నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతా?

ABN , First Publish Date - 2022-08-19T07:25:52+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది..

నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతా?

రాజకీయాల కోసం దిగజారుడు ఆరోపణలు

మోదీని కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నందుకే నిందలు

కాళేశ్వరం అద్భుతం అని ప్రధాని అన్నారుగా?

అప్పులివ్వడాన్ని సైతం సమర్థించారు కదా?

కేంద్ర మంత్రి షెకావత్‌పై మంత్రి హరీశ్‌ ధ్వజం

వచ్చే నెలాఖరుకు పంప్‌హౌస్‌ల పునరుద్ధరణ

మరమ్మతుల బాధ్యత ఏజెన్సీదేనని వెల్లడి

‘సత్వర’ ప్రాజెక్టులకు అదనపు నిధులివ్వండి

కేంద్రాన్ని రూ.150 కోట్లు అడిగిన తెలంగాణ

ఎందుకివ్వాలో చెప్పమన్న జలశక్తిశాఖ

వాటా నిధులు విడుదల చేయాలని సూచన


హైదరాబాద్‌, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది.. మళ్లీ జరగబోతోందన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను సీఎం కేసీఆర్‌ తప్పుపడుతున్నందుకే కాళేశ్వరంపై బీజేపీ నేతలు గోబెల్స్‌ ప్రచారానికి దిగారని అన్నారు. బీజేపీ నేతల నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేస్తుంటే.. వారికి కడుపు మండుతోందని, అందుకే అవినీతిని అంటగడుతున్నారని విమర్శించారు. నచ్చితే నీతి, నచ్చకపోతే అవినీతా..?, పార్లమెంటు సాక్షిగా మెచ్చుకుని బయటకు వచ్చి అవాస్తవాలు మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్‌ఎ్‌సఎల్పీలో హరీశ్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అద్భుతం. దేశానికి ఆదర్శమని కేంద్ర మంత్రులు గతంలో మెచ్చుకున్నారు. ఇప్పుడదే నోళ్లతో తప్పుగా మాట్లాడుతున్నారు. షెకావత్‌.. బాధ్యతారహితంగా, రాజకీయాల కోసం విలువలను తుంగలో తొక్కుతూ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని వ్యాఖ్యానించారు.


యనది నోరనుకోవాలా? మోరీ అనుకోవాలా..? దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా దానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి తప్పనిసరి. కాళేశ్వరం నిర్మాణానికి అనుమతులు, అప్పులిచ్చింది మీరే కదా? పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజీవ్‌శర్మ కాళేశ్వరానికి అప్పులివ్వడాన్ని గట్టిగా సమర్ధించారు. డీపీఆర్‌తో పాటు అన్ని విషయాలు పరిశీలించాకే అనుమతులిచ్చారు’’ అని హరీశ్‌ పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిగా ఉండి.. కాళేశ్వరం నిర్మించిన ఏజెన్సీకి సామర్థ్యం లేదని షెకావత్‌ మాట్లాడటం తగదన్నారు. ‘‘ కాళేశ్వరం నిర్మాణానికి అంతర్జాతీయ ఓపెన్‌ బిడ్డింగ్‌ నిర్వహించాం. ఈ ప్రాజెక్టు కట్టిన సంస్థనే ఏపీలో జాతీయ ప్రాజెక్టు పోలవరానికీ పనిచేస్తోంది. బీజేపీ పాలనలోని గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటకల్లోనూ ఇదే సంస్థ పనిచేసింది. అక్కడ చేస్తే తప్పులేనిది.. తెలంగాణలో పని చేస్తే తప్పా?’’ అని హరీశ్‌ నిలదీశారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, కాళేశ్వరం నిర్మాణం ఆమోదయోగ్యమేనని .. కేంద్ర సాంకేతిక సలహా కమిటీ 2018 జూన్‌ 14న అనుమతించిందని హరీశ్‌ వివరించారు.


పార్లమెంటులో చెప్పినవి అబద్ధాలా?
కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ అద్భుతంగా పని చేశారని పార్లమెంటులోనే మోదీ మెచ్చుకున్నారని, కాళేశ్వరంలో అవినీతి జరగలేదని నిరుడు జూలై 22న కేంద్ర మంత్రి విశ్వేశ్వర్‌ తుడు, ప్రస్తుత మంత్రి షెకావత్‌ పార్లమెంటులో చెప్పారని.. అంటే అవన్నీ అబద్ధాలా? అని హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు తానే అనుమతి ఇచ్చానని, తెలంగాణకు గ్రోత్‌ ఇంజన్‌ అయిందని కేంద్ర మంత్రి గడ్కరీ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. సీడబ్ల్యూసీ చైర్మన్‌ మసూద్‌ హుేస్సన్‌ కూడా కాళేశ్వరంను సందర్శించి మెచ్చుకున్నారన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం సమయానికి ముందే పూర్తయిందని, ప్రాజెక్టు కోసం చేసిన అప్పులను సద్వినియోగం చేసుకుంటున్న తీరు బాగుందని మోదీ, గడ్కరీతో పాటు, మసూద్‌ హుేస్సన్‌, రాజీవ్‌ ప్రశంసించిన వీడియోలను మీడియాకు ప్రదర్శించారు. అప్పుడలా.. కితాబునిచ్చి మాట మార్చడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. కేంద్ర మంత్రులు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు.  

అసాధారణ వరద వల్లే మునక
గోదావరి వరదల స్థాయి అసాధారణంగా.. 108 మీటర్లు దాటిందని, దీంతో పంప్‌హౌజ్‌ రెగ్యులేటర్‌ గేట్ల రబ్బర్‌ సీల్స్‌ ఊడిపోయి ఫోర్‌ బేలోకి పెద్దఎత్తున నీళ్లు వచ్చాయని హరీశ్‌ తెలిపారు. అతి భారీ వర్షాలకు పంప్‌హౌజ్‌ 220 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ సరఫరా చేేస టవర్లు కూడా కూలిపోయాయని మంత్రి పేర్కొన్నారు. ఉధృత వర్షాలకు కరకట్టపై నుంచి నీరు పొంగిపొర్లడం వల్లనే.. అన్నారం పంప్‌హౌజ్‌ నీట మునిగిందని చెప్పారు. అయినప్పటికీ అన్నారం పంప్‌హౌజ్‌ మొత్తం సురక్షితంగా ఉందని, కన్నెపల్లి పంప్‌హౌజ్‌లో బిగించిన 17 పంపుల్లో 3 మాత్ర మే దెబ్బతిన్నాయని మంత్రి స్పష్టం చేశారు. నీట మునిగిన పంపులను పునరుద్ధరించే భాద్యత పూర్తిగా ఏజెన్సీదేనని, రాష్ట్ర ప్రభుత్వంపై   భారం పడదన్నారు. పంప్‌హౌజ్‌ల మునక పూర్తిగా ప్రకృతి విపత్తు వల్ల జరిగిందని తెలిసిపోతున్నా డిజైన్‌ లోపమని, నాణ్యతా లోపమని   దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని హరీశ్‌ మండిపడ్డారు. సెప్టెంబరు నెలాఖరు నాటికి మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌజ్‌లను పునరుద్ధరించి యథావిధిగా నీటిని ఎత్తిపోస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూతపడాలని కోరుకుంటూ బీజేపీ నేతలు రాక్షసానందం పొందే ప్రయత్నం చేస్తున్నారని వారి ఆశ ఆడియాస కాక తప్పదని హరీశ్‌ అన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం ఆపితే కేసీఆర్‌ రైతుబంధు ఇవ్వరని భావిస్తున్న బీజేపీ.. ఉచిత కరెంటుకు కూడా అడ్డుపడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం 200 శాతం పెరిగిందని, కేంద్రం యాసంగి పంటను కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని హరీశ్‌ పేర్కొన్నారు.

పకడ్బందీగా జర్నలిస్టులకు ఈహెచ్‌ఎస్‌ 
‘ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)’ పరిధిలోకి జర్నలిస్టులు వస్తారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ పథకాన్ని జర్నలిస్టులకు మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం సాయంత్రం అరణ్య భవన్‌లో మంత్రితో సమావేశమై హెల్త్‌ కార్డుల సమస్యపై వినతిపత్రం అందించింది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో హెల్త్‌ కార్డుల తిరస్కరణతో జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హరీశ్‌ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈహెచ్‌ఎస్‌ అమలుకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సెల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్‌ పాత్రికేయుడు పుండరీచారి సతీమణి వినోదకు మెరుగైన చికిత్స అందించాలని ఉస్మానియా సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. 

Read more