మచ్చలేని నేత జైపాల్‌ రెడ్డి

ABN , First Publish Date - 2022-10-01T08:08:50+05:30 IST

దేశంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు.

మచ్చలేని నేత జైపాల్‌ రెడ్డి

  • నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు
  • దేశంలో రాజకీయ విలువలు పతనం
  • రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి: ఏచూరి
  • మాడ్గులలో జైపాల్‌ రెడ్డి విగ్రహావిష్కరణ 
  • నెక్లెస్‌ రోడ్డులోనూ విగ్రహం పెట్టాలి: రేవంత్‌

ఆమనగల్లు ,సెప్టెంబర్‌ 30: దేశంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల కేంద్రంలో శుక్రవారం కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుభా్‌షరెడ్డి, జైపాల్‌రెడ్డి కుటుంబసభ్యులు తదితరులు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక వాసవి ఫంక్షన్‌ హాల్‌లో పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీతారాం ఏచూరి మాట్లాడారు. దేశంలో పతనమవుతున్న నైతిక, రాజకీయ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యవాదులంతా కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ విలువల పరిరక్షణ కోసం పాటుపడిన అతికొద్ది వ్యక్తుల్లో జైపాల్‌రెడ్డి ఒకరన్నారు. తాను నమ్మిన రాజకీయ సిద్ధాంతాలకు జైపాల్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని, ఆరు దశాబ్దాలు మచ్చలేని నాయకుడిగా రాజకీయ జీవితాన్ని కొనసాగించారని అన్నారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమేనని జైపాల్‌ రెడ్డి చాటిచెప్పారని జస్టిస్‌ సుభా్‌షరెడ్డి అన్నారు. యువత జైపాల్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవచేసేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 


మెట్రోకు జైపాల్‌రెడ్డి పేరు: రేవంత్‌రెడ్డి 

ఏడాది తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మెట్రో రైల్‌కు జైపాల్‌రెడ్డి పేరు పెట్టే బాధ్యత తనదని రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర పట్టణాభివృద్ది మంత్రిగా జైపాల్‌రెడ్డి ఉన్న సమయంలో హైదరాబాద్‌కు మెట్రో రైలు మంజూరు చేయించి రూ.1500కోట్లు బడ్జెట్‌ కేటాయించారని గుర్తుచేశారు. జైపాల్‌రెడ్డి ఢిల్లీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించినా తన సొంత నియోజకవర్గమైన కల్వకుర్తి ప్రాంత అభివృద్ధి విషయంలో రాజీపడలేదన్నారు. హైదరాబాద్‌ నెక్లె్‌సరోడ్డులో జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. తాను జైపాల్‌రెడ్డికి రాజకీయ వారసున్ని కాదని, బంధువును మాత్రమేనని పేర్కొన్నారు. దేశంలో విలువల రాజకీయాలకు జైపాల్‌రెడ్డి స్ఫూర్తి అని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్‌రెడ్డి కృషి మరువలేనిదని పేర్కొన్నారు. 

Read more