Vijayashanthi on Raja Singh Arrest: రాజాసింగ్ అరెస్ట్‌ టీఆర్ఎస్ కర్కశ నైజానికి నిదర్శనం: విజయశాంతి

ABN , First Publish Date - 2022-09-26T21:50:18+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ తనకి నచ్చనివారిపై ఏ విధంగా కక్ష తీర్చుకుంటారన్నదానికి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ వ్యవహారమే...

Vijayashanthi on Raja Singh Arrest: రాజాసింగ్ అరెస్ట్‌ టీఆర్ఎస్ కర్కశ నైజానికి నిదర్శనం: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ తనకి నచ్చనివారిపై ఏ విధంగా కక్ష తీర్చుకుంటారన్నదానికి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ వ్యవహారమే ఒక ఉదాహరణ అని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి చెప్పారు. దాదాపు నెల రోజులుగా చర్లపల్లి జైల్లోనే ఉన్న రాజాసింగ్‌కు  ప్రాణహాని ఉందని, ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించాలంటూ ఆయన సతీమణి హైకోర్టు గుమ్మం తొక్కే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్దయగా... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోందని విజయశాంతి ఆరోపించారు. రాజాసింగ్ జైల్లోనే ఉన్నప్పటికీ.. ఆయన ఇప్పటికీ ఎమ్మెల్యేనే అని ప్రభుత్వం గుర్తించకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ కర్కశ నైజానికి నిదర్శనమన్నారు. జైల్లో రాజాసింగ్‌ను కలిసేందుకు నియోజక ఓటర్లు, పౌరుల ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం హక్కులను కాలరాయడం తప్ప మరొకటి కాదన్నారు. రాజాసింగ్ విడుదల కోసం ఇక్కడివారేగాక మహారాష్ట్రలో సైతం ప్రజలు ర్యాలీలు తీస్తున్నారని విజయశాంతి చెప్పారు. రాజాసింగ్‌ను కలుసుకునేందుకు ప్రజలకున్న హక్కును గుర్తించని పాలకులకు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేనే లేదని రాములమ్మ విమర్శించారు.




హిందూ వాహిని సభ్యుడిగా.. గో సంరక్షణ, శ్రీరామ నవమి శోభాయాత్రల నిర్వహణతో ప్రచారంలోకి వచ్చి.. కార్పొరేటర్‌గా రాజకీయ ప్రవేశం చేసి.. ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన రాజాసింగ్‌పై పలు కేసులు నమోదై పెండింగ్‌లో ఉన్నాయి. రాజాసింగ్‌పై ఇప్పటివరకు మొత్తం 42 కేసులు నమోదయ్యాయి. తెలంగాణతో పాటు యూపీ, కర్ణాటకలోనూ  కేసులు నమోదయ్యాయి. విచారణ అనంతరం కోర్టులు 36 కేసులు కొట్టివేశాయని రాజాసింగ్‌ తరపు న్యాయవాది ఒకరు తెలిపారు. కాగా,  హిందూ ధర్మం కోసం పాటుపడతానని, అందుకోసం దేనికైనా సిద్ధంగా ఉంటానని ఆయన చెబుతుంటారు. గతంలో టీడీపీ, బీజేపీ పొత్తులో టీడీపీ అభ్యర్థిగా మంగళహాట్‌ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికైన రాజాసింగ్‌ ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2014, 2018లో మంగళ్‌హాట్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌. దీంతో శాసనసభా పక్ష నాయకుడిగానూ ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాజాసింగ్‌ ఆందోళన నిర్వహించారు. దీంతో ఆయనను అరెస్టు చేసి తర్వాత విడుదల చేశారు. అనంతరం మళ్లీ అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-09-26T21:50:18+05:30 IST