వాన్‌పిక్‌ కేసులో.. అసైన్డ్‌ భూముల జప్తుపై లోతైన విచారణ జరగాలి

ABN , First Publish Date - 2022-09-28T08:24:51+05:30 IST

సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించిన వాన్‌పిక్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

వాన్‌పిక్‌ కేసులో.. అసైన్డ్‌ భూముల జప్తుపై లోతైన విచారణ జరగాలి

తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించిన వాన్‌పిక్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాన్‌పిక్‌ పోర్ట్స్‌, వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌ కంపెనీలకు సంబంధించి 2014లో జప్తు చేసిన 11,804 ఎకరాల భూముల విడుదలపై మరింత లోతుగా విచారణ జరగాలని స్పష్టంచేసింది. అయితే ఏపీలోని ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జప్తుచేసిన 1,416 ఎకరాల పట్టా భూములను మాత్రం విడుదల చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ను ఆదేశించింది. చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 


రిజర్వు చేసిన అంశంపై మళ్లీ విచారణ

11,804 ఎకరాల అసైన్డ్‌ భూముల విషయంలో మాత్రం తెలంగాణ హైకోర్టు ప్రత్యేక వైఖరి తీసుకోవడం గమనార్హం. ఈ భూముల జప్తుపై మరింత లోతైన విచారణ జరగాల్సి ఉందంటూ.. సదరు పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసినట్లు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎత్తేసింది. తదుపరి విచారణను నవంబరు 14కు వాయిదా వేసింది. రిజర్వుడు కింద కాకుండా తదుపరి విచారణ కింద ఈ కేసును లిస్ట్‌ చేయాలని రిజిస్ర్టీకి ఆదేశాలు జారీచేసింది. ఒక కేసులో తీర్పు రిజర్వు చేసిన తర్వాత.. మళ్లీ వినాలంటూ సదరు కేసును ధర్మాసనం విడుదల చేయడం అరుదని న్యాయనిపుణులు అంటున్నారు.

Read more