We Salute విజయ్.. అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ

ABN , First Publish Date - 2022-05-12T15:05:32+05:30 IST

We Salute విజయ్.. అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ

We Salute విజయ్.. అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ

హైదరాబాద్‌ సిటీ : అతనో కానిస్టేబుల్‌. విధి నిర్వహణ పూర్తి చేసుకుని ఇంటికి వస్తూ ప్రమాదం బారిన పడ్డాడు. బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో అతని గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు సేకరించి ఐదుగురి ప్రాణాలు నిలిపారు. కానిస్టేబుల్‌ కుటుంబ ఔదార్యానికి పోలీసులు సెల్యూట్‌ చేసి, నివాళులు అర్పించారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌ పైలాన్‌ కాఅలనీకి చెందిన బత్తుల విజయ్‌కుమార్‌ (32) 12వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌.


ఈ నెల 6న నాగార్జున సాగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స తర్వాత మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. మంగళవారం విజయ్‌కుమార్‌ బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో జీవన్‌దాన్‌ కో-ఆర్డినేటర్లు అవయవదానంపై అవగాహన కల్పించగా, కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో మలక్‌పేట, సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రులకు మూత్రపిండాలు, సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి కాలేయం, ఊపిరితిత్తులు, జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి గుండెను తరలించి బాధితులకు అమర్చారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న పోలీస్‌ బెటాలియన్‌ తరఫున పోలీసులు మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలివచ్చారు. విజయ్‌కుమార్‌ భౌతికకాయానికి సెల్యూట్‌ చేసి నివాళులు అర్పించారు. 


13 కిలోమీటర్లు.. 14నిమిషాలు   

నగర ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేసిన మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. మలక్‌పేట యశోద ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రి మధ్య 13.46 కిలోమీటర్లు ఉండగా, 14 నిమిషాల్లో చేరుకునేలా గుండె ఇతర అవయవాలున్న అంబులెన్స్‌కు ఎక్కడా ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Read more