ఇంజనీరింగ్‌లో.. ఇంటర్నల్స్‌కు మరిన్ని మార్కులు

ABN , First Publish Date - 2022-10-08T10:10:25+05:30 IST

ఇంజనీరింగ్‌ కోర్సులో ఇంటర్నల్స్‌కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని జేఎన్‌టీయూ (హెచ్‌) నిర్ణయించింది.

ఇంజనీరింగ్‌లో.. ఇంటర్నల్స్‌కు మరిన్ని మార్కులు

  • 25 నుంచి 40 మార్కులకు పెంపు
  • థియరీకి 75 నుంచి 60కి తగ్గింపు
  • ఏటా నిర్దేశిత క్రెడిట్స్‌ తప్పనిసరి
  • జేఎన్‌టీయూ కొత్త మార్గదర్శకాలు
  • 2022-23  నుంచే అమలు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కోర్సులో ఇంటర్నల్స్‌కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని జేఎన్‌టీయూ (హెచ్‌) నిర్ణయించింది. ప్రస్తుతం సెమిస్టర్‌ పరీక్షల్లో ఇంటర్నల్స్‌కు 25 మార్కులుండగా, వాటిని 40కి పెంచింది. అలాగే థియరీకి 75 మార్కులుండగా, వాటిని 60కి తగ్గించింది. ఈ మార్పులను ప్రస్తుత విద్యా సంవత్సరం (2022-23) నుంచే అమలుచేయనుంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను యూనివర్సిటీ రూపొందించింది. అదేవిధంగా సెమిస్టర్‌ పొడవునా విద్యార్థులకు ఇంటర్నల్స్‌ నిర్వహించాలని యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. మిడ్‌ టర్మ్‌-1, 2 పరీక్షలకు కలిపి 25 మార్కులు వేయనున్నారు. అసైన్‌మెంట్స్‌కు 5, వైవా/పీపీటీ/పోస్టర్‌ ప్రజెంటేషన్‌కు మరో 10 మార్కులు ఉంటాయి. మిడ్‌టర్మ్‌ పరీక్షలకు అనుగుణంగా రెండుసార్లు అసైన్‌మెంట్స్‌, వైవాలు ఇచ్చి.. రెండింటి సగటుతో తుది మార్కులు వేస్తారు.


 ఇంటర్నల్స్‌లో ఫెయిలైన విద్యార్థులు నాలుగు వారాల్లోగా మరోసారి రిజిస్టర్‌ చేసుకుని మళ్లీ ఇంటర్నల్స్‌ రాసుకునే అవకాశాన్ని కూడా కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది. అదేవిధంగా.. బీటెక్‌ విద్యార్థులకు ఇప్పటివరకు నాలుగేళ్లలో 160 క్రెడిట్లు ఇస్తుండగా, ఇక నుంచి వాటిని 8 సెమిస్టర్లకు విభజించి ఒక్కో సెమిస్టర్‌కు 20 చొప్పున ఇవ్వనున్నారు. అలాగే ఇంజనీరింగ్‌ విద్యార్థులకు క్రెడిట్‌ ఆధారిత డిటెన్షన్‌ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే జేఎన్‌టీయూ (హెచ్‌) అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో ఈ విధానం ఉన్నప్పటికీ కొవిడ్‌ కారణంగా రెండేళ్లు పక్కన పెట్టారు. 2022-23 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు నిర్దేశిత క్రెడిట్స్‌ సాధించని పక్షంలో పై తరగతులకు వెళ్లే అవకాశం ఉండదు. ఏటా నిర్దేశిత క్రెడిట్స్‌ సాధించి, 75 శాతం హాజరున్న విద్యార్థులను మాత్రమే సెమిస్టర్‌ పరీక్షలు రాసేందుకు అనుమతిస్తారు.

Read more