Degree examinations: డిగ్రీ పరీక్షల విధానంలో సమూల మార్పులు

ABN , First Publish Date - 2022-12-13T03:54:13+05:30 IST

డిగ్రీ పరీక్షల విధానంలో సమూలంగా మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మూస పద్ధతికి స్వస్తి చెప్పి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహించాలని విద్యామండలి భావిస్తోంది.

Degree examinations: డిగ్రీ పరీక్షల విధానంలో   సమూల మార్పులు

సామర్థ్యాలను పెంపొందించేలా సిలబస్‌

లాంగ్వేజీల్లోనూ ప్రాక్టికల్స్‌.. ఉన్నత విద్యామండలి కసరత్తు

త్వరలో ఐఎస్‌బీ నివేదిక.. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి

ఎంసెట్‌లో మళ్లీ ఇంటర్‌కు వెయిటేజీ..!

కరోనా టైంలో వెయిటేజీ రద్దు.. మారిన పరిస్థితుల్లో మళ్లీ

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ పరీక్షల విధానంలో సమూలంగా మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మూస పద్ధతికి స్వస్తి చెప్పి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహించాలని విద్యామండలి భావిస్తోంది. దీనికోసం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఐఎ్‌సబీ ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ ప్రాక్టీస్‌ ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ శ్రీపాద, పలు యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అనుసరిస్తున్న మూల్యాంకన పద్ధతులు, వాటిలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. ఈ మేరకు కొత్త విధానం రూపకల్పన బాధ్యతలను ఐఎ్‌సబీకి అప్పగించారు. విద్యార్థులకు మేలు చేసే విధంగా మార్పులు ఉండాలని అధికారులు అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించడం, చదువు అనంతరం ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా పరీక్షల విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. కోర్‌ సబ్జెక్టుల్లో మార్పులతోపాటు... ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సంస్కృతం (లాంగ్వేజ్‌) సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశాలపై ఏప్రిల్‌ 30లోగా నివేదిక అందించాలని ఐఎ్‌సబీకి అధికారులు సూచించారు. తద్వారా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులను అమలుచేయనున్నారు. అదేవిధంగా డిగ్రీ సిలబ్‌సను మార్చడంపై సమావేశంలో చర్చించారు. పాఠ్యాంశాల్లో మార్పులు చేయడంతోపాటు మూల్యాంకనంలో వినూత్న పద్ధతులను ప్రవేశపెడితేనే ప్రయోజనం ఉంటుందని సమావేశంఅభిప్రాయపడింది.

Updated Date - 2022-12-13T03:54:19+05:30 IST