చేరుకుంటారు. మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన భద్రకాళి గుడిలో, వేయిస్తంభాలగుడిలో పూజలు చేస్తారు. హనుమకొండలోని అగ్గలయ్యగుట్ట వద్ద కాకతీయు తోరణాన్ని సందర్శిస్తారు. 


సప్తాహంలో భాగంగా కవి సమ్మేళనాలు, నాటక ప్రదర్శనలు, ప్రముఖ చరిత్రకారులు, మేధావులతో కాకతీయుల ఆలయాల సందర్శన, మిషన్‌ కాకతీయ, కాకతీయ త్రిటీస్‌ (ట్యాంక్స్‌, టెంపుల్స్‌, టౌన్స్‌) భావజాలంపై చర్చా కార్యక్రమాలు ఉంటాయి. బుధవారం ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, హనుమకొండ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, వివిధ శాఖల అధికారులు సప్తాహం వేడుకలు జరిగే ప్రదేశాలను సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. సప్తాహాన్ని పురస్కరించుకొని వరంగల్‌ నగరాన్ని ముస్తాబు చేశారు. కాకతీయుల కట్టడాలు ఉన్న ప్రదేశాలను విద్యుత్‌దీపాలతో అలంకరిస్తున్నారు. కాకతీయ వైభవ సప్తాహానికి ప్రత్యేకంగా లోగోను రూపొందించారు.


ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాళాశాలల్లో కాకతీయు వైభవంపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. బుధవారం హనుమకొండ హరిత కాకతీయహోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ కాకతీయ వైభవ సప్తాహాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. కాకతీయుల చరిత్రను భావితరాలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం  సప్తాహాన్ని అధికారికంగా  జరుపుతున్నదని తెలిపారు. ఏడు రోజుల పాటు కాకతీయుల వైభవం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కవి సమ్మేళనాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.  నాటి చెరువులు, ఆలయాల పునరుద్ధరణతో పాటు వారి చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉత్సవాలకు శ్రీకారం చుట్టిందని ఆయన తెలిపారు. 13న ఉత్సవాల ముగింపు కార్యక్రమం రామప్పలో జరుగుతుందని ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరవుతారని తెలిపారు.

Read more