హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం బంద్‌!

ABN , First Publish Date - 2022-08-31T08:13:42+05:30 IST

గణపతి నవరాత్రుల పండుగ వచ్చిందంటే ట్యాంక్‌ బండ్‌ దగ్గర సందడి అంతా ఇంతా కాదు.

హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం బంద్‌!

ఖైరతాబాద్‌ గణేశుడికి మాత్రమే అనుమతి


క్రేన్లు ఏర్పాటు చేయడం లేదన్న అధికారులు

నిమజ్జనానికి తాత్కాలిక కొలనులు

హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏర్పాట్లు

ఖైరతాబాద్‌ గణేశుడికి మాత్రమే అనుమతి


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): గణపతి నవరాత్రుల పండుగ వచ్చిందంటే ట్యాంక్‌ బండ్‌ దగ్గర సందడి అంతా ఇంతా కాదు. నగరం నలుమూలల నుంచి వచ్చే గణనాథులు, గణనాథుల నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే భక్తజనంతో కోలాహలంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది గణేశుడి నిమజ్జనానికి హుస్సేన్‌ సాగర్‌ బోసిగా కనిపించనుంది. హుస్సేన్‌ సాగర్‌లో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని అధికారులు నిర్ణయించారు. ఒక్క ఖైరతాబాద్‌ వినాయకుడిని తప్ప ఏ విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయరు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో తాత్కాలిక కొలనులు ఏర్పాటు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌ సహా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల పరిధిలోని జలాశయాల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారి్‌స(పీవోసీ) విగ్రహాలను నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు తీర్పునకు అనుగుణంగా అధికారులు ఈ చర్యలకు పూనుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసే నీటికొలనుల్లోనే గణేశ్‌ విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఉత్సవ నిర్వాహకులకు సూచిస్తున్నారు.


మట్టి విగ్రహం.. ఆనవాయితీ..

కిందటేడాది వరకు నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌బండ్‌పై ముప్పైకి పైగా క్రేన్లు ఏర్పాటు చేసి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసేవారు. కానీ ఈసారి క్రేన్లను ఏర్పాటు చేయడం లేదు. ఈ ఏడాది ఖైరతాబాద్‌ వినాయకుడిని(మట్టితో చేశారు) మాత్రమే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. దాదాపు 50 అడుగుల ఎత్తున్న ఈ మహా గణపతి విగ్రహాన్ని వేరే ప్రాంతంలో తరలించడంలో ఉన్న ఇబ్బందులు, హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేయాలన్న ఆనవాయితీ.. పైగా విగ్రహాన్ని మట్టితోనే తయారు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


కిందటేడాది సుప్రీం అనుమతితో

హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించడంపై కిందటేడాది తీవ్ర చర్చ జరిగింది. నిమజ్జనానికి అనుమతి కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ‘ఈ ఒక్కసారికి మాత్రమే’ అంటూ కోర్టు నిమజ్జనానికి అనుమతించింది. 

Read more