‘సండే’ సందడి

ABN , First Publish Date - 2022-09-25T07:16:31+05:30 IST

భాగ్యనగరం పండగ శోభను సంతరించుకుంది. ఆదివారం ఒక్కరోజే మూడు పండుగలతో నగరవాసులను హుషారెత్తిస్తోంది.

‘సండే’ సందడి
గన్‌ఫౌండ్రీలోని మెహబూబియా ప్రభుత్వ బాలికల పాఠశాలలో బతుకమ్మ ఆడుతున్న విద్యార్థినులు

భాగ్యనగరంలో త్రిపుల్‌ ధమాకా  
ఓ వైపు క్రికెట్‌ ఆట..  
మరోవైపు బతుకమ్మ పాట..
ఇంకోవైపు ఫార్ములా ఈ-కారు ప్రదర్శన

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరం పండగ శోభను సంతరించుకుంది. ఆదివారం ఒక్కరోజే  మూడు పండుగలతో నగరవాసులను హుషారెత్తిస్తోంది. క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్‌, ఆస్ర్టేలియా టీ-20 ఫైనల్‌ మ్యాచ్‌తోపాటు ఏడాదికోసారి ఆడపడుచులు సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగ, తొలిసారిగా నగరంలో జరిగే ఫార్ములా రేసు  ఈ-కారు ప్రదర్శన ఒకేరోజున రావడంతో నగరంలో కోలాహలం నెలకొంది. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగే టీ20 తుదిపోరుకు భారత జట్టు శనివారం హైదరాబాద్‌కు చేరింది. సిరీ్‌సను ఎవరిని వరిస్తుందనేది నేటి ఫైనల్‌మ్యాచ్‌ నిర్ణయిస్తుండడంతో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు టికెట్లను దక్కించుకున్న అభిమానులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

మార్కెట్‌కు వెల్లువెత్తిన పూలు 
కార్వాన్‌: తొమ్మిది రోజులపాటు మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఆదివారం ఎంగిలిపూలతో ప్రారంభంకానుంది. పండగను పురస్కరించుకుని గుడిమల్కాపూర్‌  మార్కెట్‌కు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వివిధ రకాల పూలు వెల్లువెత్తాయి. యువతులు, మహిళలు శనివారం సాయంత్రం తరలిరావడంతో మార్కెట్‌ కళకళలాడింది. తంగేడు, గునుగు, గులాబీ తదితర పూలను కొనుగోలు చేశారు. చామంతి పూలు కిలో రూ.100 పలకగా, బంతి పూలు రూ.50 ధర పలికింది. 
కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలో ఒకరోజు ముందే బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. హనుమాన్‌ దేవాలయం వద్ద ఘనంగా వేడుకలు జరిగాయి. 

ట్యాంక్‌బండ్‌పై ఫార్ములా ఈ-కారు
నగరంలో తొలిసారిగా జరిగే ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి అందులో పాల్గొనే కారును ప్రజల సందర్శనార్థం ఆదివారం నుంచి ట్యాంక్‌బండ్‌పై అందుబాటులో ఉంచనున్నారు. ఫార్ములా ఈ-కారు రేసుపై మోటారు స్పోర్ట్స్‌ అభిమానులకు ఉత్సాహం కల్పించడానికి, ఇతరులకు అవగాహన కల్పించడానికి జెన్‌ 2 డిస్‌ప్లే కారును కొన్నిరోజులపాటు ట్యాంక్‌బండ్‌పై, ఆ తర్వాత నగరంలోని పలు ప్రదేశాల్లో దీనిని ప్రదర్శించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న నగరంలోని హుస్సేన్‌సాగర్‌ తీరాన ఫార్ములా ఈ-ఫ్రిక్స్‌ కారు రేస్‌ జరగనుంది. మొత్తంగా ఆదివారం నగరంంలో త్రిపుల్‌ ధమాకా ఉండనుంది.

Read more