భయం.. భయం

ABN , First Publish Date - 2022-07-14T08:38:03+05:30 IST

పెను వరద! మునుపెన్నడూ చూడలేనంత మాయదారి వరద! పంటలను, వంతెనలను, రహదారులను ధ్వంసం చేస్తూ.

భయం.. భయం

  • ప్రమాదంలో కడెం ప్రాజెక్టు.. హై అలర్ట్‌
  • ఔట్‌ ఫ్లోకు మించి ఇన్‌ ఫ్లోతో అధికారుల్లో గుబులు
  • 5లక్షల క్యూసెక్కుల రాక.. 3లక్షల క్యూసెక్కుల పోక
  • దిగువన 25 గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు 
  • ప్రాజెక్టు వద్దకు మంత్రి అల్లోల.. సీఎం కేసీఆర్‌ ఆరా
  • భద్రాచలం వద్ద తుది ప్రమాద హెచ్చరిక జారీ
  • 53.8 అడుగుల ఎత్తున ప్రవహిస్తున్న ఉగ్ర గోదారి
  • మేడిగడ్డకు 16 లక్షల క్యూసెక్కుల రికార్డు ఇన్‌ఫ్లో 
  • జూరాలకు బిరబిరా కృష్ణమ్మ.. 92 వేల క్యూసెక్కులు
  • రాష్ట్రవ్యాప్తంగా ఆగని వర్షాలు, వరదలు
  • ఆదిలాబాద్‌ రూరల్‌లో 31.2 సెం.మీ వర్షపాతం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): పెను వరద! మునుపెన్నడూ చూడలేనంత మాయదారి వరద! పంటలను, వంతెనలను, రహదారులను ధ్వంసం చేస్తూ.. గ్రామాలను, ఇళ్లను ముంచెత్తుతూ సాగుతున్న దాని ప్రచండ వేగం ఇప్పుడు ప్రాజెక్టులనే దడదడలాడిస్తోంది. మహోగ్రంగా పోటెత్తుతున్న గోదావరి ఉధృతికి నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుది ఇప్పుడిదే పరిస్థితి! ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి.. బయటకు వెళుతున్న నీళ్ల (ఔట్‌ ఫ్లో) కన్నా ప్రాజెక్టులోకి వచ్చే వరద (ఇన్‌ ఫ్లో) ఒకటిన్నర రెట్లకు మించి పోటెత్తడంతో తన్నుకొస్తున్న ఆ వెల్లువకు మరో మార్గం లేక ప్రాజెక్టు మీద నుంచి పొంగుతోంది!! మరి.. ఆ వరద పోటుతో వందేళ్ల కాలం నాటి ఆ ప్రాజెక్టు తట్టుకొని నిలబడుతుందా? ఒకవేళ తెగిపోతే? దిగువన ఉన్న 25 గ్రామాలు, అక్కడి ప్రజల పరిస్థితి ఏమిటి? ఊహించుకుంటేనే అధికారులకు భయంతో ఒళ్లు జలదరించింది. క్షణక్షణం ఈ భయంతోనే నిమిషాలు.. గంటలు భారంగా గడుపుతున్నారు. ఈ గండం గడిస్తే చాలు దేవుడా అనుకుంటున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి హై అలర్ట్‌ ప్రకటించారు. భద్రాద్రి వద్దనైతే గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తుండటంతో ‘తుది ప్రమాద హెచ్చరిక’ జారీ అయింది! గోదావరి పరిధిలోని ప్రాజెక్టులన్నీ రాకాసి నోళ్లలా తెరుచుకొని నీళ్లు కక్కుతున్నాయి! జలదిగ్బంధంతో రాకపోకలు స్తంభించిపోయి గ్రామాలకు గ్రామాలే బిక్కుబిక్కుంటున్నాయి! ప్రజలకు నిలువ నీడ కరువవుతోంది. కాలనీల్లో.. ఇళ్ల చుట్టూ.. ఇళ్లలోనూ అంతా నీరే! మట్టి, తారు రోడ్లన్నీ ఎక్కడికక్కడ తెగిపోతుండటంతో ఆ నష్టమూ అపారమే! మరి.. వాన ఆగేదెన్నడో.. వరద తగ్గేదెన్నడో గానీ రాష్ట్రమంతా జలప్రళయంగా మారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి! వానలు తగ్గాలని ప్రార్థనలు చేయండంటూ సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ పిలుపునివ్వడం రాష్ట్రంలో నెలకొన్న ‘పరిస్థితి’కి అద్దం పడుతోంది. 


67 ఏళ్లలో ఈ స్థాయి వరద తొలిసారి 

కడెం ప్రాజెక్టును వరదపోటు వణికిస్తోంది. మంగళవారం రాత్రి ఉధృతమైన వరద.. బుధవారం మధ్యాహ్నానికి తగ్గినట్టే తగ్గి కాసేపటికి మరింతగా పెరగడంతో ప్రాజెక్టు నిలబడుతుందా? అన్న ఆందోళన ప్రభుత్వం, అధికార యంత్రాంగంలో నెలకొంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 705 అడుగుల మేర నీటి నిల్వ ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠతో రాష్ట్రమంతా కడెంవైపే చూస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకున్న 18 గేట్లన్నీ తెరిచినా బయటకు వెళ్లే నీళ్లు (స్పిల్‌ వే సామర్థ్యం) 3లక్షల క్యూసెక్కులే! మంగళవారం రాత్రి 12 గంటల నుంచి ప్రాజెక్టులోకి పెరిగిన ప్రవాహం, బుధవారం తెల్లవారుజామున 2-4 గంటల సమయంలో 5.10 లక్షల క్యూసెక్కులుగా పోటెత్తింది. గత 67 ఏళ్లలో ప్రాజెక్టుకు ఈ స్థాయి ఇన్‌ఫ్లో లేదని అధికారులు చెప్పారు. ఇలా ఔట్‌ఫ్లోను మించి ఇన్‌ఫ్లో వస్తుండటంతో వారిలో ఆందోళనమొదలైంది. పైగా 18 గేట్లలో ఒక గేటు తెరుచుకోక మొరాయించడం కలవరపాటుకు గురిచేసింది. వరద పెరుగుతుండటంతో అధికారులు చేతులెత్తేశారు. అయితే ప్రాజెక్టు తెగిపోతే దిగువన ఉన్న కడెం, దస్తూరాబాద్‌ మండలాల్లోని 25 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ఇల్లు, ఊరు వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాంటూ ఆ రాత్రే ఆ గ్రామాల్లో చాటింపు వేయించారు.  అనంతరం ఆ 25 గ్రామాల ప్రజలను ఖానాపూర్‌, మంచిర్యాల తదితర ప్రాంతాల్లోని స్కూల్‌ భవనాలు, ఇతర కార్యాలయాల భవనాల్లో  ఆశ్రయం కల్పించారు.  ఇటు వరద పెరుగుతుండటంతో ఎటూపాలుపోని స్థితిలో ప్రాజెక్టును కాపాడుకునేందుకు ప్రాజెక్టుకు ఓ పక్కన గండి గొడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన చేశారు. అదే సమయంలో  ప్రాజెక్టు చివరన ఎడమ కాలువను ఆనుకొని మైసమ్మ ఆలయం వద్ద  భారీ గండి పడింది. ఈ గండి నుంచి దాదాపు లక్ష క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి బయటకు వెళుతోంది. దీంతో అప్పటిదాకా టెన్షన్‌ పడ్డ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  బుధవారం మధ్యాహ్ననికి ఇన్‌ఫ్లో 2.99 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 2,99,047 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మైసమ్మ దేవత కరుణతోనే గండి పడి.. దాని ద్వారా భారీగా వరద నీరు బయటకు వెళ్లిపోయిందని కడెంవాసులతో పాటు అధికారులు చర్చించుకోవడం గమనార్హం. అయితే సాయంత్రం మళ్లీ వరద పెరిగింది. 4:15 గంటల సమయంలో 5లక్షల క్యూసెక్కుల వదర పోటెత్తింది. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని అధికారులతో కలిసి మంత్రి అల్లోల పర్యవేక్షించారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని అల్లోల నుంచి సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి తెలుసుకున్నారు. 



విషాద మరణాలు

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో బోరంవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వెంకటేశ్వరపల్లికి చెందిన కన్నం సతీశ్‌ (35) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆస్పత్రికి తరలించేందుకు వాగు దాటించేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. దీంతో వైద్యం అందక అతడు మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు ఉప్పొంగడంతో ఎన్డీఆర్‌ కాలనీ, రాంనగర్‌, ఎల్‌ఐసీ కాలనీ, పాత మంచిర్యాలలోని ఎస్సీ కాలనీలోని ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. ములుగు జిల్లా వాజేడు మండలం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఇప్పగూడెం, చీకుపల్లి, పేరూరు, చింతూరు తదితర 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మండలంలోని భోగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం ముందున్న 300 మీటర్ల చుట్టూ వదర కమ్మేయడంతో ట్రీ హౌస్‌ సగం దాకా మునిగిపోయింది. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురులో ఓ కాపరికి చెందిన ఏడు గొర్రెలు మృతిచెందాయి.  కామారెడ్డి జిల్లా బిచ్చుంద మండలం మెకా గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పోచారం ప్రాజెక్టు ప్రధాన కాల్వలో సబావత్‌ శేఖర్‌ (29) అనే యువకుడు ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. నల్లగొండలో ఇంటిగోడ కూలిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. ఆసిఫాబాద్‌ జిల్లా పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వైద్యం కోసం ఓ గర్భిణి దాటించే ప్రయత్నంలో రాము, సతీశ్‌ అనే ఇద్దరు రెస్క్యూ టీం సభ్యులు నీళ్లలో పడి గల్లంతవడం ఆలస్యంగా వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఇన్‌టేక్‌ వెల్‌ చుట్టూ వరద చుట్టుముట్టింది. దీంతో ఏడుగురు ఇన్‌టేక్‌ వెల్‌లో చిక్కుకున్నారు. బుధవారం ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలో 31.2 సెం.మీ, పెద్దపల్లి జిల్లా ధర్మారంలో 24.5 సెం.మీ, మంచిర్యాల జిల్లా జన్నారంలో 22.9 సెం.మీ,  నిజామాబాద్‌ జిల్లా వర్నిలో 22.8 సెం.మీ, సిరిసిల్ల జిల్లా చందుర్తిలో 13.3 సెం.మీ, హనుమకొండ జిల్లా శాయంపేటలో 10.3 సెం.మీ, భూపాలపల్లి జిల్లా గణపురంలో 9.5సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో 18 పెద్ద చెరువులు, 23 చిన్న చెరువుల కట్టలు తెగిపోయాయి.


మేడిగడ్డకు రికార్డు స్థాయి వరద 

 మేడిగడ్డ బ్యారేజీకి బుధవారం రికార్డు స్థాయిలో 16,71,390 క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది. ఇదో రికార్డు. 2019 జూన్‌ 21న మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇంత పెద్దమొత్తంలో వరద నీరు రాలేదు. నిరుడు జూలైలో వచ్చిన 11,61,000 క్యూస్కెక్కుల వరదే అత్యధికంగా ఉండేది. బ్యారేజీలోని 79 గేట్లను ఎత్తివేసి వస్తున్న వరదను అలానే దిగువకు వదిలేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద 14.600 మీటర్లు, ములుగు జిల్లా ఏటూరునాగారం పుష్కరఘూట్‌ వద్ద 16.950 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే రెండు ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు అర్ధరాత్రి వరకు చివరి ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. శ్రీరాంసాగర్‌లోకి 4,18,960 క్యూసెక్కుల వరద వస్తోంది. 36గేట్ల ద్వారా అంతకు మించి నీటిని దిగువకు వదులుతున్నారు. 


భద్రాద్రి వద్ద చివరి ప్రమాద హెచ్చరిక 

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాణహిత, ఇంద్రావతి నుంచి భారీగా వరద వస్తుండటంతో బుధవారం మధ్యాహ్నం 3:30గంటలకు 53అడుగుల ఎత్తులో ప్రవహించింది. దీంతో జిల్లా కలెక్టర్‌ తుది ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ వరద సాయంత్రం 6 గంటలకు 53.8 అడుగులకు చేరడం గమనార్హం. గురువారం వరకు 64అడుగులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


‘కుప్తి’తోనే భద్రత 

కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు 106 ఏళ్లనాటిది. నిజాం కాలంలో 1916లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా, 1956లోనే ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం దాదాపు 150 చదరపు కిలోమీటర్ల మేర ఉండటం... అంతా అటవీ ప్రాంతం కావడం వల్లే ఆకస్మిక వరదలూ వస్తుంటాయి. ఈ ప్రాజెక్టు పరీవాహకంలో ఈసారి నమోదైన వర్షపాతం గత 500 ఏళ్లలో లేదని నీటిపారుదల శాఖ ప్రకటించింది. కాగా రాష్ట్రంలోని మరే ప్రాజెక్టుకు లేనివిధంగా దీనికి రెండు రకాల గేట్లున్నాయి. 18 గేట్లలో తొమ్మిది స్వదేశంలో తయారైనవైతే మిగిలిన తొమ్మిది జర్మనీకి దిగుమతయ్యాయి. 2018లో ఆకస్మిక వరదల కారణంగా ఒక గేటు కొట్టుకుపోయింది. దీంతో గేట్లన్నింటినీ మార్చాలనే సూచనలు ఉన్నాయి. గేట్లు మార్చడంతో పాటు ఇతర మరమ్మతులకు రూ.500 కోట్లు ఖర్చవుతుందని లెక్క. ఇంత వ్యయం చేసినా కడెం సేఫ్‌ అని అనలేమనేది నిపుణుల అభిప్రాయం. అయితే  ప్రాజెక్టును కాపాడుకునేందుకు ఎగువన 10 టీఎంసీల సామర్థ్యంతో కుప్తి ప్రాజెక్టును నిర్మిస్తే కడెం కు భద్రత ఉంటుందని ప్రభుత్వం భావించింది. అయితే కుప్తి నిర్మాణ ప్రతిపాదనను 5 టీఎంసీలకు కుదించినా ప్రాజెక్టును నిర్మించలేదు. ఇది నిర్మిస్తేనే ఇబ్బందులు తొలుగుతాయని నిపుణుల అభిప్రాయం.


శ్రీశైలంలోకి లక్ష క్యూసెక్కులు 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద వస్తోంది. ఆల్మట్టికి 1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా... అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. దాంతో నారాయణపూర్‌ ప్రాజెక్టు 1.15 లక్షల క్యూసెక్కులు వస్తుండగా... 1.33 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాలకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి 92 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 1.07 లక్షలుగా ఉంది. తుంగఽభద్రకు 1.08 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. నీటిని దిగువకు వదలడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 1.05 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 46.51 టీఎంసీల మేర నీటినిల్వ ఉంది. మూసీకి 3,622 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 3,282 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈదురుగాలులు వీస్తుండటంతో నాగార్జునసాగర్‌లో  బుధవారం లాంచీలను నిలిపివేశారు.  

Updated Date - 2022-07-14T08:38:03+05:30 IST