కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు జైలు

ABN , First Publish Date - 2022-06-07T08:49:38+05:30 IST

: ఓ కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసు అధికారులకు హైకోర్టు నాలుగు వారాలపాటు జైలుశిక్ష విధించింది.

కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు జైలు

జాయింట్‌ సీపీ, మరో ముగ్గురికి శిక్ష విధించిన హైకోర్టు


హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఓ కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసు అధికారులకు హైకోర్టు నాలుగు వారాలపాటు జైలుశిక్ష విధించింది. జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌, జూబ్లీహిల్స్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై నరేశ్‌కు జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. భార్యాభర్తల మధ్య వివాదంలో సదరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తేలడంతో జైలుశిక్ష పడింది. కేవలం మూడేళ్లు మాత్రమే జైలుశిక్ష పడే అవకాశం ఉన్న ఐపీసీ సెక్షన్‌ 498-ఏ కేసులో పోలీసు అధికారులు తమ వాదన వినకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంటూ జక్కా వినోద్‌కుమార్‌ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలుచేశారు.


ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జి.రాధారాణి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత.. పోలీసులు తమ వ్యవహారశైలితో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేల్చింది. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ పోలీస్‌ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీచేసింది. జైలుశిక్షపై డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లేందుకు వీలుగా శిక్ష అమలును 6 వారాలపాటు నిలిపేస్తున్నట్లు పేర్కొంది. 

Read more