ఎడతెరిపి లేని వాన

ABN , First Publish Date - 2022-07-05T10:35:00+05:30 IST

పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిశాయి.

ఎడతెరిపి లేని వాన

  • అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
  • తడిసి ముద్దయిన హైదరాబాద్‌.. బెల్లంపల్లిలో 12 సెం.మీ. వర్షం
  • మరో మూడు రోజుల పాటు వర్షాలే


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎడతెరిపి లేకుండా వాన పడింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అత్యధికంగా 12.75 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ తడిసి ముద్దవగా, రోడ్లన్నీ జలమయమయ్యాయి. రామంతాపూర్‌లో 3.1 సెం.మీ వర్షం కురిసింది. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో కొన్ని చోట్ల వాగులు పొంగి పొర్లాయి. సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్‌లో 8, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 7.2, సిరిసిల్లలో 6, నల్లగొండ జిల్లాలోని చిట్యాలలో 6, నిర్మల్‌ జిల్లాలోని పెంబీలో 6, వికారాబాద్‌ జిల్లాలోని దౌల్తాబాద్‌లో 4, మేడ్చల్‌ జిల్లాల్లోని ఉప్పల్‌లో 3, ఖమ్మం జిల్లాలోని కారేపల్లిలో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి 45,580 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 16 గేట్లను ఎత్తి 43,570 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 


శ్రీరాంసాగర్‌కు 9,838, మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు 2115 క్యూసెక్కులు, నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు 1042, ఆసిఫాబాద్‌ జిల్లాలో వట్టి వాగు ప్రాజెక్టుకు 2162 క్యూసెక్కుల మేర వరద వస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ సమీపంలోని కుంటాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది.  జిల్లాలోని పొచ్చెర జలపాతం సైతం నీటితో కళకళలాడుతోంది. కాగా, రానున్న మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర ఒడిశా దానిని ఆనుకొని ఉన్న దక్షిణ ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం వాయువ్యంగా పయనించి ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ తీరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.

Read more