ఇష్టారాజ్యంగా ఆస్పత్రులు!

ABN , First Publish Date - 2022-09-13T05:46:35+05:30 IST

వరంగల్‌ మహా నగరంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. గల్లీకో ఆస్పత్రి ఏర్పాటవుతోంది. ఇరుకిరుకు భవనాల్లో యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే చర్యలు చేపట్టే అవకాశమే కనిపించడం లేదు. మొత్తంగా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రోగుల నుంచి ఫీజుల రూపంలో వేలకు వేలు పిండుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొన్నిసార్లు ఆస్పత్రులకు నోటీసులు పంపుతున్నప్పటికీ స్పందన లేదని తెలుస్తోంది. నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముడుపులు చెల్లించి తమ జోలికి రాకుండా చూసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

ఇష్టారాజ్యంగా ఆస్పత్రులు!
కాకాజీ కాలనీలో పుట్టగొడుగుల్లా వెలిసిన ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు

ఇరుకు గల్లీల్లో, బహుళ అంతస్తుల భవనాల్లో యథేచ్ఛగా ఏర్పాటు
రోగుల ప్రాణాలతో చెలగాటం
ప్రమాదాలు జరిగితే రక్షణ చర్యలకు అవకాశం శూన్యం
ప్రభుత్వ నిబంధనలు గాలికి...
వైద్యరంగంతో సంబంధం లేని వారూ నిర్వాహకులే
ఎటు చూసినా డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఎక్స్‌రే యూనిట్లు
రిజిస్ట్రేషన్‌ లేకుండానే నిర్వహణ
పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు


వరంగల్‌ మహా నగరంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. గల్లీకో ఆస్పత్రి ఏర్పాటవుతోంది. ఇరుకిరుకు భవనాల్లో యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే చర్యలు చేపట్టే అవకాశమే కనిపించడం లేదు. మొత్తంగా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.  అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రోగుల నుంచి ఫీజుల రూపంలో వేలకు వేలు పిండుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొన్నిసార్లు ఆస్పత్రులకు నోటీసులు పంపుతున్నప్పటికీ స్పందన లేదని తెలుస్తోంది. నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముడుపులు చెల్లించి తమ జోలికి రాకుండా చూసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

హనుమకొండ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ చౌరస్తా కేంద్రంగా  కొంతకాలంగా  ప్రైవేటు ఆస్పత్రులు విచ్చలవిడిగా ఏర్పాటవుతున్నాయి.  రోడ్లుకిరువైపులానే కాకుండా, గల్లీల్లో సైతం  కొలువుదీరుతున్నాయి. కొత్త ఆస్పత్రుల్లో ఎక్కువభాగం  ఇరుకైన ప్రదేశాల్లో, చిన్న చిన్న భవనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఆస్పత్రుల నిర్వహణకు అగ్నిమాపక శాఖ నుంచి నో ఆబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) తప్పకుండా ఉండాలి. సంబంధిత మునిసిపల్‌ అధికారుల ఆమోదం కూడా ఉండాలి. కానీ వీటిలో వేటికీ సంబంధిత శాఖల నుంచి ఎలాంటి ఎన్‌వోసీలు పొందకుండానే దర్జాగా నడుపుతున్నారు. ఆస్పత్రి ఏర్పాటుకు కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి కూడా క్లియరెన్స్‌ ఉండాలి. పోలీసు శాఖ నుంచి కూడా అనుమతి పొంది ఉండాలి. కానీ ఇవేవీ ఉండడం లేదు. ఏదైనా ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే కనీసం ఫైరింజన్‌ వచ్చే అవకాశం లేదు. ఇతర రక్షణ చర్యలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు.

మార్గదర్శకాలు
ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. వైద్యశాఖ నిబంధనల ప్రకారం ప్రైవేటు ఆస్పత్రి ఏర్పాటుకు తప్పని సరిగా రిజిస్ట్రేషన్‌  చేయించుకోవాలి. ఇందుకు గాను 5 నుంచి 20 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు రూ.750, అదే 50 పడకలపై అయితే రూ.7500, ఇంకా వంద పడకల వరకైతే రూ.10వేలు, 101 నుంచి 200 పడకల ఆస్పత్రికి రూ.15000,  200 పడకలకు రూ.35000 డీడీ తీసి కట్టాల్సి ఉంటుంది. 200 పడకల ఆస్పత్రిలో మల్టీస్పెషాలిటీ ఉండాలి. నిపుణులైన వైద్యులుండాలి. అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉండాలి. ఎంబీబీఎస్‌ డాక్టర్ల పేరుతో రిజిస్టర్‌ చేయాలి.

నిబంధనలు గాలికి..
ఆస్పత్రులను ప్రజలు నివసించే నివాసాలకు దూరంగా, అన్ని  హంగులు కలిగిన విశాలమైన భవనాల్లో ఏర్పాటు చేయాలి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే గదులు, అత్యవసర పరిస్థితుల్లో రోగులను తీసుకురావడానికి, లేదా ఇతర ఆస్పత్రులకు తరలించడానికి విశాలమైన రోడ్లు కలిగిన చోట వీటిని నిర్మించాలి. అగ్నిప్రమాదాలు జరగకుండా అన్నిరక్షణ ఏర్పాట్లను ఏర్పాటు చేయాలి. ఒక వేళ అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రోగులను సకాలంలో, సురక్షితంగా బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు, అలాగే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శకటం సులువుగా లోపలికి వచ్చే మార్గం, ఆస్పత్రి చుట్టూరా ఖాళీ స్థలం ఉండాలి. కానీ ఇవేవీ లేకుండానే నిర్వహిస్తున్నారు. రద్దీ ప్రాంతంలో, ప్రధాన రోడ్ల పక్కన, కాలనీల్లో 300 చదరపు అడుగుల స్థలం దొరికితే చాలు.. అందులో నాలుగైదు అంతస్థుల భవనం నిర్మించి ఆస్పత్రులను తెరుస్తున్నారు. అద్దెకు దొరికినా సరే లీజు అగ్రిమెంట్‌ కుదుర్చుకొని ఏర్పాటు చేస్తున్నారు. చాలా ఆస్పత్రులను ప్రజల ఆవాసాల మధ్య ఏర్పాటు చేస్తుండడంతో దాని చుట్టు పక్కల నివసించే ప్రజలకు లేని రోగాలు అంటుకునే ప్రమాదం ఉంది.

పేరుకే స్పెషలిస్టులు...

కొత్తగా ఏర్పాటవుతున్న ఆస్పత్రుల్లో ఆయా జబ్బులకు చికిత్స అందించడానికి నిపుణులైన ఫలానా డాక్టర్లు ఉన్నారంటూ బోర్డులు తగిలిస్తున్నారు. అది పేరుకే. అందులో ఎవరూ ఉండరు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైనప్పుడు మాత్రం స్పెషలిస్టులను రపిస్తున్నారు. వారితో చికిత్స చేయిస్తున్నారు. స్పెషలిస్టులు అందుబాటులో లేనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటు విషయంలో మరో విచిత్రమేమిటంటే.. వైద్య వృత్తిలో లేనివారు సైతం పెట్టుబడులు పెట్టి కార్పొరేట్‌ స్థాయిలో ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు. తమకు అనుకూలమైన ఎంబీబీఎస్‌ డాక్టర్ల పేర్లు చూపి వారిపేరు మీద ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని రిజిస్టర్‌ కూడా చేయడం లేదు.

రోడ్లపైన జీవ వ్యర్థాలు
ఆస్పత్రుల్లోని బయోవ్యర్ధాలను పారవేసే విషయంలో కూడా వాటి నిర్వాహకులు తగిన  జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రోగుల చికిత్సలో వాడిన సిరంజీలు, ఇంజక్షన్‌ బుడ్లు, బ్యాండేజీలను బయట నిర్లక్ష్యంగా పారేస్తున్నారు. విజయటాకీస్‌ రోడ్డులోని ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలు బయో వ్యర్థాలను ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో నింపి బయట పెడితే వీటిని కార్పొరేషన్‌ పారిశుధ్య సిబ్బంది సాధారణ చెత్తతో కలిపి ట్రాక్టర్లలో తీసుకువెళ్లి డంపింగ్‌ యార్డుల్లో వదిలేస్తున్నారు.   సాధారణంగా ఆస్పత్రి వ్యర్థాలను పారవేయడానికి  బయోవేస్టేజ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. వీటిని సేకరించేందుకు ప్రత్యేకంగా ఉన్న సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలి. అవి ప్రత్యేక వాహనాల్లో బయోవ్యర్థాలను సేకరించి అత్యధిక ఉష్ణోగ్రత వద్ద దహనం చేస్తాయి.  ఇందుకు ఆస్పత్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తాయి. ఈ ఫీజును తప్పించుకోవడానికి ప్రైవేటు ఆస్పత్రులు జీవ వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేస్తున్నాయి.

నామమాత్రంగా కమిటీ
ప్రైవేటు ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులను విచారించడానికి ఉన్న కమిటీ ఉన్నా లేనట్లే అనే చందంగా ఉంది. కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఎంహెచ్‌వో కన్వీనర్‌గా, సీపీ, అదనపు కలెక్టర్‌, ఐఎంఏ సభ్యులుగా ఉండే ఈ కమిటీ ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏదైనా ఘోరం జరిగినప్పుడు మాత్రమే ఈ కమిటీ స్పందిస్తోంది. తూతూ మంత్రంగా విచారణ జరుపుతుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.


ఆస్పత్రుల లెక్క ఇదీ..
అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలు, క్లినిక్‌లు, ఇతరత్రా కలుపుకొని మొత్తం 850 ఉన్నాయి. వీటిలో 7 ఫిజియోథెరపీ సెంటర్లు, 49 డెంటల్‌ క్లినిక్‌లు, 186 క్లినిక్‌లు, సింగిల్‌ బెడ్‌ మొదలుకొని 320 పడకలు కలిగిన ఆస్పత్రులు 174 ఉన్నాయి. వీటితో పాటు 14 నర్సిం గ్‌ హోంలు, 42 డయాగ్నస్టిక్‌ సెంటర్లు, 6 డయాబెటి క్‌ సెంటర్లు, 2 ఇమేజింగ్‌ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇవి అధికారిక రిజిస్టర్‌ అయినవి. ఎలాంటి రిజిస్ట్రేష న్లు లేకుండా నడుస్తున్నవి వందల్లో ఉంటాయని వై ద్య ఆరోగ్య అధికారులే ఒప్పుకుంటున్నారు.

Updated Date - 2022-09-13T05:46:35+05:30 IST