కరెంటు పోతే ఆ‘పరేషానే’!

ABN , First Publish Date - 2022-05-01T08:56:03+05:30 IST

రాష్ట్రంలో కొన్ని సర్కారీ దవాఖానాల్లో హఠాత్తుగా కరెంటు పోతే కష్టమే! కొన్ని చోట్ల అప్రకటిత విద్యుత్తు కోతలు..

కరెంటు పోతే ఆ‘పరేషానే’!

  • విద్యుత్తు శాఖ అనుమతితో శస్త్రచికిత్సలు.. 
  • సర్కారీ దవాఖానాల్లో పాతకాలపు జనరేటర్లు
  • మరమ్మతులు చేయించని సూపరింటెండెంట్లు
  • కరెంటు కోతలతో పెరుగుతున్న డీజిల్‌ ఖర్చు
  • వాటి బిల్లులు చెల్లించని వైద్యశాఖ 
  • పీహెచ్‌సీల్లోనూ ఇన్వెర్టర్లే దిక్కు


హైదరాబాద్‌/న్యూ్‌సనెట్‌వర్క్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొన్ని సర్కారీ దవాఖానాల్లో హఠాత్తుగా కరెంటు పోతే కష్టమే! కొన్ని చోట్ల అప్రకటిత విద్యుత్తు కోతలు.. మరికొన్ని చోట్ల జనరేటర్ల మొరాయింపు.. ఫలితంగా వైద్యులు, రోగులకు పరేషానే! ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పు చేస్తుండగా ఉరుములు, మెరుపులతో గాలివాన రావడంతో కరెంటు పోయింది. వైద్యురాలు సెల్‌ఫోన్‌ టార్చిలైట్‌ వెలుతురులో కాన్పు చేసి, తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన ఏప్రిల్‌ 27న జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రిలో 25 కేవీ జనరేటర్‌ సక్రమంగా పనిచేయడం లేదు. సర్జరీల సమయంలో కరెంటు పోతే కష్టంగా ఉంటోందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో జనరేటర్‌ ఉంది. అది మరమ్మతులకు గురైంది. ఆ ఖర్చు, నిర్వహణ వ్యయం భరించలేక ఆస్పత్రి వర్గాలు దాన్ని పక్కనపెట్టేశాయి! మెదక్‌ జిల్లా రామాయంపేట సీహెచ్‌సీలోని జనరేటర్‌ కొంతకాలంగా పనిచేయడం లేదు. అకస్మాత్తుగా కరెంటు పోతే పరిస్థితి ఏంటనే దానికి ఈ ఉదాహరణలు చాలు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్నిచోట్ల అప్రకటిత విద్యుత్తు కోతలున్నాయి. మరికొన్నిసార్లు గాలివానల కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోతోంది.


 దీంతో కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల గద్వాల జిల్లా ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేస్తుండగా కరెంటు పోయింది. అక్కడ జనరేటర్‌ పనిచేస్తుండడంతో సమస్య లేకపోయింది. ప్రస్తుతం జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో జనరేటర్లను ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ సెంటర్లలో కొన్నిచోట్ల ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఇన్వెర్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. కొన్ని సీహెచ్‌సీల్లో ఇన్వెర్టర్లు కూడా లేవు. కొన్ని పీహెచ్‌సీల్లో మాత్రం ఇన్వెర్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం పీహెచ్‌సీల్లోనూ ప్రసవాలు, చిన్నపాటి సర్జరీలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పైగా సాధారణ కాన్పులు చేయాలని సూచించింది. కొన్నిసార్లు సహజ ప్రసవానికి 24 గంటలు కూడా పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అటువంటప్పుడు అన్ని పీహెచ్‌సీల్లో జనరేటర్ల వ్యవస్థను కచ్చితంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 


పాతకాలపు జనరేటర్లతో ఇబ్బందులు..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్నిచోట్ల కాలం చెల్లిన జనరేటర్లున్నాయి. వాటికి మరమ్మతులు చేయిస్తే కొన్నదాని కంటే ఎక్కువ ఖర్చవుతుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. వాటి నిర్వహణను కూడా ఆస్పత్రి సూపరింటెండెంట్లు పట్టించుకోవడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో కరెంటు పోయినా, జనరేటర్లు మొరాయించినా ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. వికారాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ సెంటర్‌కు, ఆస్పత్రికి వేర్వేరుగా జనరేటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఆస్పత్రి జనరేటర్‌ చాలా పాతది. ఆస్పత్రి అవసరాలకు 100 కేవీ జనరేటర్‌ కావాలని అక్కడి వైద్య సిబ్బంది చెబుతున్నారు. కొన్నిచోట్ల అప్రకటిత కరెంటు కోతలుంటున్నాయి. దీంతో డీజిల్‌ వినియోగం రెట్టింపైనట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు తాండూరు జిల్లా ఆస్పత్రిలో పది రోజుల క్రితం వారానికి 60 లీటర్ల డీజిల్‌ను జనరేటర్ల కోసం వినియోగించేవారు. ప్రస్తుతం అది 100 లీటర్లకు చేరుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఇక వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోని నాలుగు జనరేటర్లకు సంబంధించి రూ.50 లక్షల డీజిల్‌ బిల్లు పెండింగ్‌ ఉంది. ఆ బకాయిలు చెల్లించకపోవడంతో వాటి నిర్వాహకుడు డీజిల్‌ పోసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ఏదైనా ఆపరేషన్‌ చేయాల్సి వస్తే విద్యుత్తు శాఖ అధికారుల అనుమతితో చేస్తున్నారు. 

Updated Date - 2022-05-01T08:56:03+05:30 IST