గంటలో ఆగమాగం

ABN , First Publish Date - 2022-09-27T06:59:16+05:30 IST

మహానగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఉలుకు, పలుకూ లేకుండా సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోతగా కురిసింది.

గంటలో ఆగమాగం
బషీర్‌బాగ్‌లోని కంట్రోల్‌ రూం వద్ద ఏర్పడిన ట్రాఫిక్‌జాం

దంచి కొట్టింది.. వరద  పోటెత్తింది

మహా నగరంలో కుండపోత వర్షం

లోతట్టు ప్రాంతాల్లో మరోసారి పోటెత్తిన వరద

నాంపల్లిలో అత్యధికంగా 9.3 సెం.మీ. వర్షపాతం

గ్రేటర్‌లో రేపు కూడా భారీ వర్షాలు  


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): మహానగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఉలుకు, పలుకూ లేకుండా సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోతగా కురిసింది. సాయంత్రం గంటపాటు కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో మరోసారి వరద పోటెత్తింది. పలుచోట్ల వాహనదారులు ట్రాఫిక్‌ దిగ్బంధంలో చిక్కుకుపోయారు. గంటల తరబడి ప్రయాణిస్తూ గమ్యస్థానాలకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

5.30 గంటల తర్వాత అకస్మాత్తుగా..

సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నగరంలో వర్షం కురిసే సూచనలేవీ కనిపించలేదు. 5.30 తర్వాత అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. నిమిషాల వ్యవధిలోనే వేగం పుంజకుని దంచి కొట్టింది. దీంతో ఎప్పటిలాగే నగర రహదారులపై వరద పొంగి పొర్లింది. దాదాపు గంటకు పైగా 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో కురిసిన వర్షంతో మహానగరం మరోసారి చిగురుటాకులా వణికిపోయింది. పలుప్రాంతాల్లో భీకర వర్షం కురిసింది. నాంపల్లి, మెహిదీపట్నంలో సాయంత్రం 5.30గంటల నుంచి 6 గంటల సమయంలో (అరగంటలో) 5 సెం.మీ.ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

ముసారాంబాగ్‌ బ్రిడ్జిని ముంచెత్తిన వరద..

చాదర్‌ఘాట్‌: భారీ వర్షం కారణంగా ముసారాంబాగ్‌ బ్రిడ్జిపై భారీగా వరద నీరు ప్రవహించింది. వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ద్విచక్రవాహనాలు, కార్ల రాకపోకలకు వరద ప్రవాహం అడ్డంకిగా మారింది. కొంతమంది వరద ప్రవాహంలో నుంచే నడుచుకుంటూ ఇళ్లకు చేరుకున్నారు. భారీ వాహనాలు మాత్రమే రాకపోకలు సాగించాయి. మలక్‌పేట ట్రాఫిక్‌ సిబ్బంది హుటాహుటిన ముసారాంబాగ్‌ బ్రిడ్జిని చేరుకుని వరద నీరు సాఫీగా వెళ్లేందుకు మ్యాన్‌హాల్‌లో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించారు.  దీంతో వాహనదారులు పోలీసులను ప్రశం సించారు.  

14 కి.మీ. దూరానికి  3 గంటలు  

 హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 26(ఆంధ్రజ్యోతి): మన్మధరావు ప్రైవేట్‌ ఉద్యోగి. రాత్రిపూట విధులు నిర్వహిస్తుంటారు. రోజూలాగే సాయంత్రం 5:30కు ఇంటి నుంచి బయల్దేరాడు. కొద్దిసేపటికే ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో అడుగుపెట్టే సందులేకుండా రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిపోయాయి. అటు తిరిగి ఇంటికి వెళ్లలేక.. సమయానికి ఆఫీసుకు చేరుకోలేక గంటల తరబడి రోడ్లపై వాహనంతో కుస్తీపట్టారు. 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యాలయానికి రోజూ 30-40 నిమిషాల్లో చేరుకునే మన్మధరావు 3 గంటలపాటు ట్రాఫిక్‌లో అష్టకష్టాలు పడ్డాడు. రాత్రి 8:30కు ఆఫీ్‌సకు చేరుకున్నాడు. సోమవారం సాయం త్రం నగరంలో వేలాదిమందికి ఇదే సమస్య ఎదురైంది. దీంతో ప్రజలెవరూ రెండు గంటలపాటు నగర రోడ్లపైకి రావొద్దని ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించాల్సి వచ్చింది.

భారీ వర్షం కారణంగా.. ఉప్పల్‌, రామంతాపూర్‌, సరూర్‌నగర్‌, మలక్‌పేట్‌, నాంపల్లి, గన్‌ఫౌండ్రీ, మెహిదీపట్నం, ఆసి్‌ఫనగర్‌,  కోఠి, మొజంజాహి మార్కెట్‌, లక్డీకపూల్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, బేగంపేట్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా ప్రయాణించడంతో ట్రాఫిక్‌ జామ్‌ సమస్య మరింత  జఠిలంగా మారింది.

Updated Date - 2022-09-27T06:59:16+05:30 IST