జగ్గారెడ్డి బెదిరింపులకు భయపడను

ABN , First Publish Date - 2022-09-28T09:05:29+05:30 IST

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బెదిరింపులకు భయపడేది లేదని వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

జగ్గారెడ్డి బెదిరింపులకు భయపడను

  • మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిది అధికార మదం
  • ఎమ్మెల్యే బంధుగా మారిన దళితబంధు 
  • మూడు కబ్జాలు, ఆరు కమీషన్లుగా పటాన్‌చెరు ఎమ్మెల్యే వ్యవహారం
  • వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

        జగ్గారెడ్డి బెదిరింపులకు భయపడను


 సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బెదిరింపులకు భయపడేది లేదని వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పాదయాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా జిన్నారంలో జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనను బెదిరించినట్టు తెలిసిందని, ఇలాంటి వాటికి వైఎ్‌సఆర్‌ బిడ్డ భయపడదని అన్నారు. జగ్గారెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎ్‌సఆర్‌ చనిపోయిన రోజు జగ్గారెడ్డి పరామర్శకు వస్తే తాము రాజకీయాలు మాట్లాడామని అనడం విచారకరమని, ఆ రోజు తాము పడ్డ బాధ తమకే తెలుసని అన్నారు. ఇవన్నీ జగ్గారెడ్డికి ఏం తెలుసని ఆమె ప్రశ్నించారు. పాలమూరు ఎమ్మెల్యేలంతా కలిసి స్పీకరుకు ఫిర్యాదు చేస్తేనే భయపడలేదని, ఓ మంత్రి తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయిస్తే కూడా బెదరలేదని, దమ్ముంటే అరెస్టు చేయండని తానే సవాల్‌ విసిరానని షర్మిల వివరించారు. దళితబంధుపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. దళితబంధు తనకు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకుంటానని, ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడడం చూస్తే అధికార మదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ‘దళితబంధు ప్రజల సొమ్ము, మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి?’ అని ఆమె ప్రశ్నించారు. 


దళితబంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ఇవ్వడం వల్ల అది ఎమ్మెల్యేల బంధుగా మారిందని విమర్శించారు. ఆ బాధ్యతను ఎమ్మెల్యేలకు కాకుండా కలెక్టర్లు, ఆర్‌డీవోలకు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మూడు కబ్జాలు- ఆరు కమీషన్లతో చక్కగా సంపాదిస్తున్నారని షర్మిల దుయ్యబట్టారు. ఎమ్మెల్యే కుటుంబమంతా అధికారంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కబ్జాల గురించి ఓ విలేకరి వార్త రాస్తే చేతులు నరుకుతానని బెదిరించారని, కబ్జాలు చేయకపోతే నిజాయితీని నిరూపించుకోవాలని ఆమె ఎమ్మెల్యేకు సూచించారు.  తెలంగాణలో ఏ వర్గాన్నీ ఆదుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేత కావడం లేదని షర్మిల విమర్శించారు. బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ.. వాటి డబ్బులు కేసీఆర్‌ ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ‘మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా?, ఢిల్లీ లిక్కర్‌ స్కాం నుంచి ఇస్తున్నారా? ఫినిక్స్‌ కంపెనీ నుంచి ఇస్తున్నారా? కాళేశ్వరంలో దోచుకున్న డబ్బులతో ఇస్తున్నారా?’ అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ బాసర ట్రిపుల్‌ ఐటీకి వెళ్లడం చూస్తే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఉన్నదని షర్మిల విమర్శించారు. 

Read more