అమ్మకానికి వాలంతరీ భూములు

ABN , First Publish Date - 2022-11-12T03:43:42+05:30 IST

ఇప్పటి వరకూ ఖాళీగా ఉన్న, శివారు ప్రాంతాల్లో ఉన్న భూములనే విక్రయించిన ప్రభుత్వం.. తాజాగా ప్రతిష్ఠాత్మక సంస్థలకు చెందిన భూములను అమ్మేందుకు సన్నాహాలు చేస్తోంది.

అమ్మకానికి వాలంతరీ భూములు

టీఎ్‌సఈఆర్‌ఎల్‌ పరిధిలోనివి కూడా.. రూ.3000 కోట్ల ఆదాయమే టార్గెట్‌

300 ఎకరాలను లేఅవుట్లుగా అభివృద్ధి చేసేందుకు నీటిపారుదల శాఖ నిర్ణయం

అభివృద్ధి పనుల బాధ్యత హెచ్‌ఎండీఏకు ప్రతిష్ఠాత్మక సంస్థల లక్ష్యాలు నీరుగారినట్టే

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకూ ఖాళీగా ఉన్న, శివారు ప్రాంతాల్లో ఉన్న భూములనే విక్రయించిన ప్రభుత్వం.. తాజాగా ప్రతిష్ఠాత్మక సంస్థలకు చెందిన భూములను అమ్మేందుకు సన్నాహాలు చేస్తోంది. గతంలో పలు సంస్థలకు చెందిన భూములను ఇతర సంస్థలు, విద్యాలయాలకు బదలాయించారే తప్ప.. లేఅవుట్లుగా అభివృద్ధి చేసి విక్రయించిన దాఖలాలు లేవు. కానీ, తొలిసారి ఏకంగా రెండు ప్రతిష్ఠాత్మక సంస్థలకు చెందిన 300 ఎకరాల భూములను గంపగుత్తగా అమ్మడానికి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. నీటిపారుదల శాఖ పరిధిలోని నీరు, భూమి యాజమాన్య, శిక్షణ, పరిశోధన సంస్థ(వాలంతరీ)తోపాటు తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్‌ పరిశోధన ప్రయోగశాల(టీఎ్‌సఈఆర్‌ఎల్‌) భూములను విక్రయించాలని నిర్ణయించింది.

ప్రేమావతిపేట, హిమాయత్‌సాగర్‌, కిస్మత్‌పూర్‌ ప్రాంతాల్లో వాలంతరీకి 217.15ఎకరాలు, టీఎ్‌సఈఆర్‌ఎల్‌కు 224.52 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఆయా కార్యాలయాల ప్రాంగణాలు వదిలిపెట్టి, 300 ఎకరాలను లేఅవుట్లుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు ఆయా భూములను హెచ్‌ఎండీఏ చేతికి అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఎకరాకు రూ.10కోట్ల చొప్పున అమ్మినా...రూ.3వేల కోట్ల దాకా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎకరా భూమిని లేఅవుట్‌గా అభివృద్ధి చేస్తే.. 2900 గజాల స్థలాన్ని ప్లాట్లుగా విక్రయించడానికి అవకాశం ఉంటుంది.

అభివృద్ధి చేసిన సంస్థ తన వాటాగా 50 శాతాన్ని 1450 గజాలు తీసుకుంటే, నీటిపారుదల శాఖకు 1450 గజాలు దక్కనున్నాయి. ఈ లెక్కన మొత్తం 4.35 లక్షల చదరపు గజాల స్థలాన్ని అమ్ముకోవడానికి అవకాశం రానుంది. ఇక్కడ గజం భూమి రూ.75 వేల నుంచి రూ.లక్ష దాకా ధర పలికే అవకాశం ఉంటుందని, రూ.3000-3500 కోట్ల వరకూ ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూమి అంతా ప్రభుత్వం చేతిలోనే ఉండటంతో వివాదాలకు తావుండదని భావిస్తున్నారు. అంతేకాదు..వాలంతరి, టీఎ్‌సఈఆర్‌ఎల్‌ కార్యాలయాల భవనాలను కూడా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా అభివృద్ధి చేసి ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

వాలంతరీ, టీఎ్‌సఈఆర్‌ఎల్‌ లక్ష్యాలన్నీ గాలికే..

నీటి పారుదలశాఖలో నియమితులైన ఇంజనీర్లకు నియామక, పునశ్చరణ ఆధారిత శిక్షణ ఇవ్వడం, రైతులు, ఇంజనీర్లకు నీటి యాజమాన్యం, పంటల ఉత్పత్తిపై అవగాహన కల్పించడం వాలంతరీ ప్రధాన లక్ష్యం. 1983లో దీనిని ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పనులు, కన్సల్టెన్సీ సేవలు, మదింపు, ప్రభావ నివేదికలు తయారు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో సామర్థ్యం పెంచే శిక్షణ సంస్థలను స్థాపించడం, నిర్వహించడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక టీఎ్‌సఈఆర్‌ఎల్‌ విషయానికి వస్తే.. దేశంలోనే అత్యంత పురాతన పరిశోఽధన సంస్థ ఇది.

నిజాం హయాంలో దీనిని ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్‌ నిర్మాణాల కోసం నమూనా అధ్యయనాలు చేయడంతోపాటు జలాశయాల్లో పూడిక ఏ మేరకు చేరింది...? నీటి నిల్వ సామర్థ్యం ఏ మేరకు తగ్గిందనే అంశంపై ఈ సంస్థ అధ్యయనాలు చేస్తుంటుంది. సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ ఇస్తుంటుంది. ఈ రెండు సంస్థల భూములను అమ్మాలని, కార్యాలయాలను ఇతర సంస్థలకు అద్దెకు ఇవ్వాలని సర్కార్‌ నిర్ణయించడంతో.. వాటి లక్ష్యాలు నీరుగారనున్నాయి. అంతిమంగా వాలంతరీ, టీఎ్‌సఈఆర్‌ఎల్‌లు నామరూపాలు కోల్పోనున్నాయి.

Updated Date - 2022-11-12T03:45:46+05:30 IST

Read more