బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-07-16T09:00:01+05:30 IST

సమస్యలు తీర్చాలంటూ ఇటీవల విద్యార్థులు పెద్దఎత్తున ఉద్యమించిన నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో ఘటన.

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు అస్వస్థత

  • మధ్యాహ్న భోజనం అనంతరం వాంతులు, 
  • కడుపు నొప్పితో వందమంది ఆస్పత్రిలో చేరిక
  • 9 మంది ఐసీయూలో.. ఇద్దరి పరిస్థితి విషమం 
  • నిజామాబాద్‌ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స
  • మరో 500 మందికి స్పల్ప అనారోగ్యం  
  • బాధ్యులపై కఠిన చర్యలు.. విచారణ: సబిత
  • వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆరా
  • ఆహారం, నీరు కలుషితం కారణం: అధికారులు

బాసర, జూలై 15: సమస్యలు తీర్చాలంటూ ఇటీవల విద్యార్థులు పెద్దఎత్తున ఉద్యమించిన నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో ఘటన..! శుక్రవారం మధ్యాహ్నం భోజనం వందలాది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో 600 మంది అస్వస్థులయ్యారు. యూనివర్సిటీ మెస్‌లో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 వేల మంది విద్యార్థులు భోజనం చేశారు. తర్వాత హాస్టళ్లకు వెళ్లిన వీరిలో ఒక్కొక్కరుగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. దీంతో అధ్యాపకులు తమ కార్లలో వర్సిటీలోని ఆస్పత్రికి తరలించారు. 9 మంది విద్యార్థులకు నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అస్వస్థులైన మరో వందమందిలో కొందరిని నిజామాబాద్‌, నవీపేటలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో, ఇంకొందరిని ట్రిపుల్‌ ఐటీలోని ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు 400-500 మంది స్వల్ప అనారోగ్యానికి గురికాగా, చికిత్స అనంతరం హాస్టళ్లకు పంపించేశారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడమే ఈ ఘటనకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్‌ ప్రైవేటు ఆస్పత్రిలో విద్యార్థులను పరామర్శించిన డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశశరు.


మెనూలో అనధికారికంగా ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల మెనూలో అధికారికంగా ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ లేదు. అయితే, స్టూడెంట్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ (ఎస్‌జీసీ), అధికారులు కలిసి 3 నెలల కిందట అనధికారికంగా మార్పు చేశారు. వారంలో మూడు రోజులు ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్న భోజనంలో పప్పు, కర్రీ, చట్నీ, అరటి పండు అందించాలి. కానీ, ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ వడ్డించారు. కాగా, గుడ్లు చెడిపోయినందునో, సరిగా ఉడకకనో విద్యార్థులు అస్వస్థులైనట్లు తెలుస్తోంది. మరోవైపు వంటకు నాసిరకం సరుకులు వాడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.  నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ శుక్రవారం రాత్రి వరకు ట్రిపుల్‌ ఐటీలో పరిస్థితులను పర్యవేక్షించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటన విడుదల చేశారు.


విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడిన సంజయ్‌

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వి ద్యార్థులతో ఆయన ఫోన్‌లో మాట్లా డారు. ఆహారం కలుషితానికి కారకు లపై చర్యలకు డిమాండ్‌ చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీపై సీఎం కేసీఆర్‌ మొదటినుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.


బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: రేవంత్‌

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలకు ప్రభుత్వాన్ని డిమాం డ్‌ చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.


నిజామాబాద్‌లో వెంకట్‌ను అడ్డుకున్న పోలీసులు

నిజామాబాద్‌ ఆస్పత్రిలోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ నాయకులు, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలతో ఆస్పత్రి లోపలికి వెళ్లేందుకు వెంకట్‌ యత్నించారు. దీంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ట్రిపుల్‌ ఐటీ ఫుడ్‌ కాంట్రాక్టర్‌ను తొలగించాలని, విద్యార్థుల అస్వస్థతకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి, కార్యదర్శి నాగరాజు డిమాండ్‌ చేశారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని విమర్శించారు. కాగా, ట్రిపుల్‌ ఐటీ ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


ఘటనపై వైద్య మంత్రి హరీశ్‌ ఆరా

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు.. ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌, జిల్లా కలెక్టర్‌, జిల్లా వైద్యాధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్య బృందాలను పంపాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.

Updated Date - 2022-07-16T09:00:01+05:30 IST