బీహెచ్‌ఈఎల్‌ను ప్రైవేటీకరించబోం..

ABN , First Publish Date - 2022-12-30T00:17:15+05:30 IST

భారీ విద్యుత్‌ పరికరాల తయారీ సంస్థల్లో అగ్రగామిగా నిలుస్తున్న బీహెచ్‌ఈఎల్‌(భెల్‌) పరిశ్రమను ప్రైవేటీకరించే యోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే తెలిపారు.

బీహెచ్‌ఈఎల్‌ను ప్రైవేటీకరించబోం..
అధికారులతో కలిసి భెల్‌ పరిశ్రమలో పర్యటిస్తున్నకేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌ పాండే

  • ఆ యోచన కేంద్రానికి లేదు

  • కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్‌

భెల్‌కాలనీ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): భారీ విద్యుత్‌ పరికరాల తయారీ సంస్థల్లో అగ్రగామిగా నిలుస్తున్న బీహెచ్‌ఈఎల్‌(భెల్‌) పరిశ్రమను ప్రైవేటీకరించే యోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే తెలిపారు. గురువారం ఆయన బీహెచ్‌ఈఎల్‌ రామచంద్రాపురం యూనిట్‌ను సందర్శించి అధికారులతో సమావేశమయ్యారు. పరిశ్రమలోని ముఖ్యవిభాగాలైన 01 బ్లాక్‌, బ్లేడ్‌షాపులలో పర్యటించి.. ఉత్పత్తి లక్ష్యాలు, భద్రత, నాణ్యతా ప్రమాణాలపై తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలనా భవనంలో వివిధ విభాగాల జీఎంలను కలిసి సంస్థ పురోగతిపై చర్చించారు. అనంతనం భెల్‌ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భెల్‌ పరిశ్రమ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని, పరిశ్రమను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు. పరిశ్రమను ప్రైవేటీకరించబోతున్నారనేది కేవలం ప్రతిపక్షాల ప్రచారం మాత్రమేనని, బీహెచ్‌ఈఎల్‌ను ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని చెప్పారు. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ల తయారీతో పాటు వివిధ ఉత్పత్తిరంగాల్లోకి భెల్‌ ప్రవేశిస్తోందన్నారు. గతంలో పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు, ఇతర పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని, ప్రస్తుతం వాటన్నింటినీ దేశంలోనే తయారు చేసేవిధంగా పరిశ్రమలను పోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్‌ మిట్టల్‌, భెల్‌ సీఎండీ నళిని సింఘాల్‌, డైరెక్టర్‌ రేణుకా గేరా, యూనిట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వరదరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:17:20+05:30 IST