జయహో.. గణేశా..

ABN , First Publish Date - 2022-09-10T06:03:38+05:30 IST

శ్రీమహాగణపతి నవరాత్రుల పర్వంలో తుదిఘట్టమైన నిమజ్జనోత్సవం వరంగల్‌ మహానగరంలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. తొమ్మిది రోజులపాటు ఆధ్యాత్మిక సందడి చేసిన అనంతరం వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.

జయహో.. గణేశా..
హనుమకొండ సిద్ధేశ్వర గుండంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న దృశ్యం

వెళ్లిరావయ్యా... బొజ్జ గణపయ్యా..
హనుమకొండలో సందడిగా నిమజ్జనం
ముగిసిన నవరాత్రి ఉత్సవాలు
ఊరేగింపుగా తరలిన గణనాథులు
నాలుగు చెరువుల వద్ద నిమజ్జనం
భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు
తెల్లవారుజాము వరకు కొనసాగిన పర్వం


హనుమకొండ కల్చరల్‌, సెప్టెంబరు 9:
శ్రీమహాగణపతి నవరాత్రుల పర్వంలో తుదిఘట్టమైన నిమజ్జనోత్సవం వరంగల్‌ మహానగరంలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. తొమ్మిది రోజులపాటు ఆధ్యాత్మిక సందడి చేసిన అనంతరం వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. శనివారం తెల్లవారుజాము వరకు నిమజ్జనం నిరతరాయంగా కొనసాగింది. మహానగరంలో వివిధ చెరువుల్లో 5వేలకుపైగా విగ్రహాలు, జిల్లాలోని 14 మండలాల్లో చెరువుల్లో మరో వెయ్యి నుంచి పదిహేను వందల గణనాథుల విగ్రహాల నిమజ్జనం జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హనుమకొండలోని సిద్ధేశ్వర గుండంలో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ బంధం చెరువులో, మేయర్‌ గుండు సుధారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రావిణ్య వరంగల్‌లోని చిన్నవడ్డెపెల్లి చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేశారు.

ప్రశాంతం
నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి ఆపశ్రుతి చోటు చేసుకోలేదు. సాయంత్రం సుమారు 4 గంటల నుంచి అరగంట పాటు కురిసిన వర్షం వల్ల నిమజ్జనానికి స్వల్ప అంతరాయం కలిగింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పటికీ తడుచుకుంటూనే భక్తులు వినాయకులతో నిమజ్జనంలో ఉత్సాహాంగా పాల్గొన్నారు. యువకుల కేరింతలు కొడుతుండగా, డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల మధ్య మహిళలు నీరాజనాలు పలుకుతుండగా మండలపాల నుంచి గణపయ్యలు ప్రత్యేక వాహనాల ద్వారా నిమజ్జనోత్సవానికి తరలివెళ్లారు. నిమజ్జనం సందర్బంగా నగరమంతా సందడిగా మారింది. ఎటుచూసినా అందంగా అలంకరించిన వాహనాల్లో రంగు రంగుల విద్యుత్‌దీపకాంతుల మధ్య కోలాహలంగా తరలి వస్తున్న గణపయ్యలే కనిపించాయి. గణపతులను తరలిస్తున్న వాహనాల ముందు యువకులు ఉత్సాహంతో చిందులు వేశారు. మహిళలు కోలాటాలు వేశారు. ఏకరూప దుస్తులు ధరించి సందడి చేశారు ఆటలు ఆడి పాటలు పాడారు. గణపతి పప్పా మోరియా.. జై గణేశా.. జై జై గణేషా.. గణేశ్‌ మహరాజ్‌కి జై.. అంటూ భక్తులు మిన్నంటే నినాదాలతో నగరమంతా ప్రతిధ్వనించింది. హనుమకొండ పట్టణంలో సిద్ధేశ్వర గుండం, కాజీపేట బంధం చెరువు, ములుగ రోడ్డులోని కోట చెరువు, హసన్‌పర్తిలోని పెద్ద చెరువులలో ఘనంగా గణపతి  నిమజ్జనాలు  జరిగాయి.

వేదికలపై నుంచి స్వాగతం
నిమజ్జనానికి శోభాయాత్రగా తరలివెళుతున్న గణనాథులకు స్వాగతం పలికేందుకు విశ్వహిందూ పరిషత్‌ హనుమకొండలో రెండు చోట్ల స్వాగత వేదికలను ఏర్పాటు చేసింది. సిద్ధేశర గుండం వైపు తరలివెళ్లే విగ్రహాలకు స్వాగతం పలికేందుకు హనుమకొండ చౌరస్తాలో, బంధం చెరువు వైపు వెళ్లే విగ్రహాల కోసం నిట్‌ వద్ద ఈ వేదికలను ఏర్పాటు చేశారు. ఈ వేదికల వద్ద తరలివెళుతున్న విగ్రహాలపై పూలుచల్లి వాటికి తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించిన వినాయక మండళ్లను పేరు పేరును అభినందించారు. ప్రశంసలు కురిపించారు. హనుమకొండ చౌరస్తాలో ప్రముఖ ఉపన్యాసకులు గుజ్జుల నర్సయ్య, అలువాల బిక్షపతి, వరంగల్‌ గణేష్‌ ఉత్సవ సమితి కన్వీనర్‌ న్యాలకొండ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

మండలాల్లో..

జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వినాయక విగ్రహాల నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. ఉత్సవ మండలులు తాము తొమ్మిది రోజుల పాటు పూజించిన విగ్రహాలను ఊరేగింపు తీసుకువెళ్లి సమీప చెరువులు, కుంటలల్లో నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి గ్రామపంచాయతీలు తగిన ఏర్పాట్లు చేశాయి. గ్రామాల్లో సైతం ఈసారి పెద్ద సంఖ్యలో విగ్రహాలను ఏర్పాటు చేశారు.

పోలీసుల భారీ బందోబస్తు

హనుమకొండ క్రైం: సెప్టెంబరు 9: నగర పరిధిలో శుక్రవారం గణేశ్‌ నిమజ్జన వేడుకలు విజయవంతం చేసేందుకు పోలీసులు భారీ కసరత్తు చేశారు. భారీవర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోలీసులు నిమజ్జన ప్రదేశాల్లో విధులు నిర్వర్తించారు. సీపీ తరుణ్‌జోషి ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బలగాలు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎ్‌సఎస్‌ వలంటీర్లు, వరంగల్‌ సిటిజన్స్‌ భాగస్వామ్యంతో గణపతి నిమజ్జనోత్సవంలో విధులు నిర్వర్తించారు. నగర రోడ్లు, నిమజ్జన ప్రదేశాల్లో  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అశోక్‌కుమార్‌, హనుమకొండ, వరంగల్‌ ఏసీపీలు కిరణ్‌కుమార్‌, గిరికుమార్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ జితేందర్‌రెడ్డిలతో పాటు వివిధ పోలీసు స్టేషన్‌ల సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది కలిసి గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో తలమునకలయ్యారు. నిమజ్జన ఊరేగింపులో డీజే సౌండ్స్‌ను పోలీసులు నిషేధించినా,  కొందరు  డీజే చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ గణేశ్‌ విగ్రహ శోభయాత్రలో సంతోషాన్ని పంచుకున్నారు. కాజీపేట, వరంగల్‌ ప్రధాన రహదారి నుంచి హనుమకొండ సిద్ధేశ్వర గుండం, కోట చెరువు వరకు వచ్చే రోడ్డును పూర్తిగా పోలీసుల స్వాధీనంలో ఉంచుకున్నారు.


ఈ సారి చిన్న విగ్రహాలను మాత్రమే సిద్ధేశ్వర గుండంలో నిమజ్జనం చేయాలని అధికారులు ఆదేశించడంతో అటుగా రద్దీ తగ్గింది.  రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న రహదారులగుండా భారీ వాహనాలు రాకుండా ఉండేందుకు పోలీసులు అడ్డంగా బారికేడ్లు అమర్చారు. మధ్యాహ్నం 2గంటల నుంచి నగరంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ప్రధాన రహదారిపైకి రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.


పోలీసు శాఖకు చేదోడు వాదోడుగా ఎన్‌సీసీ, ఎస్‌ఎ్‌సఎస్‌, వరంగల్‌ సిటిజన్స్‌, స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థులను నిమజ్జన స్థలాల వద్ద పహారా కాశారు. సిద్ధేశ్వర గుండం, కోట చెరువు చుట్టూ పోలీసులు భద్రతా వలయం ఏర్పాటు చేశారు. నీటి ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు పోలీసులు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. వాహనాల నుంచి తెప్పలపైకి ఎవరూ రాకుండా జాగ్రత్త పడ్డారు.  ఒక్కో మండపం వద్ద ఒక కానిస్టేబుల్‌ను ఉంచి త్వరగా నిమజ్జనానికి బయలుదేరేందుకు పురమాయించారు. ఎలాంటి అల్లర్లకు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు క్యాట్‌పార్టీ, స్పెషల్‌ పార్టీ, స్పెషల్‌ బ్రాంచీ, సీసీఎస్‌ పోలీసులు మఫ్టీలో కాపుకాశారు.Read more