పోలీస్‌ నియామకాల్లో..ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అన్యాయం

ABN , First Publish Date - 2022-10-11T08:50:16+05:30 IST

పోలీస్‌ నియామకాల్లో కటాఫ్‌ మార్కులు వివాదాస్పదంగా మారాయి. రిజర్వేషన్‌ కోటాలో ఉన్న అన్ని వర్గాల వారికి కటాఫ్‌ మార్కులను తగ్గించిన ప్రభుత్వం.

పోలీస్‌ నియామకాల్లో..ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అన్యాయం

  • బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్‌ మార్కులు తగ్గింపు
  • ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులను విస్మరించిన సర్కారు

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ నియామకాల్లో కటాఫ్‌ మార్కులు వివాదాస్పదంగా మారాయి. రిజర్వేషన్‌ కోటాలో ఉన్న అన్ని వర్గాల వారికి కటాఫ్‌ మార్కులను తగ్గించిన ప్రభుత్వం... అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్‌) కోటా అభ్యర్థులకు మాత్రం ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. దీంతో వేలాది మంది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో ఇతర క్యాటగిరీలతోపాటే తమకూ కటాఫ్‌ మార్కులు వర్తిస్తాయని ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు భావించారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్షలో మొత్తం 200 మార్కులకుగాను కామన్‌ కటాఫ్‌ మార్కులు 60 వస్తే తదుపరి ఎంపిక ప్రక్రియకు అర్హత సాధిస్తారు. అయితే ప్రిలిమినరీ పరీక్ష అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు తమ కటాఫ్‌ మార్కుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 


ఈ విషయం అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావనకు రావడంతో వారికి కటాఫ్‌ మార్కులు తగ్గిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు క్యాటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని అనుసరించి పోలీస్‌ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక అభ్యర్థులకు 20ు, బీసీలకు 25ు, జనరల్‌కు 30ు కటాఫ్‌ మార్కులుగా ప్రకటించింది. కానీ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు మాత్రం కటా్‌ఫను తగ్గించలేదు. ఫలితంగా వేలాది మంది ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా... పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానాన్ని అవలంభించకపోవడంతో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని నేషనల్‌ ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్స్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ ప్రేమ్‌ గాంధీ తెలిపారు. ఇతర అంశాల్లో మినహాయింపు ఇచ్చినా... కటాఫ్‌ మార్కుల విషయంలో ప్రభుత్వం తమను విస్మరించిందన్నారు. పోలీస్‌ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.

Read more