పిల్లలకు ఏం జరిగినా కాలేజీదే బాధ్యత

ABN , First Publish Date - 2022-11-25T00:53:55+05:30 IST

సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మారేడుపల్లి కస్తూర్బా కళాశాల విద్యార్థినుల తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

పిల్లలకు ఏం జరిగినా కాలేజీదే బాధ్యత

కస్తూర్బా కళాశాల విద్యార్థినుల తల్లిదండ్రుల ఆగ్రహం

అసలేం జరిగిందో చెప్పాలని డిమాండ్‌

విషయం చెప్పకపోతే ఎలా వైద్యం చేస్తారంటూ మండిపాటు

అడ్డగుట్ట, నవంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మారేడుపల్లి కస్తూర్బా కళాశాల విద్యార్థినుల తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కళాశాలలో జరిగిన ఘటనతో తీవ్ర అస్వస్థతతో విద్యార్థినులను ఆస్పత్రుల్లో చేర్పించిన కాలేజీ యాజమాన్యం ఆ తర్వాత వారి గురించి పట్టించుకోకపోవడంపై బాధిత పేరెంట్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో ఏం జరిగిందో చెప్పకుండా కాలేజీ యాజమాన్యం దాచిపెడితే తాము వైద్యమెలా చేయాలంటూ వైద్యులు పేర్కొంటుండడంతో బాధితుల్లో ఆందోళన మరింత తీవ్రమవుతోంది. వారం రోజులు గడుస్తున్నా పిలల ఆరోగ్యం కుదుట పడకపోవడంతో అసలు ఏం జరిగిందో చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నాళ్లు ఇలా ఆస్పత్రుల్లో ఉండాలంటూ మండిపడుతున్నారు.

కస్తూర్బా జూనియన్‌ కళాశాలలో ఈనెల 18న మధ్యాహ్నం ల్యాబ్‌లో నుంచి పొగ వ్యాపించి దాదాపు 50 మంది విద్యార్థినులు ప్రైవేట్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. అనంతరం వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 20 మందిని సికింద్రాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్నా ఏం ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారో తెలియడంలేదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇన్ని రోజులైనా పిల్లల ఆరోగ్యం కుదుట పడడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు

ఎందుకు దాచిపెడుతున్నారు?

కాలేజీలో ఏమైందో ఎవరూ చెప్పరు.. వారం రోజులైనా వైద్యులకు సైతం విషయం చెప్పడంలేదు. విద్యార్థినులకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. ప్రమాదానికి కారణం చెప్పమంటే కాలేజీ వాళ్లు ఎందుకు విషయం దాచిపెడుతున్నారు. తమ పిల్లలకు ఏమైనా జరిగితే ఊరుకునేదిలేదు. చట్టపరంగా కాలేజీపై ఫిర్యాదు చేస్తాం. - సరళ (విద్యార్థిని తల్లి) .

అసలు విషయం చెప్పాలి ..

కాలేజీలో ఏం జరగలేదని కాలేజీ యజమాన్యం చెబుతుంది. మరి జరిగిందేమిటో చెప్పాలి కదా.. తమ పిల్లలకు ఏమైన అయితే ఎవరు బాధ్యులు. చెత్తనుంచి వచ్చిన దుర్హాసనకు ఇలా జరిగిందంటూ బుకాయిస్తున్నారు. పక్కనే ఇళ్లు ఉన్నాయి కదా. వారికి ఎందుకు ఏం కావడం లేదు. ఇప్పటికైనా అసలు జరిగిన విషయం ఏమిటో చెప్పాలి. - ప్రమీల ( విద్యార్థిని తల్లి)

ఆస్పత్రికి యాజమాన్యం రావడంలేదు..

వారం రోజులుగా తమ కుమార్తె ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. వ్యాధి ఏమిటనేది వైద్యులు చెప్పడంలేదు. ఊపిరితిత్తులతో ఇబ్బందులు పడుతున్న విద్యార్ధునులకు వైద్యం చేస్తున్నారే తప్ప నయం కావడంలేదు. పిల్లల ఆరోగ్య పరిస్ధితిని తెలుసుకునేందుకు కాలేజీ యాజమా న్యం రావడం మానేశారు.

- సుకన్య ( విద్యార్థిని తల్లి)

Updated Date - 2022-11-25T00:53:57+05:30 IST